తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలి అంటే కొంతమంది నాయకులు ఖచ్చితంగా బయటకు వచ్చి ఆ పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రజల్లోకి రాకపోవడం పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టకపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమరావతి ఉద్యమం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్న సరే వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
టీడీపీలో కూడా చాలా వరకు అమరావతి ఉద్యమానికి సంబంధించి ఎక్కడ ఆసక్తి అనేది కనబడలేదు. ప్రధానంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పాదయాత్ర కు సంబంధించి అలాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి ముందు నుంచి కూడా పెద్దగా ఉత్సాహం చూపించలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేసినా సరే ఆ తర్వాత ఆయన సైలెంట్ కావడం పట్ల టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ పాదయాత్ర మొదలు పెట్టగా,గుంటూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కూడా ఆయన పాల్గొనే ప్రయత్నం చేయలేదు. టీడీపీలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు అందరు దూకుడుగా ఉన్నా సరే గల్లా జయదేవ్ మాత్రం ముందుకు రాకపోవడం పట్ల పార్టీ శ్రేణులలో కూడా ఆందోళన వ్యక్తమైంది. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా అదే వైఖరి పట్ల అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేసినా చంద్రబాబు నాయుడు మాత్రం పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.
Also Read : Rayalaseema JAC – అటు అమరావతి పాదయాత్ర – ఇటు రాయలసీమ ధర్నా
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా గల్లా జయదేవ్ పెద్దగా ఆసక్తి చూపించినట్టుగా వార్తలు రాలేదు. ఇక పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో సొంత జిల్లా చిత్తూరులో అయినా సరే గల్లా జయదేవ్ పాల్గొంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సొంత జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారని,ఈ మేరకు ఆయన తల్లి గల్లా అరుణకుమారికి కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా రాష్ట్రానికి ఆయన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.కొన్ని అంశాలలో తనకు ఇబ్బందులు వచ్చినా సరే పార్టీ అధిష్టానం సమర్థవంతంగా స్పందించలేదు అనే అసంతృప్తి గల్లా జయదేవ్ లో ఎక్కువగా ఉందని అందుకే ఆయన పెద్దగా అమరావతి ఉద్యమాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని మరి కొంతమంది అంటున్నారు.
ఇక టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండడంతో గల్లా జయదేవ్ కూడా పార్టీతో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాలు కూడా కొందరి నుండి వ్యక్తమవుతున్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేయక పోయినా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ మధ్యకాలంలో టీడీపీ వర్గాలు అంటున్నాయి.స్థానిక నాయకులతో కూడా గల్లా జయదేవ్ గత కొంతకాలంగా పెద్దగా మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు అనేది చాలా మంది మాట్లాడే మాట.పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోవడం టీడీపీ ఎంపీలతో కూడా పెద్దగా టచ్ లో లేకపోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాని పరిస్థితి.
చంద్రబాబు నాయుడు సహకారం ఉంటుందని భావించినా కొన్ని అంశాల్లో ఆయన నుంచి సరైన సహకారం లేకపోవడంతోనే గల్లా జయదేవ్ విసిగిపోయారని టీడీపీలో ఉన్న కొంత మంది స్థానిక నాయకులు నారా లోకేష్ కు తనకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన ఎక్కువగా ఉందని, అందుకే ఆయన కూడా పార్టీ వ్యవహారాల మీద పెద్దగా దృష్టి సారించడం లేదని,ఈ క్రమంలోనే అమరావతి ఉద్యమాన్ని కూడా గల్లా జయదేవ్ లైట్ తీసుకున్నారు అని కొంతమంది అంటున్నారు.మరి భవిష్యత్ పరిణామాలు ఏ మలుపులు తిరగబోతున్నాయి, గల్లా జయదేవ్ అమరావతి పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటారా లేదా అనేది చూడాల్సిందే.
Also Read : TDP,Chandrababu – పెనుకొండ ఓటమిపై బాబు సీరియస్ – అనంత నేతలకు క్లాస్