iDreamPost
iDreamPost
అతి త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని నిన్నటి నుంచి మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇండియన్ 2 షూటింగ్ కొనసాగుతుందో లేదో అన్న అయోమయంలో ఉన్న శంకర్ నిజానికి ఫలానా హీరోకి కథ సిద్ధం చేశానని ఎక్కడా చెప్పలేదు. కానీ బయట మాత్రం ఏదేదో ప్రచారం జరుగుతోంది. అయితే శంకర్ ఇప్పటిదాకా మీడియం రేంజ్ సినిమా తీసిందే లేదు. ఆఖరికి కథ డిమాండ్ చేయని బాయ్స్, స్నేహితుడు లాంటి వాటికి కూడా మంచినీళ్లలా బడ్జెట్ పెట్టించారనే టాక్ వాటి నిర్మాణ సమయంలోనే వచ్చింది. అలాంటప్పుడు నిజంగా చరణ్ ప్రాజెక్ట్ అయితే ఏం చేస్తారో వేరే చెప్పాలా.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కమల్ హాసన్ తో ఇండియన్ 2 ని ముందు చేద్దామనుకుంది దిల్ రాజునే. ఓ స్టేజి మీద చెప్పారు కూడా. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. అంత బడ్జెట్ మోయలేనని గుర్తించి తప్పుకున్నారు. ఆయన అంచనాకు తగ్గట్టే ఇండియాన్ 2 ని తలకెత్తుకున్న లైకా సంస్ధ లాక్ డౌన్ తర్వాత ఇప్పటికీ దాన్ని కొనసాగించాలో లేదో అర్థం కానీ పరిస్థితిలో ఆలస్యం చేస్తూ వస్తోంది. మరి అప్పుడు వద్దనుకున్నా దిల్ రాజు ఇప్పుడు మెగా బ్రాండ్ ని నమ్ముకుని అంత సాహసం చేస్తారా అంటే చెప్పలేం. అయితే ఈ వార్త మాత్రం గట్టిగా చక్కర్లు కొడుతోంది. నిన్న ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు.
కానీ ఇక్కడ ఆలోచించాల్సింది మరొకటి ఉంది. శంకర్ మునుపటి ఫామ్ లో లేరు. ఐని డీల్ చేసిన తీరు అభిమానులకు సైతం నచ్చలేదు. స్నేహితుడు రీమేక్ కూడా డిజాస్టర్ కొట్టింది. తన ఆత్మీయ రచయిత సుజాత కాలం చేశాక శంకర్ నుంచి పవర్ ఫుల్ సబ్జెక్టులు రావడం లేదు. కథల కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అందుకే రామ్ చరణ్ తో సినిమా అనగానే ఎక్కువ ఊహించేసుకోవడానికి లేదు. ప్రస్తుతం ఎఫ్3, పాగల్, వకీల్ సాబ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్న దిల్ రాజు నిజంగా శంకర్ తో జట్టు కడితే వందల కోట్ల మూటలు సిద్ధం చేసుకోవాల్సిందే