iDreamPost
android-app
ios-app

పిలుపు ఇచ్చారు స‌రే.. ఆయ‌న పాల్గొంటారా?

పిలుపు ఇచ్చారు స‌రే.. ఆయ‌న పాల్గొంటారా?

క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఏం చేశారో, ఎక్కువ కాలం ఎక్క‌డ ఉన్నారో అంద‌రికీ తెలిసిందే. రెండో ద‌శ విజృంభ‌ణ స‌మ‌యంలో కూడా ఆయ‌న హైద‌రాబాద్ కే ప‌రిమితం అయ్యారు. మున్సిప‌ల్, తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక ఇలా ఒక‌టి రెండు సంద‌ర్భాలు త‌ప్పా, చంద్ర‌బాబు ఏపీలో ఉన్న‌ది త‌క్కువే.

తాజాగా ఆయ‌న అక్క‌డి నుం చే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేయాలని పిలుపు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేత‌లు అంద‌రూ నిరసన దీక్షల్లో పాల్గొంటారని చంద్రబాబు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ, సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌నే ఓ సందేహం వెంటాడుతోంది.

భారీ స్టేట్ మెంట్ అయితే చంద్ర‌బాబు ఇచ్చారు కానీ, అమ‌లుపైనే సందేహం వెంటాడుతోంది. ఆ రోజు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ నేరుగా నిర‌స‌న దీక్ష‌ల్లో పాల్గొంటారా? వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కు చేరుకుంటారా అనే ప్ర‌శ్న‌లు టీడీపీ కేడ‌ర్ ను వేధిస్తున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాదికిపైగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఎంతో అవసరమైనపుడు లేదా అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే విజయవాడకు వస్తున్నారు.

గడచిన ఏడాదిలో చంద్రబాబు కుప్పంకు వెళ్ళింది రెండుసార్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీచేసిన లోకేష్ తర్వాత ఒక్కసారి మాత్రమే పోటీచేసిన నియోజకవర్గంలో పర్యటించారు. కాకపోతే వేర్వేరు కారణాల రీత్యా.. అనేక జిల్లాల్లో పర్యటించాడు. మొన్న టీడీపీ హత్యల నేపథ్యంలో కర్నూలు వచ్చారు. కానీ ప్రత్యేకంగా నియోజకవర్గాలలో పెద్దగా తిరగలేదు.

గతంలో కూడా ప్రభుత్వ విధానాలకు నిరసనలు తెలిపారు. అయితే అవన్నీ ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చోవటం. కాబట్టి చంద్రబాబు ఎక్కడ కూర్చుంటారనే విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇపుడు కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. నేతలందరు స్వేచ్చగా రోడ్లపైకి వచ్చేయొచ్చు. అందుకనే 29వ తేదీన నిరసనలకు పిలుపినిచ్చారు. మరి 175 నియోజకవర్గాల్లో నేతల నిరసన దీక్షలు చేయబోతున్నపుడు చంద్రబాబు కుప్పంలోను లోకేష్ మంగళగిరిలోను దీక్షల్లో పాల్గొనాలి కదా. మరి వీళ్ళిద్దరు పై రెండు నియోజకవర్గాలకు వెళతారా ? లేకపోతే హైదరాబాద్ ఇంట్లోనే కూర్చుని జూమ్ యాప్ లో నిరసనల్లో పాల్గొంటారా ? అన్నది చూడాలి.