iDreamPost
iDreamPost
ఏడాదికి లేదా నెలకోసారి చందా కట్టి ఓటిటిలో వినోదాన్ని అందుకుంటున్న ప్రేక్షకులకు ఏటిటి రూపంలో కొత్త షాక్ తగలబోతోంది. పే పర్ వ్యూ (ప్రతి వీక్షణకు డబ్బులు)మోడల్ లో జీ ప్లెక్స్ సంస్థ దీనికి శ్రీకారం చుట్టబోతోందని గతంలోనే ఐడ్రీం మీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ పద్ధతితో అక్టోబర్ 2న ఖాలీ పీలి, కేపే రణసింగంలను విడుదల చేయబోతున్నారు. టికెట్ ధర బాలీవుడ్ మూవీకి 299 రూపాయలు, విజయ్ సేతుపతి మూవీకి 199 రూపాయలు మాత్రమే. అదేంటి అన్ని వసతులు ఉన్న మల్టీ ప్లెక్సుకు వెళ్తే 150 నుంచి 200 లోపే ఉంటుంది కదా, మరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనో లేదా ఇంట్లో టీవీలోనో చూస్తే ఇంత రేట్ ఎందుకనే అనుమానం రావడం సహజం. తెలుగులో ఇప్పటికే కొందరు దర్శకులు,మీడియా సంస్థలు ఈ ప్రయోగం చేసినప్పటికీ నాసిరకం కంటెంట్ వల్ల ఫలితం దక్కలేదు.
అయితే సదరు జీ ఆలోచన అలా లేదు. చెల్లించేది కాస్త ఎక్కువగానే కనిపించినా అది ఫ్యామిలీ మొత్తానికి లేదా ఎంతమంది చూడాలనుకుంటే అందరికీ ఒకేసారి ఒకే అమౌంట్ కదా అలాంటప్పుడు భారమేముంది అనుకుంటున్నారు కాబోలు. అయితే ఇక్కడో విషయం మర్చిపోకూడదు. సగటున భారతదేశంలో ప్రతి సినిమాని కుటుంబం మొత్తం థియేటర్లో చూడరు. వ్యక్తిగత వీక్షణాలే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ఫ్రెండ్స్ అధికంగా కంపెనీ ఇస్తారు. ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఇంట్లోనో ఇంకో చోట గుమికూడ లేరు కదా. పోనీ ఇప్పుడు వదిలింది ఏదైనా స్టార్ హీరో సినిమానా లేక బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ మూవీనా. అదేమీ కాదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఇషాన్ ఖట్టర్ హీరో, యాంటీ నెపోటిజం బ్యాచ్ కు టార్గెట్ అయిన అనన్య పాండే హీరోయిన్.ఈ కాంబోని రెగ్యులర్ మోడల్ లో చూడటమే గొప్ప. మరొకటి తమిళ్ లో తప్ప బయట అంతగా మార్కెట్ లేని విజయ్ సేతుపతిది. అలాంటిది మూడు వందలు, రెండు వందలు చెల్లించమంటే అంత ఈజీనా.
అసలే ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సినిమా ఏదైనా ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నది అయినా తమ సబ్స్క్రైబర్స్ దగ్గర ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయడం లేదు. అలాంటిది జీ5 ఇలా చేయడం సాహసమే. నిజానికి సౌత్ లోనూ ఇదే తరహాలో సినిమాలు కొని పే పర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో జీ సంస్థ ఉన్నట్టు టాక్. సోలో బ్రతుకే సో బెటరూని ఈ టైపులో విడుదల చేయొచ్చని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. ఇది నిజమో కాదో కానీ సోషల్ మీడియాలో నెటిజెన్లు జీ మీద గట్టి కౌంటర్లే వేస్తున్నారు. అసలే ఓటిటిని కూడా ఆన్ లైన్ పైరసీ వదలడం లేదు. అలాంటప్పుడు ఇలా టికెట్ రేట్ల పేరుతో ఇంతేసి ధరలు పెడితే సామాన్యులు ఇల్లీగల్ మార్గాల్లోనే సినిమాలు చూసే ప్రమాదం ఉంది. మరి జీ ప్లెక్స్ ఎత్తుగడ ముందుముందు ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. దీన్ని మిగిలిన డిజిటల్ కంపెనీలు కూడా అనుసరిస్తే ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడి థియేటరే నయమనుకునే రోజులు వస్తాయి.