iDreamPost
iDreamPost
ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఖరి వివాదాస్పదమవుతోంది. చివరకు న్యాయస్థానాల్లోనే నిలదీసేందుకు కారణమవుతోంది. తనకు ఎంపీ టికెట్ ఇచ్చి, గెలిచేందుకు కారకుడయిన వైఎస్సార్సీపీ అధినేతపై ఆయన తిరుగుబాటు చేశారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ పై విచారణ పూర్తయ్యింది. కోర్టు తీర్పు వెలువడుతుందనే సందర్భంలో అవే కేసుల్లో సహనిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ మరో పిటీషన్ వేశారు. తద్వారా జగన్ కేసులో తీర్పు జాప్యం చేయాలనే లక్ష్యంతో పిటీషనర్ ఉన్నారనే అభిప్రాయం కలిగించారు.
చివరకు ఒకే కేసులో నిందితులుగా ఉన్న వారి బెయిల్ రద్దు కోరుతూ ఒకే వ్యక్తి పిటీషన్ వేయడమే కాకుండా, ఒకే విధమైన ఆరోపణలు చేసిన తరుణంలో రెండు పిటీషన్లపై విచారణ పూర్తయిన తర్వాతనే తుది తీర్పు అని సీబీఐ కోర్టు వెల్లడించింది. దానికి అనుగుణంగా గత నెలలో జరిగిన విచారణలో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వేసిన పిటీషన్ పై విచారణ పూర్తి చేసింది. సెప్టెంబర్ 15న తుది తీర్పు వెలువడే అవకాశం ఉందనే అభిప్రాయం అందరికీ కలిగింది.
తీరా కేసులో తీర్పు వచ్చే సమయానికి విచారణ మరో కోర్టులో జరపాలంటూ రఘురామకృష్ణంరాజు మరోసారి తెలంగాణా హైకోర్టుని ఆశ్రయించడం ఆశ్చర్యకరంగా మారింది. కోర్టు కి కొంత అసహనం కలిగించే విధంగా మారింది. ముఖ్యంగా బెంచ్ మార్చాలని , కోర్టు మార్చాలని కోరడం అంటే విచారణ జరుపుతున్న కోర్టు మీద విశ్వాసం లేదని చెప్పడమే అన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే సీబీఐ కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పు మాత్రమే రిజర్వు చేసింది. అలాంటి సమయంలో విచారణ మరో కోర్టులో జరపాలని కోరడం ద్వారా ఈ కేసుని మరికొంత కాలం పాటు కొనసాగించాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారనే అభిప్రాయానికి ఊతం లభిస్తోంది. ముఖ్యంగా రాజకీయ లక్ష్యాల కోసం ఈ కేసుని వాడుకుంటున్నారని జగన్ తరుపున న్యాయవాదులు తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు పిటీషనర్ దానికి తగ్గట్టుగా ఉంది.
రాజకీయ లక్ష్యాల సాధన కోసం కోర్టులను వాడుకోవాలని చూస్తున్న రఘురామరాజు తీరుని తెలంగాణా హైకోర్టు కూడా సందేహించింది. ఇలాంటి వైఖరిపై కొంత అసంతృప్తి కూడా ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో తెలంగాణా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్, విజయసాయిరెడ్డి బెయిళ్లు రద్దు కోరుతూ వేసిన పిటీషన్ లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సీబీఐ అభిప్రాయంగా వెలువడిన నేపథ్యంలో బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేస్తారా లేక కొనసాగిస్తారా అన్నది కూడా చర్చనీయాంశమే. తన పిటీషన్ లో చేసిన వాదనలకు తగిన ఆధారాలు చూపించలేక, ఇలాంటి ప్రయత్నాలకు పిటీషనర్ దిగుతున్నారనే అభిప్రాయం కలిగించేలా తాజా పరిణామాలుండడం విశేషం. కోర్టుల వైఖరినే సందేహించే స్థితికి ఆయన రావడం అందుకు దర్పణంగా నిలుస్తోంది.