iDreamPost
android-app
ios-app

రాజీనామ చేస్తానని స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన ఆ బీజేపీ ఎంపీ ఇప్పుడేమి చేస్తారు?

రాజీనామ చేస్తానని స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన ఆ బీజేపీ ఎంపీ ఇప్పుడేమి చేస్తారు?

“ప‌సుపు బోర్డు ఇచ్చేది లేదు… అస‌లు ఆ ప్ర‌తిపాద‌నే మా వద్ద లేదు..” అంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్ప‌డం నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఏ పార్టీపై గెలిచారో, ఏ హామీతో విజ‌యం సాధించారో ఆ పార్టీయే, ఆ హామీయే తాము ఎప్పుడూ ఇవ్వ‌లేద‌ని అన‌డంపై ఇప్పుడు అంద‌రి చూపూ ధ‌ర్మ‌పురిపైనే ప‌డింది.

“నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను… అర్వింద్‌ ధర్మపురి అను నేను, బీజేపీ, నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత, పసుపు బోర్డును గానీ, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకు రాలేని పక్షంలో, నా పదవికి రాజీనామా చేసి రైతు/ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను.” అని బాండ్ పేప‌ర్ పై సంత‌కం చేసి రాసిచ్చిన అర‌వింద్ మ‌రి ఇప్పుడు ఏం చేస్తారు? చెప్పిన‌ట్లుగానే రాజీనామా చేసి రైతు ఉద్య‌మంలో పాల్గొంటారా ?అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే క‌విత అనుచ‌రులు, అభిమానులు, ప‌లువురు రైతులు సోష‌ల్ మీడియా వేదిక‌గా దీనిపై రాద్దాంతం చేస్తున్నారు.

2014లో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతుల డిమాండ్ నెర‌వేరుస్తాన‌ని అప్ప‌ట్లో క‌విత కూడా హామీ ఇచ్చారు. ఆమె అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అది నెర‌వేర‌లేదు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆమెపై 178 మంది రైతులు పోటీకి దిగారు. మరోవైపు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీ. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ కవితపై బీజేపీ తరుపున ఇక్కడి నుంచి పోటీకి దిగారు. పసుపు రైతుల డిమాండ్లను నెరవేరుస్తానని.. కేంద్రం ఇవ్వకపోతే తన సొంత డబ్బుతో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అంత‌టితో ఆగ‌కుండా తాను చెప్పింది చేయ‌క‌పోతే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఏకంగా బాండ్ పేప‌ర్ పై సంత‌కం చేసి మ‌రీ ఇచ్చారు. అలా మొత్తానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితపై 68 వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు.

ఎన్నిక‌లు పూర్త‌యి ఏడాదిన్నర గ‌డిచిపోయింది. ప‌సుపుబోర్డు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నామంటూ బీజేపీ చెబుతూ వ‌స్తోంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు రాజ్య‌స‌భ వేదిక‌గా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌తో ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పసుపు పంట తీరుతెన్నులపై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మార్చి 12వ తారీఖున లిఖిత పూర్వకంగా ఎంపీకి సమాధానం ఇచ్చారు.

2019-20లో తెలంగాణలో 55,444 ఎకరాల్లో పసుపు సాగు కాగా 3.86 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. పసుపు రైతులకు మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ (ఎం.ఐ.డి.హెచ్‌) ద్వారా చేపడుతున్న కార్యక్రమాల సరళిని ఊటంకించారు. మద్దతు ధర అంశంలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధానం ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా వివరించారు.

చివరగా పసుపు బోర్డు ఏర్పా టు ప్రశ్నకు జవాబిస్తూ… తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదనే తమ వద్ద లేదంటూ తేల్చి చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిజామాబాద్‌ జిల్లాలో స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ ఆఫీస్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందంటూ పేర్కొన్నారు. పసుపు పంట ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు రీజినల్‌ ఆఫీస్‌ పని చేస్తుందంటూ వివరించారు. నిజామాబాద్‌తో పాటు వరంగల్‌, హైదరాబాద్‌, ఖమ్మంలో స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ కార్యాలయాలు ఉన్నాయంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రాతపూర్వకంగా మ‌రీ తెలిపారు.

ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ ఆఫీస్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ ఏర్పాటు ప్రక్రియ కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ కల్వకుంట్ల కవిత పోరాట ఫ‌లితంగానే కేంద్రం హామీ ఇచ్చింద‌ని పేర్కొంటున్నారు.

నిజామాబాద్‌ రూరల్‌ ఆర్మూర్‌, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 80వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. నిర్మల్‌ జిల్లాలోనూ పసుపు సాగు జోరుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పండే పసుపు పంటకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ నిలుస్తున్నది.

రవాణాకు అనువు గా ఉండే నిజామాబాద్‌లోనే పసుపు రైతుల మేలు కోసం బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కర్షకులు గడిచిన రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. రైతుల కోరికను నెరవేర్చేందుకు ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కవిత తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పలు మార్లు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బోర్డు కోసం విన్నవించారు. నాటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2017లో కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని నిజామాబాద్‌లో స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించగా నిజామాబాద్‌ ఎంపీగా కవిత తిరస్కరించారు. అదే ప్రకటనను 2020, ఫిబ్రవరి 5న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఎంపీ అర్వింద్‌ చెప్పించి జూలైలో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయించి రైతులను మరోమారు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేసిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి.

కేంద్రం తాజా ప్ర‌క‌ట‌న‌తో భారతీ య జనతా పార్టీ రైతులను మాయమాటలతో మోసగించినట్లు స్పష్టమైంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోప‌ణ‌లు ఎక్కుపెడుతున్నారు. బోర్డు పేరుతో ఆశ చూపి ఓట్లు వేయించుకున్న ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాజ్యసభ వేదికగా సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లిఖిత పూర్వకంగా రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డికి ఇచ్చిన సమాధానంతో ధర్మపురి అర్వింద్‌ మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింద‌ని చెబుతున్నారు.

ఇప్పటికే ఎంపీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టిన రైతన్నలంతా రాజీనామా చేయాలంటూ ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తుండగా మాటల గారడీతో ఎంపీ అర్వింద్‌ కాలాన్ని వెల్లదీస్తూ వస్తున్నారు. బోర్డు ఏర్పాటు అంశమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేకపోవడంతో తక్షణమే రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నారు.