iDreamPost
iDreamPost
దగ్గుబాటి రానా మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా మూవీ అరణ్య లాక్ డౌన్ వల్ల ఏడు నెలలుగా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ఓటిటికి ఇచ్చే ఆలోచనలో కూడా నిర్మాతలు ఉన్నట్టు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా దీన్ని డిజిటల్ రిలీజ్ కే ఇవ్వబోతున్నట్టు ముంబై టాక్. థియేటర్లు తెరుచుకున్నాక ఇలాంటి నిర్ణయం ఏమిటా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ దానికి కారణాలు లేకపోలేదట. దీపావళి దాకా సినిమా హాళ్లకు కనీస కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఒకవేళ పండగ సమయానికి ఏవైనా కొత్త సినిమాలు విడుదల చేసినా అప్పటికి ప్రభుత్వం ఫుల్ కెపాసిటీకి పర్మిషన్లు ఇవ్వడం అనుమానమే. అలాంటప్పుడు ఇంత కాలం నిరీక్షించి ఉపయోగం ఉండదు.
డిసెంబర్ దాకా పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండకపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పోనీ డిసెంబర్ కు ప్లాన్ చేసుకుందామా అంటే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ కాచుకుని ఉన్నాయి. అవి కనక షెడ్యూల్ అయితే అరణ్యకు తీవ్రమైన పోటీ తప్పదు. ఇది కమర్షియల్ సినిమా కాదు. బాహుబలి తరహా విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకున్నది కాదు. అడవి నేపథ్యంలో జంతువులకు వాటిని ప్రాణంగా ప్రేమించే ఓ యువకుడి మధ్య ఎమోషనల్ జర్నీగా రూపొందింది. మాస్ కి ఇది ఎంతవరకు రీచ్ అవుతుందన్నది అంచనా వేయలేం. అందుకే ఈ రిస్క్ ఆలోచించే ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదా ఖండిస్తూ ఏదైనా స్టేట్మెంట్ వస్తుందేమో చూడాలి.
ప్రేమ ఖైదీ, గజరాజు ఫేమ్ ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన అరణ్యలో విష్ణు విశాల్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. షూటింగ్ చాలా కాలం జరిగింది. అటవీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాలు బాగా తీస్తాడని పేరున్న ప్రభు మీద ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. రానా ప్రస్తుతం భార్య మిహికా బజాజ్ తో కలిసి హనీ మూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రాగానే బాలన్స్ ఉన్న విరాట పర్వం షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఎక్కువ శాతం ఆర్టిస్టులతో షూట్ చేయాల్సి ఉండటంతో ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందుతోంది. సాయి పల్లవి హీరోయిన్ . మరి అరణ్య తాలూకు ప్రకటన ఏ రూపంలో వస్తుందో వేచి చూడాలి