iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయంగా క్షేత్రస్థాయిలో బలపడే ప్రయత్నాలు విపక్షాలు పూర్తిగా విస్మరించాయి. ఓవైపు ఊరూవాడా యాత్రలతో వైఎస్సార్సీపీ ప్రజాక్షేత్రంలో సాగుతోంది. ఆపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సహా నేతలంతా జనంలో పర్యటనలు సాగిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు చివరకు ఏపీలోనే అడుగుపెట్టడానికి సంకోచిస్తున్నారు. కరోనా తీవ్రతకు భయపడి ఆయన జనంలోకి రావడానికి సంశయిస్తున్నారు. తాను జనంలోకి రావాలంటే కరోనా పూర్తిగా తగ్గాలని ఇప్పటికే ప్రకటించేసిన చంద్రబాబు రెండోవైపు ప్రజలంతా బయటకు రావాలని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం పావులు కదుపుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహాయంతో జనాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా విషయంలోనే దేశంలోనే అనేక మంది నేతలకు ఆదర్శంగా జగన్ వ్యవహారం ఉంది. ప్రారంభంలోనే కరోనాని ఆయన దీర్ఘకాలం ఉంటుందని గుర్తించారు. మరో పక్షం, నెల రోజుల్లో ముగిసిపోయే వ్యవహారం కాదని స్పష్టం చేశారు. దీర్ఘకాల లక్ష్యాలతో సాగాలని ప్రజలకు పిలుపునిస్తూనే ప్రభుత్వపరంగా దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. సాటి తెలుగు రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులు నడపడానికి, బడులు తెరవడానికి సందేహిస్తున్న సమయంలో జగన్ చొరవ చూపారు. ఇక లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఆర్థిక సహాయం, ఉచితం రేషన్ పంపిణీలో ఎంతో చొరవ ప్రదర్శించారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారు. తద్వారా ఓవైపు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మరోవైపు దశల వారీగా కరోనా నియంత్రణ చర్యలకు పూనుకున్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థను సద్వినియోగం చేసుకోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
పగడ్బందీగా కరోనాని ఎదుర్కోవడంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితం కనిపిస్తోంది. నాడు దేశంలోనే అత్యధిక పరీక్షలు నిర్వహించడం నుంచి నేడు క్రమంగా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాల్లో జగన్ వ్యూహం ఫలితాన్నిస్తోంది. ఇది విపక్షానికి, ముఖ్యంగా చంద్రబాబుకి రుచించడం లేదు. కరోనా కారణంగా ఏపీలో కల్లోలం వస్తుదని ఆయన ఆశించారు. కానీ దానికి భిన్నంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన అనేక ప్రకటనలు చేసినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దానికి ప్రధాన కారణం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరికీ అర్థంకావడం, ప్రయోజనకరంగా ఉండడమే అనడం కాదనలేని సత్యం.
ఇలాంటి సమయలో కరోనా విషయంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ ఎంతగా అరచిగీపెట్టినా వాస్తవానికి అది పొంతనలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దానిని సహించలేని చంద్రబాబు ఏపీలో పరిస్థితులను చక్కదిద్దే క్రమానికి అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నట్టు కొందరు సందేహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అనేక చోట్ల స్పష్టమవుతున్నా ఏపీలో అలాంటి పరిస్థితి రాకుండా తీసుకుంటున్న చర్యలకు బ్రేకులు వేసేందుకు కుట్రలు పన్నుతున్నారా అని అనుమానిస్తున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో ఆదుర్ధాకి అదే కారణమని అంటున్నారు. వ్యవస్థలో ఉన్నందున నిమ్మగడ్డ రమేష్ పేరుతో ఈ తంతు నడుపుతున్నప్పటికీ వాస్తవానికి చంద్రబాబు ఈ హంగామాకి రూపకర్తగా వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. టీడీపీ చెప్పినట్టుగా ఆడుతూ రాష్ట్రంలో పరిస్థితులను తారుమారు చేయాలని ఆలోచిస్తున్నట్టు విమర్శిస్తున్నారు.
వాస్తవానికి ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల ప్రక్రియను పాఠశాలలు తెరవడంతో పోల్చడం అవివేకం అవుతుంది. బడి పిల్లలు ఇంటి నుంచి బడికి రావడం, మళ్లీ ఇంటికి వెళ్లడం మూలంగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. కానీ ఒకసారి స్థానిక ఎన్నికలకు సిద్ధమయితే సీన్ పూర్తిగా మారిపోతుంది. క్షేత్రస్థాయిలో పరిణామాలు వేరుగా ఉంటాయి. అందులోనూ స్థానిక ఎన్నికలు కావడంతో ఆయా గ్రామాల్లో వివిధ వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. దాని మూలంగా వైరస్ విజృంభణకు ఆస్కారం ఏర్పడుతుందనే ఆందోళన పలువురు వైద్యుల నుంచి కూడా వస్తోంది అలాంటి స్థితి రాకుండా మరో మూడు, నాలుగు నెలలు గడిపితే వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా వైరస్ ని అధిగమించవచ్చని అంతా ఆశిస్తుంటే చంద్రబాబు- నిమ్మగడ్డ ద్వయం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయకరంగా మారుతోంది. రాజకీయంగా పబ్బంగడుపుకోవానే ఆతృతలో ఏపీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టాలనే దుర్నీతి బయటపెడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి ఎన్నికలు జరిపినా టీడీపీకి మరింత గట్టి దెబ్బ తప్పదు. ఓవైపు అధికార పక్షం జనాల్లో ఉంటే విపక్షం ఇంట్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలు సహజంగానే కష్టాల్లో తమ వెంట ఉన్న వారిని ఆదరించే అవకాశం ఉంటుంది. సమస్య రాగానే హైదరాబాద్ పారిపోయే పార్టీకి బుద్ధి చెప్పడం అనివార్యం అవుతంది. ఇది టీడీపీ నేతలకు కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ స్థానిక ఎన్నికల హంగామా సృష్టించడం రాజకీయాల కోసం రాష్ట్ర్ర ప్రజలతో ఆడుకునే ప్రయత్నంగానే అంతా భావించాల్సి వస్తోంది.