iDreamPost
iDreamPost
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో బహుశా ఇదే మొదటిసారి. సినిమా విడుదల తేదీ చెప్పి షోకు టికెట్లు అమ్మేశాక కూడా ఆగిపోయి మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో కానీ అర్థం కానీ పరిస్థితి నెలకొనడం. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు . ఇంకాసేపు మరికాసేపు అంటూ సమయాన్నినానబెడుతున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎంతకీ తెంచడం లేదు. మ్యాట్నీ, నూన్ షోలు రెండూ రద్దయ్యాయి. పోనీ సాయంత్రం ఆటలైనా ఉంటాయా లేదా అనే ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ రివ్యూల హల్చల్, నిర్మాత మీద ట్రోలింగ్ విపరీతంగా సాగుతోంది.
అసలు ఈ రోజు బొమ్మ పడుతుందా లేదానేది అనుమానంగానే ఉంది. యూనిట్ తరఫున ఎవరూ నోరు విప్పడం లేదు. ఇంత జరిగినందుకు ప్రొడ్యూసర్ తరఫున ఒక సారీ నోట్ కానీ హీరో నుంచి ఇలా జరగకుండా ఉండాల్సిందని చిన్న ట్వీట్ కాని ఏమి లేదు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుని విలువైన సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టి థియేటర్ దాకా వచ్చిన ప్రేక్షకులు ఉసూరని వెనక్కు తిరిగి యూనిట్ ని తిట్టుకుంటూ వెళ్తున్నారు. పిఆర్ తరఫున పుకార్లను నమ్మొద్దనే మెసేజ్ అయితే ట్విట్టర్ లో వచ్చింది కానీ ఎప్పుడు పరిష్కారం అవుతుందనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
క్రాక్ పబ్లిసిటీతో పాటు ట్రైలర్ తో వచ్చిన బజ్ వల్ల ట్రేడ్ వర్గాలు దీనికి భారీ ఓపెనింగ్స్ ఆశించాయి. దానికి తగ్గట్టే ఉదయం జనాల రద్దీ కూడా కనిపించింది. నిర్మాతకు చెన్నై పార్టీ తరఫున ఉన్న ఆర్థిక లావాదేవీల వల్ల ఏర్పడిన ఇబ్బందిలో ఆగినట్టు చెబుతున్నారు కానీ పరిష్కారం దిశగా వేగంగా చర్యలు చేపడుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అయినా ఇలాంటి ఇష్యూలను రెండు మూడు రోజుల ముందే పరిష్కరించుకోకుండా ఇలా రిలీజ్ రోజు ఉదయం వరకు సాగదీయడం పట్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి క్రాక్ దర్శనం ఈ రోజు అవుతుందో లేదో. మరోవైపు 13 లేదా 14కు వాయిదా పడవచ్చనే ప్రచారం కూడా షురూ అయ్యింది.