Idream media
Idream media
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న నానుడి. చాలా సందర్భాల్లో అదే జరుగుతోంది కూడా. ఏపీలోని టీడీపీ, సీపీఐ రాజకీయాలు చూస్తున్నా అదే నిజమనిపిస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారికంగా ఒప్పందం జరిగిందనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీని ఎదుర్కోవడం టీడీపీ వల్ల కావడం లేదు. దీంతో ఎవరో ఒకరి తోడు కోసం టీడీపీ ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ఉన్న పరిస్థితితో ఎవరూ కలవడానికి ముందుకెళ్లే సాహసం చేయడం లేదు. నిన్న మొన్నటి వరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా.. కన్నా లక్ష్మీనారాయణ పైకి టీడీపీతో దూరం అంటూనే .. చంద్రబాబు చేసిన విమర్శలనే ఆయన కూడా చేసేవారు. చంద్రబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలనే కన్నా కూడా వినిపించేవారు. దీంతో చంద్రబాబుకు ఒకింత పరోక్ష బలం చేకూరేది. ఇప్పుడు కన్నా పోయి.. సోము వీర్రాజు వచ్చాక.. టీడీపీని ఏకేస్తున్నారు. దీంతో బాబుకు పరోక్ష బలం తగ్గింది.
ఒకే బాటలో ఆ రెండు పార్టీలూ…
ఈ క్రమంలోనే బాబు చూపు కమ్యూనిస్టులపై పడింది. అయితే సీపీఎం మాత్రం ఆయనకు దూరంగానే ఉంటోంది. ఇక మిగిలింది సీపీఐ. ఒక రకంగా చూస్తే టీడీపీ, సీపీఐ రెండూ ఒకే బాటలో పయనిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు బాబుకు పాత మిత్రులే. అయితే, 2014లో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వారు దూరమయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో వారు జనసేనతో చేతులు కలిపారు. అయితే, పవన్ కూడా పోయి పోయి.. బీజేపీకి చేరువయ్యే సరికి కమ్యూనిస్టులు ఒంటరివారయ్యారు. దీంతో వారికి కూడా బలమైన పార్టీ అండ అవసరమైంది. ఈ నేపథ్యంలో సీపీఐ కూడా టీడీపీతో అంటకాగేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరులో రెండు పార్టీల పంథా ఒకేలా ఉంటోంది. కొన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా రెండు పార్టీలు కలిసి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశానికి కూడా ఇరు పక్షాలు ఒకే అజెండాతో వెళ్లడాన్ని బట్టి.. ఈ పార్టీల మధ్య అవగాహన కుదిరిందనే సంకేతాలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ మొదలైతే అది బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.