iDreamPost
android-app
ios-app

కర్ణాటక ముఖ్యమంత్రికి పదవీ గండం..?

కర్ణాటక ముఖ్యమంత్రికి పదవీ గండం..?

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీనోటిఫై చేసి గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని, దానిపై దర్యాప్తు జరిపించాలంటూ 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని సీఎం యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రెండు రోజుల క్రితం కొట్టివేయడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. సీఎం నిర్ణయంపై దర్యాప్తు జరగాల్సిందేనని, అది పకడ్బందీగా జరిగేలా లోకాయుక్త కోర్టు పర్యవేక్షించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు శీతాకాల సెలవుల తర్వాత జనవరి 1న యడ్యూరప్ప ఈ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి. అయితే సుప్రీంకోర్టు కూడా విచారణను నిలిపివేసే అవకాశం ఉండదని న్యాయవర్గాలు భావిస్తుండడంతో యడ్యూరప్ప ఎంతకాలం పదవిలో ఉంటారన్న విషయం చర్చనీయాంశమైంది. దీంతో కొత్త సీఎంను నియమించే విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే సంకేతాలు…

రాజ్యసభ అభ్యర్థుల విషయంలో యడ్యూరప్ప ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి సొంత నిర్ణయాలు తీసుకోవడం, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడం వంటి చర్యల ద్వారా బీజేపీ పెద్దలు కర్ణాటక సీఎం విషయంలో సానుకూలంగా లేరన్న సంకేతాలు పంపారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో యడ్యూరప్పకు ప్రత్యామ్నాయం చూడక తప్పదన్న నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయం తెలిసిన యడ్యూరప్ప ఫిబ్రవరి 27న తన పుట్టినరోజు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత తాను అధిష్ఠానం సూచించిన వ్యక్తికి నాయకత్వం అప్పగిస్తానని కోరినట్లు సమాచారం. కానీ, యడ్యూరప్ప కోరికను ఢిల్లీ పెద్దలు మన్నిస్తారో లేదో చెప్పలేమని.. న్యాయస్థానం నిర్ణయాలు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప స్థానంలో ఎవరిని నియమిస్తారన్న విషయంలో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం రేసులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, లింగాయత్‌ నేత లక్ష్మణ్‌ సావడిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.