Idream media
Idream media
గత సంవత్సరం ప్రపంచం మీద కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు దానితో యుద్ధం చేయడానికి వైద్యుల వద్ద తగిన ఆయుధాలు లేవు. స్టీరాయిడ్స్, ఆక్సిజన్ సపోర్ట్ లాంటివి ఇచ్చి భారం పేషంట్ల ఇమ్యూనిటీ మీద వదిలేశారు.
ఇప్పటికిప్పుడు కరోనాని తగ్గించే కొత్త మందు రావడం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్న మందులని ప్రయోగాత్మకంగా వాడి చూశారు. మలేరియా మందు క్లోరోక్విన్, పరాన్నజీవుల మీద వాడే ఐవర్ మెక్టిన్, వైరస్ వ్యాధుల మీద వాడే రెమెడిసివిర్ ఇలా వాడినవే. వీటిలో రెమెడిసివిర్ కొంచెం మంచి ఫలితాలు ఇవ్వడంతో వ్యాధి తీవ్రత బట్టి వాడాలన్న నిపుణుల సలహాలు పట్టించుకోకుండా కరోనా పేషంట్లకి ఆ ఇంజెక్షన్ ఎడాపెడా వాడేశారు.
ఆదిలోనే హంసపాదు –
రెమెడిసివిర్
అమెరికా ఔషధ తయారీ బహుళజాతి కంపెనీ గిలియడ్ సైన్సెస్ 2009లో హెపటైటిస్-C, రెస్పెరేటరీ సిన్సీషియల్ వైరస్ అనే రెండు వైరస్ వల్ల కలిగే జబ్బుల కోసం ఈ మందు తయారు చేసింది. ట్రయల్స్ లో బాగా పనిచేసిన ఈ మందు మార్కెట్ లోకి వచ్చాక పేషంట్ల మీద వాడితే ఆ రెండు జబ్బుల మీద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
రెమెడిసివిర్ అభివృద్ధి చేయడానికి పెట్టిన కర్చు, పడ్డ శ్రమ ఏట్లో పోసినట్టు అయింది అనుకుంటుండగా 2013లో ఆఫ్రికా ఖండంలో ఎబోలా, మార్బర్గ్ అనే రెండు వైరస్ వల్ల కలిగే జబ్బులు అనేక దేశాల్లో వ్యాపించాయి. అమెరికా సైన్యానికి చెందిన వైద్యులు ఆ జబ్బుల మీద రెమెడిసివిర్ వాడి చూస్తే బాగా పనిచేసింది. ఆ తరువాత పిల్లులలో కడుపులో ఇన్ ఫెక్షన్ కలిగించే ఒకరకం కరోనా వైరస్ ని కూడా ఈ మందు సమర్ధవంతంగా నయం చేయగలదని గమనించిన పశువుల వైద్యులు కూడా వాడారు.
కరోనా వైరస్ ని పోలిన వైరస్ వల్ల కలిగే SARS, MERS లాంటి వ్యాధులను రెమెడిసివిర్ సమర్ధవంతంగా నయం చేయడం వల్ల కోవిడ్ పేషంట్ల మీద మూడు స్వల్పకాలిక ట్రయల్స్ అనంతరం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ FDA కోవిడ్ చికిత్సలో రెమెడిసివిర్ వాడకానికి అక్టోబర్ 2020లో అనుమతి ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యాభైకి పైగా దేశాల్లో కోవిడ్ చికిత్సలో రెమెడిసివిర్ ఇంజక్షన్ వాడుతున్నారు.
కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అప్పటికే వాడకంలో ఉన్న మందులను కొత్త వ్యాధులు ఎదుర్కోవడానికి వాడడాన్ని ఆఫ్ లేబిల్ వాడకం అంటారు. కొత్త మందు కనిపెట్టి, ట్రయల్స్ పక్కాగా పూర్తి చేసి చికిత్సలోకి ప్రవేశపెట్టడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటికే అందుబాటులో ఉన్న మందులను కొత్తగా వచ్చిన జబ్బుల మీద ప్రయోగించి చూసి ఫలితాలు బాగా ఉంటే పేషంట్ల మీద వాడడానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇస్తారు. రెమెడిసివిర్ ఇంజక్షన్ కి కూడా ఇలాగే కొన్ని నిబంధనలతో అనుమతి లభించింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు అందరూ జబ్బు తీవ్రతతో సంబంధం లేకుండా ఎడాపెడా వాడేశారు. దీంతో ఆ ఇంజెక్షన్ కొరత ఏర్పడి చాలా చోట్ల అయిదు రోజుల కోర్సుకి కావలసిన ఇంజెక్షన్లని బ్లాక్ మార్కెట్లో లక్షలు పోసి కొన్నారు రోగుల బంధువులు.
