iDreamPost
iDreamPost
ఇప్పటిదాకా డైరెక్ట్ ఓటిటి రిలీజులను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా చూసేందుకు అలవాటు పడ్డ ప్రేక్షకులు ఇకపై తమ డెబిట్/క్రెడిట్ కార్డులను బయటికి తీయాల్సి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కట్టే చందాతో స్టార్ హీరోల సినిమాలను ఫ్రీగా అందించలేక కొన్ని సంస్థలు పే పర్ వ్యూ మోడల్ ని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో ఒకటి రెండు సంస్థలు ఆ ప్రయత్నం చేసినప్పటికీ నాసిరకం కంటెంట్ వల్ల అవి అంతగా వర్కౌట్ కాలేదు. కొద్దిరోజుల క్రితమే జీ5 తన కొత్త యాప్ జీ ప్లెక్స్ తో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఐడ్రీం మీ దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో ఖాలీ పీలి ఈ టైపులో రాబోతున్న మొదటి క్రేజీ మూవీగా కాగా సౌత్ లో ఆ ఘనతను విజయ్ సేతుపతి కెపే రణసింగం దక్కించుకోబోతోంది.
త్వరలో దీన్ని ‘డబ్బులు కట్టి సినిమా చూడండి’ పద్ధతితో విడుదల చేయబోతున్నారు. సౌత్ లోనే ఒక స్టార్ హీరో చిత్రాన్ని ఇలా విడుదల చేయడం ఇదే మొదటిసారి. నాని సుధీర్ బాబుల విని సైతం ప్రేక్షకులు ఫ్రీగానే చూశారు కానీ ఇప్పుడిది మాత్రం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతోంది. డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ వచ్చే నెలలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంత ఓటిటి అయినా పైరసీ విచ్చలవిడిగా ఉన్న ఆన్ లైన్ ప్రపంచంలో కేవలం ఒక్క సినిమాకు టికెట్ కొని ఇంట్లో చూడగలరా అనే అనుమానం లేకపోలేదు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరు కాబట్టి దానికి వంద కాదు రెండు వందలయినా ఆడియన్స్ ఖర్చు పెడతారు. కానీ టీవీ/స్మార్ట్ ఫోన్ లో ఆ
అనుభూతిని కనీసం ఓ పాతిక శాతం కూడా దక్కించుకోలేం.
అలాంటప్పుడు సొమ్ములు పెట్టడం అంటే అనుమానమే. అలా అని ఎవరూ చూడరని కాదు కానీ ఆశించినంత రెవిన్యూ వస్తుందా అనేదే అసలు డౌట్. ఒకవేళ ఈ కెపే రణసింగం కనక ఈ మోడల్ లో సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా అందరూ ఇదే దారిలోకి వస్తారు. సూర్య ఆకాశం నీ హద్దురా కంటే ఇదే ముందు రావొచ్చు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన కెపే రణసింగంకి దర్శకుడు విరుమాండీ. హక్కులు సమానత్వం కాన్సెప్ట్ మీద రూపొందిన ఈ సినిమాలో ఏకకాలంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో అందించబోతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎంత ఒత్తిడి చేస్తున్నా బెదిరిస్తున్నా తమిళ నిర్మాతలు మాత్రం ఇలా డిజిటల్ మార్గంలోనే వెళ్తున్నారు.