iDreamPost
iDreamPost
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇప్పటికే చాటుకుంది. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంతో అసెంబ్లీకి ఢుమ్మా కొట్టినప్పటికీ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. పైగా ప్రధానికి రాసిన లేఖల్లో సీఎం జగన్ పలు ప్రతిపాదనలు చేశారు. విశాఖ ఉక్కుని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనువుగా తీసుకోవాల్సిన చర్యలు సూచించారు. అయినా కేంద్రం మాత్రం ఏకపక్షంగా ముందుకెళుతుంది. ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో ఉన్న సమయంలో మోడీ సర్కారుని నిలదీయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ ప్రధాన ఎజెండాలుగా పోడియంలోనూ నిరసనలకు పూనుకుంటున్నారు. సభ వెలుపల కూడా ఆందోళనలు చేస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ ఎంపీలు మాత్రం కళ్లప్పగించి చూస్తున్న తీరుని ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ హక్కుల విషయంలో చంద్రబాబు చిత్తశుద్ది లేమికి ఇవి ఉదాహరణలుగా చెబుతున్నారు. కరోనా కష్టకాలంలో ఏపీ ప్రజలకు దూరంగా హైదరాబాద్ లో తలదాచుకున్న ఆయన కృష్ణా జలాల్లో కేసీఆర్ కి కోపం రాకుండా, విశాఖ ఉక్కులో మోడీకి ఆగ్రహం కలగకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన మాటలు కనిపిస్తున్నాయి.
తాజాగా చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు కోసం తాము రాజీనామాలకు సిద్ధం ఉంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి లేఖ రాశారు. ఇప్పటికే ఆ సమితి స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంపీలు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఇంకా రాలేదని. అయినా చంద్రబాబు మాత్రం రాజీనామా అంటూ వ్యవహారాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారంటూ కార్మికులు కూడా సందేహిస్తున్నారు. రాజీనామాలు కాకుండా పార్లమెంంట్ లో కలిసి వచ్చే వారందరినీ కలుపుకుని పోరాడాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏం చేశారంటే టీడీపీనేతల వద్ద సమాధానం లేదు. అప్పట్లో స్పీకర్ కి ఓ లేఖ రాసి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రాజీనామాలను ముందుకు తీసుకొస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే విశాఖ ఉక్కు, పోలవరం వంటి అంశాల్లో పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలి. అంతే తప్ప ఆపార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోపం కలుగుతుందేమోనని సందేహిస్తూ, ఏపీలో మాత్రం అరివీరభయంకరులమనే స్టేట్ మెంట్స్ ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఈవిషయం చంద్రబాబుకి కూడా తెలిసినప్పటికీ రాజకీయంగా అందరినీ పక్కదారి పట్టించే పనిలో ఆయన ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. తద్వారా కేంద్రానికి విశాఖ ఉక్కు అమ్మకంలో అడ్డంకులు తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.