Idream media
Idream media
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లో గెలుపు కోసం టీఆర్ఎస్ టీం విస్తృతంగా కృషి చేస్తోంది. ఆ టీం లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం అక్కడే బస చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నవిస్తున్నారు. ఆ టీమ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప ఎన్నిక ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన భగత్ కు టికెట్ కేటాయించిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాగార్జున సాగర్ కు పయనమయ్యారు. అభ్యర్థి వెన్నంటే ఉంటూ అన్నీ తానై నడిపిస్తున్నారు. భగత్ 40 వేల మెజారిటీతో గెలుస్తారని, నాదీ పూచీ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి చాలెంజ్ లు విసురుతున్నారు.
బీసీ వర్గాలతో సమావేశాలు
ఇదిలాఉండగా, ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర తలసాని పోషించడం వెనుక సామాజిక సమీకరణాలు చాలానే ఉన్నాయి. భగత్, తలసాని సామాజిక వర్గం ఒక్కటే కావడం ఓ కారణం అయితే.., ఆ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య లక్షా 5 వేల 495 మంది ఉన్నారు. వారిలో యాదవ ఓటర్ల సంఖ్యే అధికం. వారికి సుమారు 40 వేల ఓట్లు ఉన్నాయి. బీసీ ఓటర్లలో 2 వ స్థానంలో ముదిరాజుల ఓట్లు 12 వేల 721, 3 వ స్థానంలో గౌడ కులస్తులు ఓట్లు 9 వేల 948 వున్నాయి. ముస్లిం మైనార్టీల ఓట్లు 8 వేల 115, రజక సామాజికవర్గం ఓట్లు 7 వేల 896, మున్నూరు కాపుల ఓట్లు 6 వేల 515, కమ్మరి, వడ్ల కులస్తులు 5 వేల 328, కుమ్మరులు 5 వేల 258, వడ్డెరలు 5 వేల 557, పద్మశాలీలు 2 వేల 172, పెరిక కులస్తులు 2 వేల 889, నాయీ బ్రాహ్మణ కులస్తులు 2 వేల 291, బలిజలు 1,164, కంసాలిలు 828, మేర కులస్తులు 546 మంది వున్నారు. మొత్తం బీసీ ఓట్లపై కన్నేసిన తలసాని సామాజిక వర్గాల వారీగా ఆయా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి కోరికలు తీర్చే పనిలో ఉన్నారు.
జానారెడ్డే టార్గెట్ గా..
ప్రధానంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డే టార్గెట్ గా తలసాని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనపైనా, కాంగ్రెస్ పార్టీపైనా ఆరోపణలు చేస్తూ, సవాళ్లు విసురుతూ ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు తమను బండ బూతులు తిడుతున్నారని, కాంగ్రెస్ పార్టీలోని బాధ్యతగల వ్యక్తులు నీచమైన భాష మాట్లాడడం ఏంటని శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో తలసాని ప్రశ్నించారు. ఎప్పుడూ నీతి సూత్రాల గురించి మాట్లాడే జానారెడ్డికి ఎలా మాట్లాడాలో తెలియాదా అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లేక, ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల నివారణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్‌కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత నేటి వరకు జానారెడ్డి నాగార్జున సాగర్ ముఖం చూడలేదని విమర్శించారు. “14 సంవత్సరాలు మంత్రిగా ఉన్న జానారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు.. ప్రజలకు అందుబాటులో లేరు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఏం చేశారని ఉపఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేయాలో ఆ పార్టీ నేతలు చెప్పాలి.” అంటూ తన ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్ గా తలసాని విమర్శలు గుప్పిస్తున్నారు.