iDreamPost
iDreamPost
రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో దిక్కుతోచని తెలుగుదేశం పార్టీ చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. ప్రభుత్వంపై ఏదో ఒక అభాండం వేయడం, దానికి విస్తృతంగా ప్రచారం కల్పించడం కోసం వింత గొలిపే ఆందోళనలు చేస్తూ మీడియా దృష్టిలో పడడం ఒక స్ట్రాటజీగా అమలు చేస్తోంది. అందుకే నిజనిర్ధారణ కమిటీలు, నారీ సంకల్ప దీక్ష అంటూ హడావిడి చేయడం.
తాజాగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కూడా బుధవారం అలాంటి నిరసన దీక్ష చేశారు. ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను బట్టి అసలు ఉమ ఎందుకు దీక్ష చేశారో ఆయనకైనా తెలుసా అన్న సందేహం కలుగుతోంది. తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ జిల్లాగా, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేసిన ఉమ అసలు జిల్లాల ఏర్పాటునే తప్పుపడుతూ ప్రసంగించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? అసలు కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి అని బోండా ఉమ ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో… కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.
ఇదేమి స్టాండ్?
ఒక రాజకీయ పార్టీగా కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించడమో, వ్యతిరేకత వ్యక్తం చేయడమో లేదా తటస్థంగా ఉండడమో టీడీపీ ఇష్టం. ఇదేదీ కాకుండా ఒకపక్క జిల్లాలకు ఎన్టీఆర్, వంగవీటి రంగా పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయడం, మరోపక్క అసలు జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మధ్య తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నారీ సంకల్ప దీక్ష చేసినప్పుడు కూడా ఆమె.. చంద్రబాబు చేయమన్నారు కనుకే దీక్ష చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు బోండా ఉమ కూడా బాబు చెప్పడం వల్లే దీక్ష చేశారు తప్పితే దీనిపై ఆయనకు క్లారిటీ లేదని అర్థం అవుతోంది. పరస్పర విరుద్ధంగా సాగిన ఉమ ప్రసంగమే అందుకు నిదర్శనం.
అసలు దీక్ష ఎందుకు?
జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 13 నుంచి 26కి జిల్లాల సంఖ్యను పెంచిన వివరాలు తెలియజేసింది.
దానిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయడానికి 30 రోజులు గడువు ఇచ్చింది. గడువులోగా ప్రభుత్వానికి తమ సలహాలు చెప్పడం మానేసి అర్థం లేని వీధిపోరాటాలు చేయడం దేనికి అని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : బాబు అండ్ కో కొత్త ఎత్తుగడ, ఒంగోలు సుబ్బారావుగుప్తా ఎపిసోడ్ అందులో భాగమేనా..?