Idream media
Idream media
దేశంలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది. ఒకపక్క జమిలి ఎన్నికల (ఒకే సారి పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు) చర్చకు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తే…మరికొన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క ఎన్నికల ప్రక్రయలో సంస్కరణలు రావాలని కొన్ని పార్టీలు, మేథావులు, ఎన్నికల వ్యవస్థలోని నిపుణులు కోరుతున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించే అంశంపై మార్పులు రావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని చర్యలు ఆ వైపుగా అడుగులు వేయలేకపోయింది. ఫలితంగా ఆ డిమాండ్లకు సాధికారత లభించలేదు. అయితే ఇదిలా ఉంచితే…ఇటీవలి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపై చర్చ జరుగుతుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ ఏడాది చివరిలో బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారు బయటకువచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సిఈసి అభిప్రాయపడింది.
ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వీలుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న బీహార్ ఎన్నికల ముందు ఈ సంస్కరణలు చేపట్టడం గమనార్హం. కరోనా రోగులతోపాటు ఆ లక్షణాలు కలిగి ఉన్నవారు, క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ అవకాశాన్ని కల్పించింది. 65 ఏండ్లు పైబడిన వయసు వారితో పాటు గర్బిణులు, మధుమేహం, రక్తపోటు, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులతో సహా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారే ఎక్కువగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఇటువంటి వ్యక్తులు బయట తిరగడంపై వైద్య నిపుణులు, ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. గతంలో 80 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు, అత్యవసర సేవలందిస్తూ సొంత రాష్ట్రాల్లో లేనివారు, ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న వారికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండేది.
అయితే ఈ నిర్ణయం ఎన్నికల వ్యవస్థను సవాల్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే 65 ఏళ్లు పైబడిన వయస్సు వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునడంతో ప్రభాలకు గురవుతారు. రాజకీయ పార్టీలు ముందుగానే గుర్తించి తమకు ఓట్లు వేయించుకునే అవకాశం ఉంటుంది. ఓట్ల కొనుగోలుకు ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల ఎన్నికల వ్యవస్థ దిగజారుతుంది. ప్రభుత్వ పథకాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా ఎన్నికల సంఘం ఎప్పుడూ చెప్పే పారదర్శకత, జవాబుదారీ తనం ప్రశ్నార్థకం అవుతాయి.
ఎన్నికల మార్పులకు పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరం లేదా..?
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏమైనా మార్పులు తీసుకొచ్చేముందు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేయలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన గత ఏడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న హేతుబద్ధమైన విధానాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి.
”రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి ఎన్నికల సంఘానికి విస్తృత, సమగ్ర అధికారాలు ఉన్నప్పటికీ గతంలో ఎప్పుడూ కూడా ఈ అధికారాన్ని ఏకపక్షంగా వినియోగించేందుకు ఈసి ప్రయత్నించ లేదు. ఇది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలను పరిగణనలోకి తీసుకోవడం అనే ఒక ఆరోగ్య వంతమైన వాతావరణాన్ని సృష్టించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధానాల్లో మార్పులను తీసుకొచ్చేందుకు పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) అనే భారీ ఎన్నికల సంస్కరణ జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దీనికి చట్టబద్ధమైన సాధికారత లేనప్పటికీ, దీన్ని ఇప్పటి వరకూ ఎవరూ ప్రశ్నించలేదు. ఈ విధంగా చేయడం వల్ల వ్యవస్థలో పారదర్శకత వస్తుంది” అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఏడు దశాబ్ధాలుగా ఎన్నికల సంఘం ప్రవర్తనా తీరు ప్రశంసనీయం, ప్రస్తుతం దాన్ని అనుసరించడం లేదని అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులకు సంబంధించి జాతీయ స్థాయిలో పార్టీలతో సంప్రదింపులకు బీహార్ ఎన్నికల సంఘం రాష్ట్ర పార్టీలతో నిర్వహించిన సమావేశం ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. డిజిటల్ సాంకేతికతను వినియోగించడం ద్వారా జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం కచ్చితంగా సాధ్యమయ్యేదని అన్నారు.