iDreamPost
android-app
ios-app

వరుస మార్పుల వెనుక బీజేపీ వ్యూహం ఏమిటీ, మోడీ కొత్త ఎత్తుల ఫలితాలు ఎలా ఉంటాయో?

  • Published Sep 14, 2021 | 1:58 AM Updated Updated Sep 14, 2021 | 1:58 AM
వరుస మార్పుల వెనుక బీజేపీ వ్యూహం ఏమిటీ, మోడీ కొత్త ఎత్తుల ఫలితాలు ఎలా ఉంటాయో?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివిధ రాష్ట్రాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. తన పార్టీకే చెందిన నేతలను మార్చి మార్చి ముఖ్యమంత్రి పీఠాలపై కూర్చోబెడుతోంది. గడిచిన ఆరు నెలల్లోనే ఐదు చోట్ల సీఎంలు మారిపోయారు. తాజాగా గుజరాత్ లో పటేళ్లను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో కొత్త సీఎం కుర్చీఎక్కడం కోసం విజయ్ రూపానీ తప్పుకోవాల్సి వచ్చింది.

అంతకుముందు ఉత్తరాఖండ్ లో నాలుగు నెలలకే ఇద్దరు సీఎంలను మార్చేసింది. కర్ణాటకలో లింగాయత్ కి ఎడ్యూరప్పను సాగనంపి మళ్లీ అదే కులానికి చెందిన బొమ్మైకి బాధ్యతలు అప్పగించారు వాటికన్నా ముందే అసోంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంని మార్చేసి హేమంత్ బిస్వాస్ శర్మను గద్దెనెక్కించారు.

వాటితో పాటుగా యూపీలో కూడా యోగీ ఆదిత్యానాద్ ని దాదాపుగా తొలగించినంత పనిచేశారు. ఆర్ఎస్ఎస్ లో యోగీకి పట్టు ఉండడం సహా వివిధ కారణాలతో ఆయన తృటిలో ఆ ముప్పు నుంచి బయటపడ్డారు. లేదంటే ఠాకూర్ల హవాకి అడ్డుకట్ట వేసి మళ్లీ బ్రాహ్మణులకు అధికారం అప్పగించే ప్రయత్నం జరిగిపోయేది.

ఇలా వరుసగా ముఖ్యమంత్రులను మారుస్తూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. అత్యధికులు ఆనాటి కాంగ్రెస్ తీరుతో దీనిని పోలుస్తున్నారు. కానీ వాస్తవానికి కమలనాథులు వచ్చే ఏడాది ఎన్నికలే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, కర్ణాటక సహా ప్రస్తుతం ముఖ్యమంత్రులను మార్చిన రాష్ట్రాల్లో ఎన్నికల గడువు సమీపిస్తోంది. వాటితో పాటుగా త్వరలో త్రిపుర, మణిపూర్ సీఎంలను కూడా మార్చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న ప్రక్రియగా చెప్పవచ్చు.

Also Read : బీజేపీలో ఏం జ‌రుగుతోంది..? ఆరు నెల‌ల్లో నలుగురు సీఎంల మార్పు

ఆపరేషన్ 2024ని మోడీ చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ గద్దెనెక్కడం బీజేపీకి కీలకం. ముఖ్యంగా వారి మూల సంస్థ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 2025 నాటికి వందేళ్లు పూర్తవుతున్న తరుణంలో దానికి తగిన ప్రాధాన్యత దక్కాలంటే వచ్చే ఎన్నికలు గెలవడం అత్యవసరం. దానికి తగ్గట్టుగా మోడీ వ్యూహాలు పన్నుతున్నారు. ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద, మోడీ తీరు మీద వ్యతిరేకత కనిపిస్తోంది. వివిధ మార్గాల్లో దానిని తగ్గించి చూపాలనే యత్నం చేస్తున్నా సామాన్యుల్లో మాత్రం బీజేపీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. అది ప్రస్ఫుటమయ్యే రీతిలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో అసంతృప్తులు, అలకలు అటు పార్టీలోనూ, ఇటు బయటా వెల్లువెత్తుతున్నాయి. దానిని అధిగమించే యత్నంలో నాయకత్వాన్ని మార్చడం ద్వారా ఓ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

మోడీ మీద ఉన్న వ్యతిరేకత చల్లార్చేందుకు ముఖ్యమంత్రులను మార్చడం ఓ ఎత్తుగడగా అంతా భావిస్తున్నారు. కోవిడ్ తదనంత పరిస్థితుల్లో దేశంలో ఆర్థికాభివృద్ధి మందగించడం, నిరుద్యోగం, ధరల సమస్య పెచ్చరిల్లడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో రైతుల్లో ఆగ్రహం మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం రూపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2022, 23 సంవత్సరాల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు బీజేపీకి కీలకం. పశ్చిమ బెంగాల్ ప్రయత్నాలు బెడిసికొట్టిన తర్వాత హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో పట్టు సడలితే మోడీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. అందులోనూ యూపీ, గుజరాత్ వంటి గుండెకాయలను కాపాడుకోవడం అత్యవసరం. దానికి తగ్గట్టుగానే తాజాగా సీఎంలను మార్చడం ద్వారా కొత్త నాయకత్వం క్లీన్ ఇమేజ్ కొంత ఉపయోగపడుతుందనే ఆశతో బీజేపీ అధినేతలున్నట్టు కనిపిస్తోంది.

Also Read : కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు వాస్తవమేనా?మమ్మల్ని కొన్నారంటున్న మాజీ మంత్రి

వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా బీజేపీకి కీలకం. దానికి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో మళ్లీ పీఠం ఎక్కడం ముఖ్యమైన విషయం. యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో గద్దెనెక్కలేకపోతే దాని ప్రభావం ఢిల్లీ రాష్ట్రపతి పదవీ మీద ఉంటుంది. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పక్షాల బలం ఎక్కుగా రాష్ట్రాల్లో ఉంది. దానిని అధిగమించడానికి యూపీ ఆయువుపట్టు వంటిది. అందుకు అనుగుణంగానే బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తోంది. యూపీలో యోగీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓవైసీ ద్వారా మళ్లీ పోలరైజేషన్ ఫలిస్తుందనే అంచనాలు వేస్తున్నారు. ఏది చేసినా పీఠం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులను మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. త్వరలో మరికొంత మందిని మార్చినా ఆశ్చర్యం లేదు.