Idream media
Idream media
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారా? అంటే అవునని, కాదని కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారని ఇప్పటి వరకూ వార్తలు వచ్చాయి. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. రాజీనామా అనంతరం ఇప్పుడు ఆయన రాసిన బహిరంగ లేఖతో కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలా ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరి తాతగారైన కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టినట్లుగా కూడా చెబుతారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సంగీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో విశ్వేశ్వర్ రెడ్డికి మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయి. వాటితోనే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. విశ్వేశ్వర్ రెడ్డికి సాఫ్ట్ వేర్ రంగంలో కూడా విశేష అనుభవం ఉంది. కోట రీసెర్చ్ & సొల్యూషన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించారు. 2014లో టీఆర్ఎస్ ఎంపీ గెలిచిన కొండా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది.
‘రానున్న రెండు, మూడు నెలల్లో అందరినీ కలిసి చర్చిస్తా. దేశ, రాష్ట్ర, ప్రాంత అభివృద్ధి, ప్రజల మంచి కోసం ఏది సరైన నిర్ణయం అనిపిస్తే.. ఆ నిర్ణయమే తీసుకుంటా’ అని ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కొత్త పార్టీ పెట్టాలా? లేకుంటే స్వతంత్రంగానే ఉండాలా? ఏదో ఒక పార్టీలో చేరాలా? అన్న అంశాలపైన అందరితో చర్చిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తన అభిమానులకు, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. తాను ఎవరిపైనా ఒత్తిడి పెట్టబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ ఇలాంటి చర్చ చేయడం పార్టీకి ద్రోహం చేసినట్లవుతుందని, అందుకే పార్టీ నుంచి బయటికి వచ్చి ఈ చర్చలు చేస్తున్నానని తెలిపారు. తాను రాజీనామా నిర్ణయం తీసుకునేవరకూ కాంగ్రెస్ కోసమే పనిచేశానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్‌లకు నష్టం జరగకూడదనే ఇన్ని రోజులూ ఆగానన్నారు.
తాను కాంగ్రెస్‌లో చేరిన దగ్గరి నుంచీ ఇప్పటివరకూ తనకు పూర్తి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా విషయం మీడియా ద్వారా బయటకి వచ్చినందునే ఈ మేరకు వివరణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనతో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రయత్నించారు. అయితే నాలుగు రోజుల తర్వాత ఠాగూర్‌తో వివరంగా మాట్లాడతాననీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆయనకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.