iDreamPost
android-app
ios-app

షాక్ ఇవ్వబోతున్న ‘క్రాక్’ ?

  • Published Aug 13, 2020 | 1:49 PM Updated Updated Aug 13, 2020 | 1:49 PM
షాక్ ఇవ్వబోతున్న ‘క్రాక్’ ?

ఒక్కసారిగా టాలీవుడ్ లో డిజిటల్ హడావిడి మొదలైంది. నిన్నటిదాకా థియేటర్లలోనే వస్తాయని చెప్పకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటిటి బాట పట్టక తప్పడం లేదు. నాని వి న్యూస్ ఇప్పటికీ వేడిగానే ఉంది. సోషల్ మీడియాలో ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు సోలో బ్రతుకే సో బెటరూ వార్త కూడా లైన్లోకి రావడంతో మెల్లగా తెలుగు సినిమా బాలీవుడ్ పంథాలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ క్రాక్ కూడా ఓటిటి విడుదలకు డీల్ జరుగుతోందన్న టాపిక్ ఇప్పుడు యమా హాట్ గా మారింది. కేవలం ఇంకో రెండు మూడు వారాల వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్న క్రాక్ ని వచ్చే నెలలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పటికి కరోనా కేసులు తగ్గకపోతే ఇంకొంత వాయిదా పడొచ్చు

కానీ పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నట్టుంది ఈ ఓటిటి టాక్స్ గురించి ఇంత కదలిక రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అధికారిక ప్రకటనలు ఇంకా షురూ కాలేదు కానీ రేపటి నుంచి అవి కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతిమంగా థియేటర్ ఇచ్చే ఎక్స్ పీరియన్స్ ఇంకేదీ ఇవ్వలేకపోయినా ఇప్పుడున్న అయోమయంలో నిర్మాతలకు ఇంత కన్నా మార్గం లేదు. శృతి హాసన్ హీరోయిన్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో సముద్ర జాలర్ల నేటివిటీతో చాలా డిఫరెంట్ గా రూపొందింది. వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరఖని కీలక పాత్రలు పోషించడం ఆసక్తిని రేపుతోంది. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. జీ 5 ఒప్పందం కుదుర్చుకోబోతోందని వినికిడి.

ఎంత మొత్తం అనేది బయటికి రాలేదు కానీ 30 నుంచి 40 కోట్ల మధ్యలో ఉన్నట్టుగా చెబుతున్నారు. అఫీషియల్ గా చెప్పేదాకా ఇది నిజమని నిర్ధారించలేం. ప్రొడ్యూసర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఉంది. థియేటర్లు తెరిచినా జనం ఎంత ఆసక్తి చూపించినా ఈ సినిమాలన్నీ 30 కోట్ల షేర్ తెచ్చే సీన్ ప్రస్తుతానికి లేదు. కుటుంబ ప్రేక్షకులు హాలు దాకా రావడానికి జంకుతారు. ఎందుకొచ్చిన గొడవని ఇంటికే పరిమితమవుతారు. అలా అధిక శాతం ఆలోచిస్తే దాని ప్రభావం కలెక్షన్ల మీద తప్పకుండా ఉంటుంది. అందుకే పెట్టుబడి సేఫ్ అవ్వాలంటే ఇంతకన్నా మార్గం లేదు. మరి క్రాక్ విషయంలో వచ్చిన ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి