iDreamPost
iDreamPost
పేరుకైతే థియేటర్లు తెరుచుకున్నాయన్న మాటే కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా కలెక్షన్లు కనీస స్థాయిలో లేవు. ఇప్పటికే చూసేసిన సినిమాలను అదే పనిగా మల్టీ ప్లెక్సులకు వచ్చి డబ్బులు ఖర్చుపెట్టేందుకు ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తమకు తామే వాయిదాను పొడిగించుకుని తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. వైజాగ్ లో తెరిచిన ఓ మల్టీప్లెక్స్ వసూళ్లు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. విపరీతమైన రద్దీ ఉండాల్సిన ఆదివారం రోజే కేవలం మూడు నుంచి నాలుగు వేల మధ్యలో కలెక్షన్ వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దసరా సీజన్ మీద ఇంకెలాంటి ఆశలు లేవు.
ఏ నిర్మాత తన కొత్త చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా లేడు. నో రిస్క్ అని సైలెంట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 13న టెనెట్ ని ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు హిందీ తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డేట్ లేకపోయినా ప్రమోషన్ అయితే మొదలుపెట్టేశారు. ఇప్పటికే విదేశాల్లో విజయవంతంగా ప్రదర్శితమైన టెనెట్ ని చూసేందుకు ఇక్కడ కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయన సినిమాలు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఉండవు. పైగా టెనెట్ చిన్నపిల్లలను ఆకట్టుకునే అవెంజర్స్ తరహా సూపర్ హీరో సినిమా కాదు. యాక్షన్ డ్రామా. క్లిష్టంగా అనిపంచే బోలెడు చిక్కులు ఉంటాయి.
మరి టెనెట్ ఏ రకంగా అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి. సిటీస్ వరకు ఓకే అనుకున్నా బిసి సెంటర్స్ లో టెనెట్ నుంచి ఎక్కువగా ఆశించలేం. ఎంత తెలుగు డబ్బింగ్ అయినా ఇది అందరిని మెప్పించే యునివర్సల్ కాన్సెప్ట్ కాదు. అలాంటప్పుడు మరీ ఎక్కువగా ఊహించుకున్నా ఇబ్బందే. ఇదొక్కటే సరిపోదు. మరికొన్ని తెలుగు హిందీ సినిమాలు కూడా సిద్ధంగా ఉంచితే బ్యాలన్స్ అవుతుంది. కానీ అధిక శాతం థియేటర్ ఓనర్లు మాత్రం నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ లో మాత్రమే తెరిచేందుకు సుముఖంగా ఉన్నారు. మరి ముందే వస్తున్న టెనెట్ ఈ పరిస్థితిని మారుస్తుందా. ఇతర దేశాల్లో యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాని టెనెట్ బాక్సాఫిస్ ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి మరి.