శాంపుల్ సైజూ, కాలపరిమితి తక్కువ ఉన్న ట్రయల్స్ ఆధారంగా కోవిడ్ పేషంట్లకి రెమెడిసివిర్ వాడకానికి అనుమతి ఇచ్చినా నిజంగా ఆ మందు పని చేస్తుందో లేదో నిగ్గు తేల్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాలిడారిటి ట్రయల్ పేరిట ఒక డబుల్ బ్లైండ్ స్టడీ నిర్వహించింది. ముప్పై దేశాలలో, అయిదు వందల కోవిడ్ సెంటర్లలో, పన్నెండు వేలమంది కోవిడ్ రోగుల మీద ఈ స్టడీ నిర్వహించారు.
ఈ స్టడీలో రోగులని అన్ని విధాలుగా సారూప్యం ఉండే రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు వారికి మందు ఉన్న ఇంజెక్షన్, మరో గ్రూపు వారికి ఎలాంటి ఔషధం లేని సెలైన్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఈ సెలైన్ కూడా అన్ని విధాలుగా అసలైన ఇంజెక్షన్ లాగే ఉంటుంది. ఈ డమ్మీ ఇంజెక్షన్ ని ప్లాసిబో అంటారు. ఎవరు ఇంజెక్షన్ తీసుకుంటున్నారో, ఎవరు ప్లాసిబో తీసుకుంటున్నారో ఇంజెక్షన్ ఇచ్చే వారికి, ఇంజెక్షన్ వేయించుకునే వారికి, వారిని పరిశీలించి ఆ వివరాలు కంపెనీ వారికి పంపేవారికి కానీ తెలియదు. కొత్త మందుల, వాక్సీన్లు పని చేస్తాయో లేదో తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం.
ఈ స్టడీలో మూడు అంశాలను పరిశీలించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ- మరణాలు, ఆసుపత్రిలో ఉండగా వెంటిలేటర్ అవసరం, ఆసుపత్రిలో ఉండవలసిన రోజుల సంఖ్య. అయితే స్టడీ పూర్తి అయ్యాక డేటా విశ్లేషించి చూస్తే రెమెడిసివిర్ ఇంజక్షన్ ఇచ్చిన గ్రూపుకు,ప్లాసిబో ఇచ్చిన గ్రూపుకు తేడా ఏమీ కనిపించలేదు. దీంతో కోవిడ్ చికిత్సలో రెమెడిసివిర్ పాత్ర లేదని తేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ స్టడీలో ఫలితాలని అనుసరించి గత నవంబరులో కోవిడ్ చికిత్సలో రెమెడిసివిర్ పాత్ర లేదని ఆ సంస్థ ప్రకటించింది.
అయితే ఆసుపత్రిలో చేరిన పేషంట్లకి రెమెడిసివిర్ ఇంజక్షన్ వినియోగించడం మాత్రం చాలా దేశాల్లో ఆగలేదు. వాటిలో భారత దేశం ఒకటి. అయితే 2020, మే 19న ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ రాణా రెమెడిసివిర్ కోవిడ్ పేషంట్లకి ఏమాత్రం ఉపయోగపడడం లేదని ప్రకటించారు. వెనువెంటనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ కూడా కోవిడ్ చికిత్సలో రెమెడిసివిర్ ని ఉపసంహరించుకోబోతున్నట్టు ప్రకటించింది.
నూట ఇరవై సంవత్సరాల ప్లాస్మా థెరపీ
కోవిడ్ వల్ల ప్లాస్మా థెరపీ గురించి అందరికీ తెలిసింది కానీ ఆది కొత్త విధానం కాదు. యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ డ్రగ్స్ ఆవిష్కరణ కన్నా ముందే వైద్యులు వాటి వల్ల కలిగే అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ప్లాస్మా థెరపీని వాడారు.
బాక్టీరియా లేదా వైరస్ వల్ల కలిగే వ్యాధుల నుంచి కోలుకుంటున్న వ్యక్తిలో ఆ సూక్ష్మజీవి మీద పోరాడే యాంటీబాడీలు ఉంటాయి. రక్తకణాలను వేరు చేసి, ఈ యాంటీబాడీలు ఉన్న ప్లాస్మాని అదే జబ్బు సోకిన వ్యక్తికి ఎక్కిస్తే ఆ వ్యక్తి తొందరగా కోలుకోవడం కానీ,జబ్బు తీవ్రత తగ్గడం కానీ జరుగుతుందని ఆలోచించి ఆచరణలో పెట్టిన వ్యక్తి జర్మనీకి చెందిన ఎమిల్ వాన్ బెహ్రింగ్. డిఫ్తీరియా సోకిన పిల్లల మీద ప్లాస్మా థెరపీ వాడి చాలా మంది ప్రాణాలు కాపాడినందుకు 1901లో నోబుల్ బహుమతి అందుకున్నారు.
