iDreamPost
android-app
ios-app

సౌందర్య బయోపిక్ వర్కౌట్ అవుతుందా

  • Published Oct 11, 2020 | 11:38 AM Updated Updated Oct 11, 2020 | 11:38 AM
సౌందర్య బయోపిక్ వర్కౌట్ అవుతుందా

మహానటి సక్సెస్ తర్వాత ఎందరో దర్శక రచయితలు పాత తరం నటీనటుల మీద బయోపిక్కులు చేయాలని తెగ ఉత్సాహ పడిన మాట వాస్తవం. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు రెండూ డిజాస్టర్ అయ్యాక చాలా మంది ఆ ఆలోచన మానుకున్నారు. సావిత్రి గారి జీవితంలో బోలెడు డ్రామా, విషాదం ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులు మహానటికి విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అందులోనూ ఆవిడకున్న అశేష అభిమానులు తమ ప్రేమను వసూళ్ల రూపంలో చూపించారు. ముఖ్యంగా దర్శకుడు నాగ అశ్విన్ నిజాయితీగా ఉన్న కథను చూపించడం చాలా ప్లస్ అయ్యింది.  ఎన్టీఆర్ బయోపిక్ లో మిస్ అయ్యింది ఇదే.

తాజాగా సౌందర్య లైఫ్ ని కూడా తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ కు ముందే ఈ టాక్ వచ్చింది కానీ కరోనా వల్ల దాని గురించి ఎలాంటి సౌండ్ లేకపోయింది. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. సాయి పల్లవి లేదా అనుపమ పరమేశ్వరన్ లలో ఒకరితో ఇది తీయించాలనే ప్లాన్ జరుగుతోందట. అయితే ఇక్కడో సందేహం కలుగుతుంది. సౌందర్య జీవితంలో అసాధారణ మలుపులు లేవు. అందులోనూ రెండున్నర గంటల నిడివికి సరిపడా అసలే ఉండదు. హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం కూడా ప్రమాదవశాత్తే తప్ప అందులో ఎలాంటి కుట్ర కోణం లేదు. ఆ ఘటనకు సంబంధించిన ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. పోలీసులు విచారణ చేశాకే ధృవీకరించుకున్నారు.

అలాంటప్పుడు కేవలం ఫలానా హీరోలతో ఇదుగో ఇలాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించిందని ఆయా విజువల్స్ ని మళ్ళీ రీ షూట్ చేయడం తప్ప పెద్దగా ఏముండదు. పోనీ తనకు బాల్యం నుంచే కష్టాలు ఉన్నాయా అంటే పుట్టిందే మంచి కుటుంబంలో. అందులోనూ నాన్న అప్పటికే రైటర్ కం ప్రొడ్యూసర్. పరిశ్రమకు వచ్చాక కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పెర్ఫార్మన్స్ పాత్రలు చేసింది తప్ప ఎలాంటి వివాదాల్లో ఏనాడూ తలదూర్చలేదు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా అందరు అగ్ర హీరోలతో సూపర్ హిట్స్ లో నటించిన సౌందర్య కథను కేవలం ఆవిడ బ్రాండ్ ని వాడుకుని మార్కెట్ చేసుకోవడానికి సినిమా తీస్తున్నారో లేక బయటి ప్రపంచానికి తెలియని ఏదైనా కొత్త స్టోరీని చూపించబోతున్నారో వేచి చూడాలి