iDreamPost
android-app
ios-app

కలెక్షన్ల మీద ప్రభావం పడబోతోందా

  • Published Apr 04, 2021 | 5:08 AM Updated Updated Apr 04, 2021 | 5:08 AM
కలెక్షన్ల మీద ప్రభావం పడబోతోందా

ఇంకో అయిదే రోజుల్లో పవన్ సునామి మొదలుకాబోతోంది. 9న ఉదయం 5 గంటల నుంచే షోలు వేసేందుకు బయ్యర్లు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి నుంచే ఉండొచ్చనే టాక్ ఉన్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా అనుమతులు రావడం కష్టమే అని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వడమే గొప్పనేలా ఉంది పరిస్థితి. సుమారు తొంభై కోట్ల దాకా పెట్టుబడులు సాగిన వకీల్ సాబ్ మీద డిస్ట్రిబ్యూటర్లకు భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి వారం పదిరోజులు ఏకధాటిగా హౌస్ ఫుల్స్ పడితే పెంచిన టికెట్ ధరలతో బ్రేక్ ఈవెన్ ఈజీగా చేరుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు.

కానీ ప్రీమియర్ షోల రద్దు చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే వీటికి టికెట్ ధర ఎంత ఉన్నా లెక్కచేయకుండా కొనే అభిమానులు పవన్ కు పుష్కలంగా ఉన్నారు. కానీ కరోనా కేసులు బయట అంతకంతా పెరుగుతూ పోతుండటంతో వీటిని వేసుకోవడం కష్టమే. అందుకే అలా కోల్పోయిన రెవిన్యూని రెగ్యులర్ షోలకు అదనంగా వేసుకోవడం ద్వారా రాబట్టుకోవచ్చనే ప్లాన్ లో ఉన్నారు. కానీ బెనిఫిట్ షోలకు ఉండే క్రేజ్ వేరు. సాధారణ టైమింగ్ లో వేసే ఆటలకు అంత మోజు ఉండదు. అందులోనూ సినిమా ఎలా ఉందో తెలిసిపోయి ఉంటుంది కాబట్టి టికెట్ ధర భారీగా పలికే ఛాన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

ఇప్పుడిప్పుడే వైరస్ రెండో దశ గురించి మీడియాలో వస్తున్న వార్తల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం గురించి మళ్ళీ పునరాలోచనలో పడుతున్నారు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఇది చేస్తున్న రచ్చ చూస్తున్నారు. అందుకే వకీల్ సాబీ కు జస్ట్ పాజిటివ్ టాక్ ఒకటే వస్తే సరిపోదు. ఇండస్ట్రీ హిట్ రేంజ్ అని చెప్పుకుంటేనే లాభాలు నల్లేరు మీద నడక అవుతాయి. ఇవాళ హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి ఉంది. పరిమిత సంఖ్యలో అభిమానులను ఇందులో అనుమతిస్తారు. మిగిలిన వాళ్ళు టీవీ, యుట్యూబ్ లో లైవ్ చూసి సర్దుకుపోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు