iDreamPost
android-app
ios-app

వారు సంతోషం.. సోమిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట!

  • Published Feb 16, 2022 | 12:19 PM Updated Updated Feb 16, 2022 | 12:19 PM
వారు సంతోషం.. సోమిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట!

ప్రభుత్వం మంచి చేసినా సరే.. ఏదో రూపంలో తప్పుబట్టి ప్రజల్లో చులకన చేయాలని చూసే తెలుగుదేశం పార్టీ నాయకులు తమ తెలివితేటలు మొత్తం రంగరించి రకరకాలుగా విస్యాసాలు చేస్తున్నారు. ఇది ఇప్పటికే ఒకటికి పదిసార్లు రూఢీ అయిందని వైఎస్సార్‌ సీపీ నాయకులు అంటున్నారు. 32 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తున్నా, పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తున్నా, సంక్షేమ పథకాలతో వివిధ వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నా రంధ్రాన్వేషణ చేస్తుంటారు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నా, జనం కళ్ల ముందు వాస్తవాలు కనిపిస్తున్నా పూర్తి అసంబద్ధంగా మాట్లాడుతూ మసిపూసి మారేడుకాయ చేసేయాలనుకుంటారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇలాంటి విన్యాసమే చేశారు.

బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు విస్తుగొలిపేలా ఉన్నాయి. సినీ ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాధపడిపోయారు. నమస్కారం చేసిన అగ్రహీరోలకు ప్రతినమస్కారం పెట్టాలనే సంస్కారం సీఎం జగన్‌కు లేకుండా పోయిందని విమర్శించేశారు. సినీ పరిశ్రమకు లేని సమస్య సృష్టించి పరిష్కరిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని నోరు పారేసుకున్నారు.

బాబు తానా అంటే.. పచ్చబ్యాచ్‌ తందానా..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సినిమా రంగ సమస్యలపై చర్చలు జరిపిన సినీ ప్రముఖులు ఆయనతో జరిగిన భేటీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార శాఖ విడుదల చేసిన వీడియోలో కూడా చర్చలు మంచి వాతావరణంలో జరిగినట్టు అర్థమవుతోంది. సినీ రంగ సమస్యలపై సూచనలు ఇవ్వడానికి  ఏర్పడిన కమిటి నివేదిక వచ్చాక జీవో విడుదల చేసి ప్రభుత్వం ఈ అంశానికి శుభం కార్డు వేయాలని చూస్తోంది. అంతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అసూయ మొదలై పోయింది. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో మాట్లాడి సీఎం వారి సమస్యలను పరిష్కరించేశారు.

ఇప్పుడు సినీ ప్రముఖులతో చర్చలు సఫలమైపోయాయి. ఇలా ఒక్కో సమస్య పరిష్కారమైపోయి జనం ఏ సమస్యలు లేకుండా ఉంటే ఎలా? తాము ఇక దేనిపై ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవాలి? అన్న బాధ ఆయనకు మొదలైంది. వెంటనే తన పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దింపేశారు. చర్చల సందర్భంగా సినీ ప్రముఖులకు అవమానం జరిగిపోయింది అని ఒక వాదనను తెరపైకి తెచ్చారు. అసలు సీఎం జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి అంతగా బతిమలాడాలా? అంటూ ఆయనే స్వయంగా వ్యాఖ్యానించారు. ఇక అది మొదలుకుని రోజుకొకరు దీనిపై బాధపడిపోతూనే ఉన్నారు.

అప్పుడు ఏమైంది ఈ ప్రేమ?

ఇవాళ సోమిరెడ్డి అయితే సినీ ప్రముఖులను సీఎం అవమానించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నానని కామెంట్‌ చేసి ఓవర్‌ యాక్షన్ చేశారు అన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. వారికి అవమానం జరిగితే ఈయన జీర్ణించుకోలేకపోవడం ఏమిటో? నమస్కారం చేసిన అగ్రహీరోలకు సీఎం ప్రతి నమస్కారం చేయకపోతే ఈయన బెంగపడడం ఎందుకు? సినీ హీరోలపై ఈయనకు ఎందుకు సడన్‌గా ప్రేమ పుట్టుకొచ్చింది? పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు, 2009 ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేసినప్పుడు, హరికృష్ణను అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపేసినప్పుడు ఈ ప్రేమ ఏమైంది? సోమిరెడ్డి అప్పుడు ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు? చర్చల్లో పాల్గొన్న సినీ ప్రముఖుల్లో ఏ ఒక్కరూ తమకు అవమానం జరిగిందని చెప్పలేదు. పైగా నిన్న సినీనటుడు అలీ మాట్లాడుతూ సీఎం చర్చల సందర్భంగా గౌరవప్రదంగా వ్యవహరించారని చెప్పారు కూడా. అయినా పచ్చరచ్చ ఆపకుండా తమ రాజకీయం కోసం సినీ ప్రముఖలను పదే పదే వివాదాల్లోకి లాగాలని చూడడం ఏం సంస్కారం? ఇది వారిని అవమానించినట్టు కాదా? అని అధికారపార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Also Read : నిన్నటి వరకూ వైసీపీ కార్యకర్త.. నేడు డీజీపీ అయ్యారా..?