iDreamPost
android-app
ios-app

మల్టీప్లెక్సులు మాట వింటాయా

  • Published Dec 01, 2020 | 9:54 AM Updated Updated Dec 01, 2020 | 9:54 AM
మల్టీప్లెక్సులు మాట వింటాయా

తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఈ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే అన్ని హాళ్లు ఓపెన్ చేయడం లేదు. ప్రస్తుతానికి కొన్ని మల్టీప్లెక్సులు మాత్రమే సిద్ధమయ్యాయి. కొత్త కంటెంట్ లేకపోవడంతో పాటు విద్యుత్ బిల్లుల మాఫీ తదితర డిమాండ్లతో కొందరు ఎగ్జిబిటర్లు గేట్లు తీయడాన్ని ఆలస్యం చేస్తూ వస్తున్నారు. యాభై శాతం సీట్లతో నడపడం తమ వల్ల కాదని సింగల్ స్క్రీన్ ఓనర్లు ఇప్పటికే తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ లో ఏకంగా పది దాకా పాత సినిమా హాళ్లు శాశ్వతంగా మూతబడటం జీర్ణించుకోలేని విషాద వాస్తవం. ఈ నేపథ్యంలో మన నిర్మాతలు ప్రేక్షకులను హాళ్లకు రప్పించేలా, తమకు నష్టాలు తగ్గేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

తాజాగా తెలుగు రాష్ట్రాల యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలకు కొన్ని డిమాండ్లు సిద్ధం చేసిందని సమాచారం. అందులో భాగంగా విపిఎఫ్(వర్చువల్ ప్రాసెసింగ్ ఫీజు)ని పూర్తిగా మాఫీ చేయాలనేది మొదటి డిమాండ్. ఇప్పటికే తమిళనాడులో 2021 మార్చ్ దాకా ఇది అమలులోకి వచ్చేసింది. అంతే కాదు ఎలాంటి నిబంధనలు లేకుండా కొత్త సినిమాల ట్రైలర్లు షోకు ముందు ఇంటర్వెల్ సమయంలో విధిగా ప్రదర్శించాలి. ఇప్పటిదాకా మెయింటెనెన్స్ ఛార్జీలు భరించిన నిర్మాతకు పూర్తి మినహాయింపుని ఇవ్వాలి. ఇకపై ఇది ఎలాంటి భారం కాకూడదు.

ఇక అసలైన మరో డిమాండ్ కూడా ఉంది. ఇకపై లాభాలను పంచుకునే విషయంలో కూడా మార్పులు జరగాలి. ప్రొడ్యూసర్లకు ఉపయుక్తంగా ఉండేలా మొదటి వారం 60:40 నిష్పత్తిలో షేరింగ్ జరగాలి. రెండో వారంలో 50:50గా మారాలి. మూడో వారం నుంచి 40:60గా మార్చుకోవాలి. ఇంతేకాదు బలవంతంగా అంటగట్టే కాంబోలకు స్వస్తి పలకాలి. ప్రభుత్వం అదనంగా ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్లు ఇస్తే వాటిని మల్టీ ప్లెక్సులు కూడా వేయాలి. ఇన్నేసి డిమాండ్లకు మల్టీ ప్లెక్సులు అంత సులభంగా ఒప్పుకోవు కానీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వినికిడి.