iDreamPost
android-app
ios-app

జూనియర్ షో ఎప్పుడు వస్తుంది

  • Published Apr 22, 2021 | 10:27 AM Updated Updated Apr 22, 2021 | 10:27 AM
జూనియర్ షో ఎప్పుడు వస్తుంది

గతంలో బిగ్ బాస్ షోని విజయవంతంగా నడిపించిన యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత నాని, నాగార్జునలు నడిపించినప్పటికీ తారక్ కు వచ్చిన పాపులారిటీ వేరే. ఆ తర్వాత ఇతను మరోసారి బుల్లితెర గురించి ఆలోచించలేదు. ఇన్నేళ్ల తర్వాత జెమిని ఛానల్ లో నిర్వహించబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ద్వారా మరోసారి టీవీ ప్రేక్షకులకు దర్శనమివ్వనున్నాడు. దీని తాలూకు అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ షో తాలూకు విశేషాలు పంచుకున్నారు. ఇటీవలే ప్రోమోలు మొదలుపెట్టి ఆడిషన్లు కూడా తీసుకుంటున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ క్విజ్ ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దాని మీద సరైన క్లారిటీ రావడం లేదు. ముందు మే అనుకుని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వల్ల వ్యవహారం కొంత స్లో అయ్యిందని వినికిడి. ఆడియన్స్ కూడా మరీ భారీగా ఆశించిన స్థాయిలో ఇంకా రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. అందులోనూ జూనియర్ కూడా ఆలస్యమైనా పర్లేదు అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చినవాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోమని చెప్పారట. కరోనా జడలు విప్పుతున్న వేళ మునుపటిలాగా షూటింగులు చేసే పరిస్థితులు కొద్దిరోజుల పాటు ఉండవు. అందుకే లేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

ఇలాంటి షోలకు చూసేందుకు వచ్చే ఆడియన్స్ కూడా చాలా ముఖ్యం. పార్టిసిపెంట్స్ ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ సహాయం అవసరం అవుతుంది. హిందీ తరహాలో ఏమైనా మార్పులు చేద్దామా అంటే జనం రిసీవ్ చేసుకుంటారో లేదో అనే చిన్న అనుమానం. చూస్తుంటే జూన్ దాటాకే ఎవరు మీలో కోటీశ్వరుడు స్టార్ట్ అవ్వొచ్చు. ఆర్ఆర్ఆర్ కు బ్రేక్ పడిన తర్వాత తారక్ రెస్ట్ లో ఉన్నాడు. కొరటాల శివతో చేయబోయే సినిమా తాలూకు పనులను ఒక్కొక్కటిగా పర్యవేక్షిస్తున్నాడు. ఏది ఏమైనా సాయంత్రాలు జనాలు పూర్తిగా ఇంట్లోనే ఉంటున్న తరుణంలో ఈ షో ఇప్పుడు వచ్చి ఉంటే మంచి రేటింగ్స్ కు అవకాశం దక్కేది