iDreamPost
android-app
ios-app

తెలంగాణకు రెండో రాజధాని..?

  • Published Aug 26, 2021 | 2:25 AM Updated Updated Aug 26, 2021 | 2:25 AM
తెలంగాణకు రెండో రాజధాని..?

హైదరాబాద్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత పదేళ్లు ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి భాగ్యనగరి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. తెలంగాణకు మణిహారం. అయితే తెలంగాణకు ఇంకో రాజధానిగా వరంగల్ ను ప్రకటించాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. కాకతీయుల కాలంలో రాజధానిగా ఉన్న ఓరుగల్లును ఇప్పుడు మళ్లీ తెలంగాణకు రాజధానిగా చేయాలని తాజాగా తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలు కావచ్చు.. వరంగల్, దాని చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం కావచ్చు.. తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

ఉద్యమానికి సిద్ధం..

వరంగల్ ను రాజధాని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న తీన్మార్ మల్లన్న.. ఇందుకోసం ఉద్యమం చేపట్టేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయని, చాలా ఇబ్బందులు పెరిగిపోయాయని చెప్పారు. వరంగల్ లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ విస్తరణ వల్ల జనాలు ఇక్కట్లు పడుతున్నారని, అందుకే వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలని అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే పాదయాత్ర చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు మల్లన్న. అయితే వరంగల్ ను రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ తో యాత్ర చేస్తారా? లేక ఉద్యోగాల కోసం చేస్తారా? ఇంకేవైనా సమస్యల పరిష్కారం కోసం నడక సాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

వరంగల్ అనుకూలమేనా?

హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అయితే.. వరంగల్ లో మూడు పట్టణాలు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట దగ్గర దగ్గరే ఉండటం వల్ల రాజధానిగా మారేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. నిజానికి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరం వరంగలే. గతంలో రాజధాని అంశాన్ని టీఆర్ఎస్ మంత్రులు కూడా లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి మహమూద్ అలీ గతంలో అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరంగా ఉందని, రెండో రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మల్లన్న డిమాండ్ పై వరంగల్ ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. ప్రభుత్వం అందుకు ఓకే అంటుందా? అంటే అనుమానమే. ఒక సభతోనో.. ఇక ర్యాలీతోనే ఇది జరిగే పని కాదు.

Also Read : పొరపాటును సరిదిద్దుకున్నా.. రఘురామరాజు రచ్చ

ఏపీలో మూడు రాజధానులు

తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీకి కూడా హైదరాబాద్ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధాని. విభజన తర్వాత కొన్నాళ్లకే అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాటి సీఎం చంద్రబాబునాయుడు.. అందుకు పనులు ప్రారంభించారు. అయితే పాలన ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. హైదరాబాద్ లో అధికారం కేంద్రీకృతం కావడం వల్ల నవ్యాంధ్ర నష్టపోయిందని, అలా మరోసారి జరగకూడదని, ప్రజలందిరకీ ప్రభుత్వం అందుబాటులో ఉండాలని అనుకున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించారు. జగన్ నిర్ణయం దేశంలోనే సంచలనమైంది. పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు, శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి ఉండేలా బిల్లు రూపొందించారు. ఇందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా రాజముద్ర వేశారు. మూడు రాజధానుల ప్రక్రియ కొనసాగుతోంది. కార్యాలయాల తరలింపు జరుగుతోంది.

మల్లన్న డిమాండ్ ఎందుకోసం?

జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్న.. కొన్నేళ్లుగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపిస్తున్న వారిలో ఈయన ఒకరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నది తీన్మారే. ఐదు నెలల కిందట జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాదాపు గెలిచినంత పని చేసిన మల్లన్న.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించారు. మల్లన్న దెబ్బకు ప్రొఫెసర్ కోదండరాంతోపాటు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

మల్లన్న ఇప్పుడు సడన్ గా వరంగల్ ను రాజధానిగా చేయాలని డిమాండ్ చేయడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా దళితబంధు, హుజూరాబాద్ చుట్టే తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దృష్టి తనవైపు తిప్పుకునేందుకు మల్లన్న ఈ కామెంట్లు చేశారా? లేక పబ్లిసిటీ కోసమే ఇలా అన్నారా? ఏదో ఒక ఉద్యమం లేవనెత్తేందుకు వరంగల్ రాజధాని అంశాన్ని ఎత్తుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ పై ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. బీజేపీ, టీఆర్ఎస్ ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అదే జరిగితే వరంగల్ ను తెలంగాణకు రెండో రాజధానిగా చేసే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం మరి ఏమవుతుందో..!!

Also Read : బెదిరించి బుచ్చయ్య సాధించింది ఏమిటీ ?