Idream media
Idream media
తెలంగాణ సాధనలో ముందు వరుసలో టీఆర్ఎస్ ఉంటే.. ఆ తర్వాత స్థానం కాంగ్రెస్ దే. రాష్ట్రంలో పోరాడింది టీఆర్ ఎస్సే అయినా.. కేంద్రంలో ప్రత్యేక రాష్ట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్సే. దాని వల్ల ఏపీలో ఓట్లు అడిగే అర్హత కోల్పోయింది. అలాగని తెలంగాణలో బాగుపడిందా అంటే అదీ లేదు. అందుకు స్థానిక నాయకత్వం అసమర్ధత, కేసీఆర్ సమర్ధత కారణాలు. రాష్ట్రం ఆవిర్భవించి ఇప్పటికి ఏడేళ్లు గడిచినా టీఆర్ ఎస్ కు ఉన్న గుర్తింపు చెక్కు చెదరకుండా ఎప్పటికప్పుడు అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఉద్యమకారుల చూపు బీజేపీ వైపు మళ్లుతోంది.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో నాటి బీజేపీ సీనియర్ నేత దివంగత ఎంపీ సుష్మా స్వరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిల్లు ఆమోదం పొందగానే మొత్తం క్రెడిట్ లో కొంత భాగాన్ని తనకు కూడా పంచాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్రెడిట్ ఇస్తారు.. బిల్లుకు మద్దతు ఇచ్చిన ఈ చిన్నమ్మకు కూడా మరిచిపోవద్దంటూ సుష్మ తన గురించి చెప్పుకున్నారు. కానీ సోనియమ్మకు లేకుండా, చిన్నమ్మకు కాకుండా మొత్తం క్రెడిట్ కేసీఆర్ తన ఖాతాలోనే వేసుకున్నారు. పోరాటంలోను, పలుకుబడిలోనూ తనదే అందెవేసిన చేయిగా చాటుకున్నారు.
అయితే, కొంతకాలంగా తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యమంలో కేసీఆర్ కుడిభుజంగా పేరొందిన ఈటల రాజేందర్ కాషాయపార్టీ పంచన చేరారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ విఠల్, తీన్మార్ మల్లన్న కూడా బీజేపీలో చేరారు. మరికొందరు ఉద్యమకారులు తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని కమలం పెద్దలు ప్రకటిస్తున్నారు. నిజానికి దుబ్బాక, జీహెచ్ ఎంసీ కంటే ముందు నుంచి ఈ ట్రెండ్ మొదలైనా, కాంగ్రెస్ సహా అనేక పార్టీల నాయకులు బీజేపీలో చేరినా, ఈటల రాజేందర్ ఎంట్రీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం తర్వాత ఈ జోరు ఇంకొంచెం ఎక్కువైంది.
Also Read : PJR Son Vishnu – పీజేఆర్ కొడుకు కనిపించడం లేదట..!
ఇదిలాఉంటే.. ఉద్యమ నాయకులకు బీజీపీనే ఎందుకు వేదిక అవుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనే. రాష్ట్ర సాధనలోను ఆ పార్టీ పాత్ర ఉంది. అందులో మరో అభిప్రాయానికి తావులేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు విషయంలో అయినా, రాష్ట్రంలో హస్తం గుర్తుకు పోలైన ఓట్ల లెక్కన చూసినా కాంగ్రెస్ పార్టీదే, సెకండ్ ప్లేస్. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో కొంత జోష్ పెరిగింది. దళిత గిరిజన దండోరా పేరిట రేవంత్ రెడ్డి సారధ్యంలో నిర్వహించి భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ ఇమేజిని పెంచాయి. అలాగే, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ఫోకస్ చేస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయినా, ఈటల మొదలు తీన్మార్ మల్లన్న వరకు, భావజాల పరంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవారైనా, రాజకీయంగా కమలాన్నే ఎంచుకుంటున్నారు.
కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమకారులు టీఆర్ఎస్ కు దూరమవుతున్నారని భావించినా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాకుండా, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, బీజీపే, తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులు కూడా తిరిగి సొంత గూటికి చేరతారనే ప్రచారం జరిగింది. కొన్ని పేర్లు కూడా వినిపించాయి. అందులో కీలక నేతలు కూడా ఉన్నారు. అయినా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనుకున్న కొండా విశ్వేశ్వర రెడ్డి సహా ఏ ఒక్కరూ గాంధీ భవన్ గడప తొక్కలేదు. ఎందుకు కాంగ్రెస్ ను కాదని ఉద్యమకారులు, తెరాస, కేసీఆర్ వ్యతిరేక శక్తులు బీజీపే వైపు చూస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లుగా నిజమైన ఉద్యమకారులకు బీజేపీ సరైన వేదిక అని ఉద్యమకారులు కూడా భావిస్తున్నారా? కమలం పెద్దలు చెబుతున్నట్లుగా త్వరలో చేరే ఆ ఉద్యమకారులు ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
Also Read : Etela Rajendar – ఈటల పై చర్యలకు తర్జనభర్జన..!