నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల సంఘం అధికారిగా ఆయన స్థాయిలో వివాదాస్పదం అయిన వారు గతంలో ఎవరూ లేరు. ఓ రాజకీయ నేతను మించి ఆయన వ్యవహారం సాగుతోంది. చివరకు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో స్థానిక కారణాలతో జరిగిన సంఘటనపై హుటాహుటీన పర్యటనకు బయలుదేరడం ద్వారా క్రియాశీల రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆయన చట్టాలను అతిక్రమించి అత్యుత్సాహంతో చేస్తున్న చర్యలను హైకోర్టు కూడా తప్పుబట్టేవరకూ వచ్చింది. గతంలో ఎన్నికల వాయిదా అంశంలో సుప్రీంకోర్టు కూడా ఆయన తీరుని విమర్శించింది. తాజాగా మరోసారి కోర్టు ధిక్కారణ పిటీషన్ విషయంలో ప్రచారం కోసం చేస్తున్న పనిగా ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
అదే సమయంలో ప్రివిలైజ్ నోటీసు నిమ్మగడ్డ పీకలమీదకు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా సత్యన్నారాయణ ఆయన మీద ఫిర్యాదు చేశారు. స్పీకర్ వాటిని పరిగణలోకి తీసుకున్నారు. ప్రివిలైజ్ కమిటీకి నివేదించారు. కమిటీ విచారణ వర్చువల్ ప్రాతిపదికన జరుగుతోంది. దాంతో ఈ సమావేశంలోనే ఆయన మీద నోటీసు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దానికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ సమాధానంపై తదుపరి సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఎస్ఈసీ నిమ్మగడ్డ సమాధానంతో సంతృప్తి చెందకపోతే ఆయన మీద తీవ్ర చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.
గతంలో కూడా మహారాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఏకంగా జైలు శిక్ష వేసిన అనుభవం కూడా ఉంది. 2008 ల మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు నందలాల్ అనే ఓ ఐఏఎస్ అధికారి రెండు రోజుల పాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చింది. 2006లో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా చట్టాలను ఉల్లంఘించి ఆయన వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఆ సందర్భంగా తనకు హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు, కనీసం స్పీకర్ తో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎస్ఈసీ కోరినా ప్రివిలైజ్ కమిటీ తిరస్కరించింది. కమిటీ నోటీసుల ప్రకారం హాజరుకాకుండా, కేవలం డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారితో సమాధానం పంపించినందుకు ఆగ్రహించి తొలుత వారం రోజుల పాటు కారాగార శిక్ష విధించినా చివరకు దానిని రెండు రోజులకు పరిమితం చేశారు. దాంతో యూపికి చెందిన ఆ రిటైర్డ్ అధికారి చిక్కుల్లో పడాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్ప పరిణామాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నిమ్మగడ్డ వ్యవహారశైలి పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీనియర్ మంత్రులిద్దరు చేసిన పిర్యాదు ఆధారంగా ఎలాంటి చర్యలకు పూనుకుంటారన్నది చర్చనీయాంశం అవుతోంది. ప్రివిలైజ్ కమిటీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ఎస్ఈసీ కూడా బద్ధుడై ఉండాల్సిన పరిస్థితి అనివార్యంగా నిపుణులు చెబుతున్నారు.