iDreamPost
iDreamPost
ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ దొరికినా.. పెద్ద ఆధారంలా భావించి మహదానంద పడినట్టుంది రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల పరిస్థితి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ, ప్రజలను ఏదోవిధంగా రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్న వారికి అనుకోకుండా ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం అందివచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని ఎలాగైనా తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. అందుకే పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నాయకుల కన్నా ఎక్కువగా స్పందిస్తూ ఉద్యోగులపై ఎన్నడూ లేని ప్రేమను ఒలకబోస్తున్నారు.
తాజాగా దీనిపై బుధవారం మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఉద్యోగుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని అన్నారు. రెండున్నరేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ చరిత్రలో ఉందా? అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు.ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న జీవోలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఉద్యోగుల సంక్షేమం కోసం 62 జీవోలు ఇచ్చామన్నారు. విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. ఉద్యోగుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని యనమల చెప్పుకొచ్చారు.
రెచ్చగొట్టడమే రాజకీయమా..
ఒక ప్రధాన ప్రతిపక్షంగా రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి మచ్చుకైనా నిర్మాణాత్మక సూచనలు ఇచ్చిన పాపాన పోని తెలుగుదేశం నిత్యం ఏదోరూపంలో బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఏదో వర్గం వారినో, కులం వారినో, మతస్థులనో ప్రభుత్వంపై రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నించడమే రాజకీయం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వం రోజురోజుకు జనాదరణ పొందడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
Also Read : లోకేష్ టీం మీద మహిళల ఆరోపణలు
అందుకే గతంలో ఎన్నడూ ఏ ప్రతిపక్షం వ్యవహరించని విధంగా నెగెటివ్ దృక్పథంతో రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెంచాలని చూస్తోంది. దీనికోసం అర్థం పర్థం లేని నిరసన పిలుపులు ఇస్తూ అభాసుపాలౌతోంది. ఆ పార్టీ ఇచ్చే నిరసన పిలుపులకు క్యాడరే సరిగా స్పందించకపోవడం గమనార్హం. ఈ కారణంగానే ప్రభుత్వంపై ఎవరు.. ఎప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా దాన్ని అందిపుచ్చుకొని రాజకీయం చేద్దామని ఎదురుచూస్తోంది. అందుకే పీఆర్సీ జీవోల అంశంపై మరీ ఓవర్‌గా రియాక్ట్ అవుతోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది.
అప్పుడు మీరేం చేశారు?
ఉద్యోగుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని వాపోతున్న యనమల తను ఆర్థికమంత్రిగా ఉండి వారికి చేసేందేమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము అధికారం నుంచి దిగిపోయిన రెండు సందర్భాల్లోనూ అంటే 2004, 2019 ఎన్నికల అనంతరం నాటికి రెండేసీ డీఏలను బకాయిలుగా ఉంచేసి వెళ్లిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ సందర్భంలో ఆర్థికమంత్రి అయిన యనమలకు ఎందుకు ఉద్యోగుల సంక్షేమం పట్టలేదు? ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ చరిత్రలో ఉందా అనడం బాగానే ఉంది కానీ ప్రపంచ మానవాళి చరిత్రలో కోవిడ్ వంటి సంక్షోభం ఎప్పుడైనా ఏర్పడిందా? ఇంతటి ఆర్థిక అల్లకల్లోలం సంభవించి కోట్లాది మంది ఉపాధిని కోల్పోయిన వైనం ఎప్పుడైనా విన్నామా?
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి, మరికొన్ని ఇతర సదుపాయాలు కల్పిస్తూ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని చూస్తోంది. దీన్ని పట్టుకొని రాజకీయం చేయడం సీనియర్ పొలిటీషియన్ చేయాల్సిన పనేనా? అని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తున్న యనమల… రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టును తమ ప్రభుత్వ హయాంలో తుంగలో తొక్కిన విషయం మరచిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరినో ప్రభుత్వంపై రెచ్చగొట్టడం కాక తమ పార్టీని తిరిగి నిర్మించుకోవడంపై దృష్టి సారిస్తే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందన్న విషయం నాయకులు గమనించాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
Also Read : కొత్త పీఆర్‌సీ.. జీతాలు.. ఉద్యోగుల ఆందోళన – సీఎస్ సమీర్ శర్మ క్లారిటీ