Idream media
Idream media
పై శీర్షిక చదివిన వెంటనే గ్రేటర్ రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరికైనా మొట్టమొదటిగా కలిగే అనుమానం అసలు హైదరాబాద్ లో టీడీపీ ఉందా.. అని. వాస్తవానికి అది నిజమే. అయితే.. చెప్పుకోతగ్గ నేతలందరూ టీడీపీని వీడినా అక్కడో, ఇక్కడో ద్వితీయ శ్రేణి నాయకత్వం, కాస్తా కూస్తో కేడర్ మిగిలి ఉంది. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా మొట్టమొదటిగా కుదుపునకు గురయ్యేది తెలుగుదేశం పార్టీయే. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా ఎలాగున్నా, గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం టీడీపీ తన ఉనికిని చాటుకుంది. అత్యధిక స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. అయితే కొద్ది కాలం తర్వాత ఒక్కొక్కరూ టీడీపీని వీడడం మొదలైంది. అసెంబ్లీ, లోక్ సభ.. ఎన్నికలు ఏవైనా ఆ సందర్భంగా భారీ స్థాయిలో టీడీపీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గూటికి చేరిపోయారు. ప్రస్తుతం గ్రేటర్ లో టీడీపీకి చెప్పుకోతగ్గ నేతలెవరూ లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు మిగిలి ఉన్న చోటా మోటా నేతలు కూడా పార్టీని వదిలి వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో…
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గ్రేటర్ లో సత్తా చాటింది. సికింద్రాబాద్ మినహా అన్ని చోట్లా తెలుగుదేశం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెండేళ్ల అనంతరం పరిస్థితి పూర్తిగా మారింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఘోరంగా విఫలమైంది. అనంతరం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయనతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో చాలా మంది టీడీపీ నేతలు కారెక్కారు. కొంత మంది బీజేపీ గూటికి చేరారు. 2018లో అసెంబ్లీ ఎన్నిలకు ముందు మరింత మంది తెలుగుదేశాన్ని వదిలేశారు. 2014 ఎన్నికల్లో బాగా బలంగా ఉన్న టిడిపి ఇప్పుడు ఏకంగా సున్నాకు చేరినట్లయింది.
లోక్ సభ ఎన్నికల్లో పోటీయే లేదు..
లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో పోటీనే చేయలేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ పరిస్థితి మీద దృష్టి సారించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక తెలంగాణ నేతలకూ అందుబాటులో ఉండబోతున్నట్టుగా ఒక ప్రకటన కూడా చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు నేతలకు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటారేమో కానీ, నేతలు మాత్రం చంద్రబాబుకు అందుబాటులో లేరు. లోక్ సభ ఎన్నికలలో కనీసం పోటీలో కూడా ఉండలేని పార్టీకి అధ్యక్షుడిగా ఉండలేక టీడీపీ హైదరాబాద్ నగర విభాగ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాస్, కార్యదర్శి, వివిధ విభాగాల అధ్యక్షులు కూడా తెలుగుదేశానికి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లోకి మారారు. గత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టిడిపి నుంచి టికెట్ పొంది విజయం సాధించిన ఒకే ఒక్క అభ్యర్థి, కెపిహెచ్‌బి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇక గ్రేటర్ ఎన్నికల వంతు..
త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ ఎంసీలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అశావహులంతా అటు అధిష్ఠానం, ఇటు ప్రజల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. వలసలు ప్రారంభమైతే మొదటిగా ఎఫెక్ట్ పడేది తెలుగుదేశం పైనే. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు జీహెచ్ ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని మొత్తం తెలుగుదేశం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీలో ఇంకా మిగిలిఉండిన బ్యాచ్ బీజేపీలో కానీ, టీఆర్ఎస్ లో కానీ చేరే అవకాశాలు ఉన్నాయి. కుదరని వారు కాంగ్రెస్ లోకి చేరిపోతారు. గత అసెంబ్లీ ఎన్నికల నాడే టీడీపీ తెలంగాణ చిత్తు అయ్యింది. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ టీడీపీ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
మరో నేత గుడ్ బై..!
గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి నేతలు ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బేగంపేట ప్రాంతానికి చెందిన టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంగాధర్‌గౌడ్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతో కలిసి గంగాధర్‌గౌడ్ చర్చలు జరిపారు. పార్టీలో చేరితే సముచిత స్థానం ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో ఈనెల 8న బేగంపేటలో జరగనున్న కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ గరికపాటిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు.