iDreamPost
iDreamPost
టీడీపీ పార్టీ భావి ఆశాకిరణంగా చెప్పబడుతున్న నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు అంటూ ఈ రోజు ఒక ఛానెల్ లో వార్త వచ్చింది . 2019 ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొల్పేందుకు ,ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకొనే ఉద్దేశ్యంతో పాటు , స్థానికంగా పార్టీ ఇన్చార్జ్ లుగా ఉన్నవారి పనితీరు గుర్తించి క్రియాశీలకంగా లేనివారిని తొలగించి కొత్తవారికి పగ్గాలు అప్పచెప్పే కార్యక్రమం కూడా ఈ పాదయాత్రలో భాగం కానుంది అంటూ సదరు ఛానెల్ కథనం వెలువరించింది .ఈ వార్త టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కలిగించే మాట ఏమో కానీ గత అనుభవాల దృష్ట్యా ఈ కథనం పై పార్టీ శ్రేణులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు అని చెప్పొచ్చు.
2019 లో ఘోర ఓటమి పాలైన తర్వాత పార్టీ శ్రేణులు , నాయకులు ఆంటీముట్టనట్టు వ్యవహరిస్తూ , పార్టీ కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి చూపక పార్టీ పై పట్టు తప్పిపోతున్న స్థితిలో పార్టీ నాయకత్వం మారాలి అంటూ కొందరు సీనియర్లు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చిన వేల ఆ అంశాన్ని మరుగున పరుస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలో లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని పార్టీ కేడర్ సమస్యలు,కష్టాలు స్వయంగా తెలుసుకొంటారని కొన్ని మీడియా సంస్థల నుండి 2019 జులైలో పలు వార్తా కధనాలు వెలువడ్డాయి కానీ లోకేష్ పాదయాత్ర కార్యరూపం దాల్చలేదు.
తర్వాత 2020 లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులు పార్టీలకతీతంగా ప్రజలకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేయడం,ఆ సమయంలో టీడీపీ నియోజక వర్గ స్థాయి నాయకులు అందుబాటులో లేకపోవడమే కాకుండా పార్టీ అధినేత చంద్రబాబు, తనయుడు నారా లోకేష్ లు రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్లో మకాం వేసి అప్పుడప్పుడూ జూమ్ మీటింగ్స్ కి పరిమితం కావడంతో పార్టీ కార్యకర్తలలో అసహనం నెలకొని కొన్ని ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహించడానికి ముందుకు రావాలని ఫ్లెక్సీలు వెలియడంతో పాటు కొన్ని సందర్భాల్లో బాబు ముందే జూనియర్ ని తీసుకురావాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు . ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ శ్రేణులందర్నీ ఉత్సాహ పరిచేందుకు యువనేత నారా లోకేష్ త్వరలో పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించనున్నారని 2020 జులై లో మరోసారి వార్తలు వెలువడ్డాయి కానీ ఈ సారి కూడా పాదయాత్ర ఆచరణలోకి రాలేదు .
Also Read : విద్యార్థుల దశ, దిశను తీర్చిదిద్దేందుకు జగన్ మరో కానుక
ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి లోకేష్ పాదయాత్ర చేయబోతున్నాడంటూ బాబు అనుకూల ఛానెల్ లో వచ్చిన కథనాన్ని టీడీపీ నాయకులు,శ్రేణులు విశ్వసిస్తున్నారా అంటే లేదనే చెప్పొచ్చు.వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేకపోవడం , సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతతో జనంలో వైసీపీ పట్ల పెద్దగా వ్యతిరేకత కనపడకపోగా విద్య, వైద్యం, కరోనాని ఎదుర్కొన్న తీరు,కష్టకాలంలోనూ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలతో బడుగు బలహీన వర్గాల్లో వైసీపీ పట్ల ఉన్న సానుకూలత చెక్కు చెదరకపోవడంతో టీడీపీ కార్యకర్తలు,నాయకుల్లో పెద్ద ఉత్సాహం లేదనే చెప్పాలి.
ఇదే సమయంలో బుచ్చయ్య వంటి సీనియర్ నాయకుడు పార్టీలో ఉన్న సంస్థాగత లోపాల్ని వెళ్లడిస్తూ రాజీనామా చేస్తానంటూ అలగడం , బుచ్చయ్యతో పాటు మరికొందరు పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు,లోకేష్ తీరు,వాడుతున్న భాష వలన జరుగుతున్న నష్టం గురించి,నాయకత్వ మార్పు అవసరం గురించి అంతర్గత భేటీల్లో చర్చించడం వంటి అంశాలను గమనించిన అధినాయకత్వం వాటిని మరుగున పరిచి తమ స్థానాన్ని కాపాడుకొనేందుకే మరోసారి లోకేష్ పాదయాత్ర అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఇప్పట్లో పాదయాత్ర జరక్కపోవచ్చని,అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తేనే లోకేష్ చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలతో నష్టం జరుగుతుండగా పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజల్లో , వార్తల్లో ఉంటే తన అవగాహనారాహిత్యం,విచక్షణా లోపం ,అసందర్భ ఆవేశంతో పార్టీకి మరింత నష్టం చేసే ప్రమాదం ఉందన్న విషయం బాబుకి కూడా తెలుసని అందుకే ఇప్పట్లో పాదయాత్ర ఉండకపోవచ్చని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే పాదయాత్ర సందేహాస్పదమే.2024 ఎన్నికల ముందైనా జరుగుతుందా అనేది వేచి చూడాలి.
Also Read : అధిక ఫీజుల నియంత్రణకు మరో అడుగు.. ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం