Idream media
Idream media
దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ. 135 సంవత్సరాల చరిత్ర ఆ పార్టీ సొంతం. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి ప్రముఖులెందరో ఆ పార్టీకి సేవలందించిన వారే. స్వాత్రంత్య ఉద్యమంలో సైతం ఆ పార్టీదే కీలకపాత్ర. అదే భారత జాతీయ కాంగ్రెస్. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి తెలిసిందే. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల్లో బయటపడిన అంతర్గత విభేదాలతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత మసకబారింది. దాన్ని చెరుపుకోవడానికి కాంగ్రెస్ ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు అటు అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఇటు తనయుడు రాహుల్ గాంధీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ ఏడాది చివరలో బిహార్ ఎన్నికలు ఉండడం.. వెంటనే తమిళనాడు సహా మరికొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈలోగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కసరత్తు చేస్తున్నారు.
దూరమైన యువ ఓటర్లు
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావలంటే ప్రధానంగా యువతను ఆకర్షించాలని అధినాయకత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కేటగిరీల వారీగా పరిశీలిస్తే యువ ఓటర్లు పార్టీకి దూరమైనట్లుగా నాయకులు గుర్తించారు. దీంతో యువతే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలతో మాట్లాడుతూ పలు సూచనలు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా క్విజ్, క్రీడల పోటీలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలలో ఆ ప్రయత్నాలు సాగుతున్నాయి కూడా. యూపీ కాంగ్రెస్ ఈ నెల 13, 14 తేదీల్లో యువతకు క్విజ్ పోటీ నిర్వహించనుంది. 16 నుంచి 22 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యక్తిత్వం, సాధించిన విజయాలపై ఈ పోటీలు ఉండనున్నాయి. ఇప్పటికే 5 లక్షల మంది ఈ పోటీలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని, దాదాపు 20 లక్షల మంది వరకూ పాల్గొనే అవకాశం ఉందని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే యువతతో పార్టీ నాయకులు సంభాషించనున్నారు. ఈ ప్రయత్నాలన్నీ రాజకీయ కొత్త ఎత్తుగడలో భాగంగానే కనిపిస్తున్నాయి.
ప్రయత్నాలు ఫలించేనా..?
ఒక్క బిహార్ అసెంబ్లీకి తప్ప, ఈ ఏడాది మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడం…. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి తదితర ఐదు రాష్ట్రాలకు 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ ఆరు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త సారథి నేతృత్వంలో ఓ పర్‌ఫెక్ట్ టీంను తయారు చేసుకుని, ముందుకు సాగే ప్రయత్నాలు చేయాలని నాయకత్వం భావిస్తోంది. దీంతో పాటు వచ్చే ఏడాది జనవరి వరకూ కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిని ఎన్నుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సదస్సు ఏర్పాటు చేసిన అనంతరం అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. రాహుల్ సహా గాంధీ కుటుంబ విధేయులు ఆర్నెళ్లపాటు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో.. జనవరిలో ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సదస్సులో తీసుకునే నిర్ణయాలు, టీమ్ ను బట్టి కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంత వరకూ సఫలం అవుతాయో అన్నది ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.