iDreamPost
iDreamPost
శతాబ్దికి పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లకుపైగా పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే నెట్టుకొస్తోంది. 2019లో ఎదురైన దారుణ పరాభవానికి బాధ్యత వహిస్తూ అప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పట్లో ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గలేదు. దాంతో రెండున్నరేళ్లుగా సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో నాయకత్వ మార్పు, సమూల సంస్కరణల కోసం పట్టుబడుతున్న జీ 23 నేతల డిమాండ్లను ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా నీరుగార్చేశారు. వచ్చే ఏడాది వరకు తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని తేల్చేశారు. పనిలో పనిగా రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష పదవి అలంకరించాలని పార్టీ నేతల చేత డిమాండ్లు చేయించారు. దానికి రాహుల్ గాంధీ చూస్తాను.. పరిశీలిస్తాను అని బిల్డప్ కూడా ఇచ్చారు.
ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే సోనియా లేదంటే రాహుల్ మాత్రమే నాయకత్వం వహించాలి అన్నట్లుగా ఉంది. గాంధీయేతర నేతల విషయం ఎలా ఉన్నా గాంధీ కుటుంబంలోనే ఉన్న మూడో అధికార కేంద్రం గురించి ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించడం లేదనిపిస్తోంది. రాహుల్ సోదరి ప్రియాంకను ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అన్ని అర్హతలు ఉన్న నేతగా పార్టీ ముఖ్యులు ఆకాశానికి ఎత్తేసేవారు. మాజీ ప్రధాని ఇందిర పోలికలు, ఆకర్షణ శక్తి, దూకుడు నిండుగా ఉన్న ప్రియాంక నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే పార్టీకి తిరుగు ఉండదన్న అభిప్రాయాలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఆమెను ఉత్తరప్రదేశ్ కే పరిమితం చేసి.. సమర్థుడిగా నిరూపితం కాని రాహుల్ ను అధ్యక్ష పదవి చేపట్టమని బతిమాలడటం విడ్డురంగా ఉంది.
Also Read : Punjab Amarinder -అమరీందర్ కొత్త పార్టీ.. బీజేపీతో కలిసి పోటీ
ప్రచారానికే ప్రియాంక
ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసును గట్టెక్కించే బాధ్యత స్వీకరించారు. దానికి తగ్గట్లే ఆమె ప్రజల్లోకి చొచ్చుకుపోతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఆమెను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆమధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు అటువంటి ప్రకటన ఏదీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇస్తూ.. దానిపై ఇప్పుడే చెప్పలేనంటూ దాటవేయడం గమనార్హం. వాస్తవానికి 2017 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన ప్రియాంకకు అప్పట్లోనే సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సింది. కానీ అలా చేయకపోవడానికి కారణం రాహుల్ గాంధీ అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ప్రియాంకకు అవకాశం ఇస్తే పార్టీని ఆమె తన గుప్పిట్లోకి తీసుకుంటుందని అతను భయపడుతున్నారని పీకే వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సింది..కానీ ఆమెను యూపీకి పరిమితం చేయడానికి కూడా అదే కారణమని అన్నారు. యూపీలో కూడా సీఎం అభ్యర్థిగా కాకుండా ప్రచార సారధిగానే చూస్తున్నారు.
కిరీటం లేని రాజు రాహుల్
ఢిల్లీ పీఠానికి దగ్గరి దారి యూపీ అంటారు. అలాంటి యూపీలో సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటిస్తే కాంగ్రెసు ప్రజల్లో లభించే మైలేజ్ కంటే పార్టీపై ఆధిపత్యం విషయంలో ప్రియాంక తనకు పోటీ రాకుండా చూసుకోవాలన్నదే రాహుల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో లేకపోయినా పార్టీ పెత్తనం అంతా రాహుల్ దే. సీఎంల మార్పు నుంచీ అన్ని కీలక నిర్ణయాలను ఆయనే తీసుకుంటున్నారు. ఇటీవల పంజాబ్ సీఎం, పీసీసీ అధ్యక్షుడి మార్పు వంటివన్నీ ఆయన నిర్ణయం మేరకు జరిగినవే. కానీ అధికారికంగా అధ్యక్ష పదవి చేపట్టేందుకు మాత్రం జంకుతున్నారు. తన సామర్థ్యంపై నమ్మకం లేకో.. 2019 పరాజయం పునరావృతం అయితే పూర్తిగా పరువు పోతుందన్న భయం వల్లో అధ్యక్ష పదవి విషయంలో ఇంకా డోలాయమానంలోనే ఉన్నారు. అలాగని అన్ని అర్హతలు ఉన్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్న సోదరి ప్రియాంకకు అవకాశం లేకుండా అడ్డుగా నిలుస్తున్నారు. దీనివల్ల పార్టీ నష్టపోతున్న విషయాన్ని గుర్తించడంలేదు.
Also Read : Congress Offer – యూపీ ఎన్నికలు.. 40 శాతం సీట్లు మహిళలకేనట