1901లో ఇటలీకి చెందిన సెన్సీ తట్టు (మీజిల్స్) వ్యాధిలో ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు సాధించడంతో 1915లో ఇటలీ లోని ట్యూనిస్ నగరంలో చిన్న పిల్లలకు సోకే గవద బిళ్లలు (మంప్స్) లో, 1915లో న్యూయార్క్ నగరంలో పోలియో వ్యాధి సోకిన వారిలో, 1918-20 మధ్య స్పానిష్ ఫ్లూ పాన్ డెమిక్ సమయంలోనూ, 2003లో SARS, 2009లో MERS వ్యాధులు విజృంభించినప్పుడూ ప్లాస్మా థెరపీని వాడి చాలావరకూ ఆ వ్యాధులను కట్టడి చేశారు.
గత సంవత్సరం కరోనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలలో భాగంగా చైనాలోని వుహాన్ నగరంలో, అమెరికా లోని హూస్టన్ లోని కొన్ని సెంటర్లలో ప్లాస్మా థెరపి ఉపయోగించి ప్రోత్సాహకరమైన ఫలితాలు పొందడంతో అమెరికా FDA గత ఆగస్టు నెలలో కరోనా పేషంట్లకి ప్లాస్మా థెరపీ వాడకానికి అనుమతి ఇచ్చింది. ఆ తరువాత భారతదేశంతో సహా అనేక దేశాలు ప్లాస్మా థెరపిని అనుమతించాయి.
సప్లై కన్నా డిమాండ్ అధికం కావడంతో ఇందులో కూడా బ్లాక్ మార్కెటింగ్, వ్యాపార ధోరణి ప్రవేశించి, స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడంతో పాటు , ప్లాస్మాని అధిక ధరలకు అమ్మడం కూడా మొదలైంది. అనేక మంది సెలబ్రిటీలు కోవిడ్ నుంచి కోరుకున్న వారిని తమ ప్లాస్మా దానం చేయవలసిందిగా ప్రోత్సహించారు.
అసలు ఈ ప్లాస్మా థెరపీ నిజంగా పని చేస్తుందో లేదో చూడడానికి క్షేత్ర స్థాయిలో చేసిన స్టడీలలో ఇది ఏమంత ప్రోత్సాహకరమైన ఫలితాలు ఇవ్వడం లేదని తెలిశాక అనేక దేశాలు ఒకటొకటిగా ప్లాస్మా థెరపీని వదిలిపెట్టాయి. మన దేశంలో కూడా కోవిడ్ నియంత్రణ కోసం నియమించిన టాస్క్ ఫోర్స్ మే 14న ప్లాస్మా థెరపీని కోవిడ్ చికిత్సల జాబితాలో నుంచి తొలగించింది.
అపజయాలు కూడా ముఖ్యమే
విఙాన రంగంలో ఒక విజయం వెనుక అనేక పరాజయాలు ఉంటాయి. ప్రాణాలను కాపాడే ఒక కొత్త మందు ఆవిష్కరణ వెనక ప్రయోగాలు చేసి పనికిరావని తేల్చిన అనేక మందులు ఉంటాయి. రెమెడిసివిర్ ఇంజక్షనే తీసుకుంటే హెపటైటిస్ C కోసం తయారు చేసిన ఆ మందు దానికి పనిచేయలేదు. ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాల్లో ఉధృతంగా వ్యాపించినప్పుడు దానిమీద వాడి చూస్తే సమర్ధవంతంగా పనిచేసింది.
ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ ఇదివరకు ఎన్నడూ ఎవరూ చూడని సరికొత్త ఉత్పాతం. దానికి తోడు ఇది తన జన్యు స్వరూపాన్ని కూడా మ్యుటేషన్ ద్వారా మార్చుకుంటూ మానవాళికి సవాలుగా పరిణమిస్తోంది. దీనికి తగిన కొత్త మందులు ఇప్పటికిప్పుడు తయారు చేయడం వీలు కాదు. కొత్త మందు అన్ని దశలనూ దాటుకుని వైద్యుల చేతిలోకి వరకు ఈ వైరస్ తన మారణహోమం ఆపదు.
ఇలాంటి విపత్కర పరిస్థితిలో సాధారణంగా నిపుణులు చేసే పని ఇప్పటికే అందుబాటులో ఉండి, మానవ వినియోగానికి సురక్షితం అని తేలిన మందులు వాడి చూడడం. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు సమర్ధవంతంగా పని చేస్తాయి అనుకున్న మందులు, చికిత్సా విధానాలు రేపు పనిచేయడం లేదని తేలే అవకాశం ఉంది. అప్పుడు వాటిని వదిలి పెట్టి మరొకదానిని అన్వేషించుకుంటూ పోతారు నిపుణులు. ఇదంతా విపత్తును ఎదుర్కొనే క్రమంలో జరిగే ప్రక్రియే కానీ ఆ మందుల లేదా చికిత్సా విధానాల వైఫల్యమో లేక వాటిని సిఫార్సు చేసిన నిపుణుల వైఫల్యమో కాదు.