పార్లమెంట్ ఉభయసభలు జరిగిన తీరు, గడువుకు రెండురోజుల ముందే నిరవధికంగా వాయిదా పడిన తీరు పట్ల ఉభయసభల అధ్యక్షులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి తీవ్ర ఆవేదన చెందినట్టు వార్తలు వచ్చాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అయితే ఏకంగా కంటతడి పెట్టారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రం సభలో సభ్యులు ప్రవర్తించే తీరుపై అన్ని పక్షాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు
ఓబీసీల జాబితా తయారు చేసుకునే అధికారం తిరిగి రాష్ట్రాలకు ఇచ్చే రాజ్యాంగ సవరణ బిల్లు మినహా మరే ఇతర బిల్లుపైనా సమగ్ర చర్చ అటు లోక్ సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ జరగలేదు. మొత్తంగా లోక్ సభలో 20 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. లోక్ సభ 96 గంటలు చర్చ చేయాల్సి ఉండగా కేవలం 21 గంటలు మాత్రమే చర్చ చేసింది. అలాగే రాజ్యసభ 104 గంటలపాటు చర్చ జరగాల్సి ఉండగా కేవలం 28 గంటలపాటు మాత్రమే చర్చలు జరిగాయి.
ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు మొదట “పెగాసెస్” నిఘాపైన, ఆ తర్వాత భీమాసంస్థల ప్రవేటీకరణ పైన ఆందోళన చేశాయి. ఆంధ్ర ప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల సభ్యులు కూడా ఆయా రాష్ట్రాల సమస్యలపై చర్చకు గట్టి పట్టు పట్టి పాలక (బీజేపీ) పక్షానికి చెమటలు పట్టించాయి. ఉభయసభలు నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి.
సమావేశాలు వాయిదా పడిన రోజు (బుధవారం) అయితే సభలు సభాధ్యక్షులు కనుసన్నల్లో కంటే మార్షల్స్ కనుసన్నల్లోనే జరగడం దురదృష్టకరం. రాజ్యసభలో అయితే మార్షల్స్ ఏకంగా సభ వెల్ లోకి వచ్చి సభ్యులను నియంత్రించే పరిస్థితి వచ్చింది. మార్షల్స్, సభ్యుల మధ్య భారీగా తోపులాట కూడా జరిగింది.
దేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాల సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్న ఈ తరుణంలో దేశ స్వాతంత్య్రనికి ప్రతిరూపంగా నిలవాల్సిన పార్లమెంటు ఉభయసభలు ఇలా నడవడం, చివరికి నడవలేక, నడపలేక గడువుకు రెండు రోజులు ముందే వాయిదా పడడం దురదృష్టకరమే.
Also Read : ఏపీలో అమిత్‌షా రాజకీయేతర పర్యటన
ఈ 75 యేళ్ళ స్వాతంత్య్రం కనీసంగా చట్ట సభలు సజావుగా నిర్వహించుకునే పరిస్థితిని కల్పించలేక పోవడం పాలక వర్గాల వైఫల్యమే. ఈ 75 యేళ్ళుగా పాలక వర్గాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో విఫలం అయ్యాయి. ఇప్పుడు ఏకంగా తమను తాము నడిపించుకోవడంలో కూడా విఫలం అయ్యాయి. అందుకే సభ్యుల్లో అసంతృప్తి. ఆ అసంతృప్తితోనే సభలో ఆందోళనలు. ఆ ఆందోళనల కారణంగానే సభలు పలుమార్లు వాయిదా పడడం, అంతిమంగా గడువుకు రెండు రోజులు ముందే వాయిదా పడడం తప్పలేదు.
ఒక పార్టీ అధికారంలో ఉండి సభను తమ రాజకీయ వేదికగా మార్చుకోవడం, మరో పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ కూడా సభలను తమ రాజకీయ వేదికలుగా మార్చుకోవడం వల్లనే ఈ విపరీత పరిణామాలు సంభవించాయి.
సభలో చేసే నిర్ణయాలకు విలువ లేకపోవడం ఈ పతనావస్థకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్ణయాలు మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడం, సభలో తీసుకునే నిర్ణయాలకు సభ బాధ్యత వహించలేకపోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. అంటే దేశ స్వాతంత్య్రానికి మూలస్థంభంగా ఉన్న పార్లమెంట్ ఉభయ సభలు రాజకీయ వేదికలుగా మారడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది.
ఈ పతనం ఈ సమావేశాల్లో మరింత వేగంగా సాగింది. సభల నిర్వహణ పూర్తి కాగానే యావత్ దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోబోతోంది అనే స్పృహ కూడా కోల్పోయి సభ్యులు ప్రవర్తించడం దిగజారుతున్న రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఈ పరిస్థితి చూస్తే రానున్న రోజుల్లో కూడా పార్లమెంటు ఉభయ సభలు ఇంతకంటే భిన్నంగా జరగవనిపిస్తోంది. సభలో పాలకపక్ష రాజకీయాలు వేరు, ప్రతిపక్షాల రాజకీయాలు వేరు అయినప్పుడు చర్చలకు స్థానం ఉండదు. ఘర్షణ మాత్రమే కనిపిస్తుంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల అవసరాలను గుర్తించనంత కాలం రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, ఆ పార్టీల సభ్యులు కూడా ఇలా ఘర్షణకు దిగక తప్పదు. ఇలాంటి ఘర్షణల మధ్య సభలు నిర్వహించడం సాధ్యం కాదు కూడా. అందుకే సభాపతులతో పాటు యావత్ దేశ ప్రజలు కూడా ఈ దిగజారిన రాజకీయాల పట్ల కన్నీరు పెడుతున్నారు.
Also Read : గతం నుంచి పాఠాలు.. వర్తమానానికి మోదీ వ్యూహాలు