Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై మళ్లీ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించి టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఓటమి భయంతోనే వైసీపీ ఎన్నికలు వద్దంటోందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీనిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీకి నిజంగానే ఓటమి భయం ఉందా..? తెలుగుదేశానికే గెలుపు అవకాశాలు ఉన్నాయా..? అందుకే ఎన్నికలకు తొందరపడుతుందా..? అనే చర్చ మొదలైంది. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఎవరికి ఓటమో.. ఎవరికి భయమో అన్న విషయాలు బయటపడతాయి.
అభ్యర్థులే దొరకలేదు కదా..?
ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం రెండు దశల్లో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం అస్సలు లేదనే చెప్పొచ్చు. కరో్నా నేపథ్యంలో ఆంక్షలు కూడా ఏమీ లేవు. దీంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికల అవసరం లేకుండానే 2129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పీటీసీ స్థానాలు వైసీపీ అభ్యర్థులకు ఏకగ్రీవం అయ్యాయి. చాలా స్థానాల్లో టీడీపీ నుంచి నామినేషన్లు వేసేందుకు కూడా అభ్యర్థులు దొరకలేదు. ఇదిలా ఉండగా.. కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మార్చి 15న నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. దీనిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు డైరెక్షన్ వల్లే నిమ్మగడ్డ అలా చేశారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడే స్థానిక ఎన్నికలు జరిగితే మెజార్టీ స్థానాలను వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుపొందేవారని నాటి సమీకరణాలు చెబుతున్నాయి.
మనకు తగునా ఇటువంటి స్టేట్‌మెంట్‌లు..
మార్చితో పోల్చుకుంటే.. ఈ 7 నెలల కాలంలో వైసీపీ పార్టీకి ప్రజలలో విపరీత ఆదరణ పెరిగినట్లు కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన ప్రజలను వైసీపీకి దగ్గర చేస్తోంది. ఈ 7 నెలల కాలంలోనే కాపు నేస్తం, టైలర్లకు సహాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఆర్థిక సహాయం, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ, జగనన్న విద్యా కానుక వంటి పథకాలు ఏపీలో అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల ఆయా వర్గాలకు కలిగిన మేలు అంతా ఇంతా కాదు. జగనన్న విద్యా కానుక జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది. అనేక రాష్ట్రాల సీఎంలు సైతం ఆశ్చర్యపోయారు. ఇక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందానికి హద్దుల్లేవు. ఈ పథకాలతో దాదాపు ఏపీలోని ప్రతీ కుటుంబం వైసీపీపై అభిమానం పెంచుకున్నట్లు ఆయా కార్యక్రమాల ద్వారా వచ్చిన స్పందనను బట్టి అర్థమవుతోంది. దీంతో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇక మూడు రాజధానుల ప్రకటన అనంతరం ఏపీలో టీడీపీ పరిస్థితి తెలిసిందే. ఎమ్మెల్యేలే పార్టీని వీడుతున్నారు. ఇక ప్రజలేం ఆదరిస్తారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించడం ఆ పార్టీ వర్గాలకే విస్మయం కలిగిస్తోంది. పనిలో పనిగా ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే ఎన్నికలకు భయపడుతోందని స్టేట్‌మెంట్ లు ఇచ్చేస్తున్నారు టీడీపీ నాయకులు. మనమున్న పరిస్థితుల్లో ఇటువంటి స్టేట్‌మెంట్‌లు అవసరమా..? అని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లి ఓడిపోవడానికి తొందరెందుకో..? అని కూడా అనుకుంటున్నారు. పార్టీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజల్లో ఇంకెలా ఉందో..?