బాహుబలికి అయిదేళ్ల కాలాన్ని త్యాగం చేసి తర్వాత సాహోకు మరో రెండు సంవత్సరాలు ధారపోసిన డార్లింగ్ ప్రభాస్ ప్రతి కొత్త సినిమాకూ అభిమానులకు భారీ ఎదురు చూపులు తప్పడం లేదు. పాన్ ఇండియా స్టార్ అయ్యాక మనోడు మరీ అందని ద్రాక్షగా మారిపోయాడు. పోనీ రాధే శ్యామ్ ఈ ఏడాదే వస్తుందనుకుంటే కరోనా మహమ్మారి వల్ల కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీని సంగతలా ఉంచితే నాగ అశ్విన్ ప్రాజెక్ట్ తో పాటు ఆది పురుష్ ని ప్రభాస్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే విడుదల క్రమం మాత్రం మారబోతోందని తాజా టాక్. రామాయణ గాధ ఆధారంగా ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఆది పురుష్ కు ఎక్కువ టైం అవసరం లేదట.
కేవలం నాలుగు నెలల్లో ఎక్కువగా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వాడుకుని పూర్తి చేసేలా టి సిరీస్ సంస్థ ప్లాన్ చేసుకుందట. విజువల్ ఎఫెక్ట్స్ కోసం సమయం అధికంగా తీసుకున్నా షూటింగ్ మాత్రం త్వరగానే కంప్లీట్ చేసి ప్రభాస్ ని వదిలేస్తారు. ఆ తర్వాత నాగ అశ్విన్ ది ఎలాగూ సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి దానికి ఎంత లేదన్నా ఏడాది నుంచి పద్దెనిమిది నెలల టైం అవసరమవుతుందని ప్రాధమికంగా అంచనా వేశారట. అందులోనూ వైరస్ తీవ్రత ఇంకా అధికంగా ఉంది కాబట్టి భారీ క్యాస్టింగ్ తో బయటికి వెళ్లే పరిస్థితులు లేవు. అందుకే ముందు ఆది పురుష్ ఫినిష్ చేసి ఆ తర్వాత వైజయంతి సంస్థ కోసం ప్రభాస్ ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వబోతున్నాడన్న మాట.
ఈ లెక్కన 2021లో రాధే శ్యామ్, 2022లో ఆది పురుష్, 2023లో వైజయంతి సినిమాలు వస్తాయని అర్థమవుతోంది. వీటిలో ఏ నిర్మాతా ఫలానా సీజన్ లో వస్తామని చెప్పనప్పటికీ ఖచ్చితంగా జరగబోయేది మాత్రం ఇదే. రాధే శ్యామ్ ని అక్టోబర్ నుంచి కొనసాగించే అవకాశం ఉంది. హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు మిగిలిన క్రూ డేట్లను చూసుకుని ముందు రామోజీ ఫిలిం సిటీలో షూట్ మొదలుపెట్టి ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటే యూరోప్ వెళ్లే ప్లానింగ్ లో ఉన్నారు. మొత్తానికి ప్రభాస్ నిర్ణయాల్లో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. కావాలని చేసింది కాకపోయినా సబ్జెక్టులకు తగ్గట్టు ఇలాంటివి తప్పవు మరి. అది పురుష్ కి హీరొయిన్ ఇంకా డిసైడ్ కావాల్సి ఉండగా నాగ అశ్విన్ సినిమాకు దీపికా పదుకునేని చాలా రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే