iDreamPost
iDreamPost
ప్రశాంత్ కిషోర్.. దాదాపు ఏడెనిమిదేళ్లుగా దేశ రాజకీయాల్లో ఆయన పేరు మారుమ్రోగుతోంది. రాజకీయ పార్టీలో ప్రత్యక్ష పాత్ర స్వల్పమే అయినా దాదాపు అన్ని పార్టీలు ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాయి. చివరకు ప్రతీ పార్టీకి ఏదో సందర్భంలో ఆయన సేవలు అందిస్తూనే వచ్చారు. దాంతో ప్రశాంత్ కిషోర్ కేవలం రాజకీయ వ్యూహకర్తగా మిగిలిపోతారనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. అంతేగాకుండా ఇక తాను ఎన్నికల వ్యూహాల పని ఐప్యాక్ టీమ్ కి అప్పగించి, పూర్తిస్థాయి పొలిటీషియన్ గా పరిణామం చెందుతున్నట్టు ప్రకటించారు.
దానికి ముందే జేడీయూలో ఆయన చేరినప్పటికీ ఎక్కువ కాలం తన సొంత రాష్ట్రంలో మనుగడ సాగించలేకపోయారు. చివరకు జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా జాతీయ పార్టీల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నేతలకు సన్నిహితంగా వ్యవహరించారు. త్వరలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆయనకు ఏ బాధ్యత అప్పగిస్తారననే చర్చ కూడా సాగింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన తర్వాత పీకే స్వరం మారింది. కాంగ్రెస్ ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ నాయకత్వం మీదే అపోహలు పెంచే రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి.
రెండు మూడు నెలల క్రితం కాంగ్రెస్ లేకుండా విపక్ష కూటమి ఉండదనే నిర్ణయానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ వివిధ పార్టీలను కలిపే ప్రయత్నం చేశారు. ఆయనే స్వయంగా శరద్ పవర్ సహా పలువురిని కలిసి కాంగ్రెస్ తో కూటమికి దాదాపు సిద్ధం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత మమతా బెనర్జీ మళ్లీ 10 జన్ పథ్ లో అడుగుపెట్టడానికి ఆయన ప్రయత్నాలే కీలకం. ఇక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్షాల ఐక్యతకు ఈ ప్రయత్నాలన్నీ దోహదం చేశాయి. అయితే అనూహ్యంగా ఆయనే మళ్లీ కాంగ్రెస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాహుల్ అవగాహనా రాహిత్యంతో బీజేపీని తక్కువ అంచనా వేస్తున్నారని, 30 శాతం ఓటర్ల బలం ఉన్న బీజేపీ చాలాకాలం పాటు దేశరాజకీయాల్లో కీలకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ సామర్థ్యం మీద సందేహాలు రేకెత్తించే అభిప్రాయం ప్రశాంత్ కిషోర్ వెలిబుచ్చడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
Also Read : PK Prasanth Kishore – రాజకీయాలకు పనికిరానంటున్న పీకే
వాస్తవానికి మోదీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని రాహుల్ తో పాటుగా పీకే కూడా బలంగా నమ్ముతున్నారు. మోదీ సారధ్యంలో బీజేపీకి మరోసారి అవకాశాలు స్వల్పమని వారిద్దరి అంచనాల్లో పెద్దగా తేడా లేదనే చెప్పవచ్చు. అయితే మోదీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమికి ఎవరు సారథ్యం వహించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నట్టు తాజా ప్రకటనలు చాటుతున్నాయి. రాహుల్ తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ వెనుక కారణమదే కావచ్చని పలువురి అభిప్రాయం. ముఖ్యంగా మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలిపేందుకు అనుగుణంగా కాంగ్రెస్ లో తనకు సంస్థాగత వ్యవహారాల్లో స్వేచ్ఛ కావాలని ప్రశాంత్ కిషోర్ షరతు పెట్టారు. అయితే దానిని ఆపార్టీ సీడబ్య్లూసీ తిరస్కరించింది. పైగా ప్రశాంత్ కిషోర్ కి కీలక పదవులు ఇవ్వడానికి సీనియర్లు కూడా ససేమీరా అన్నట్టు సమాచారం. దాంతో పీకేకి ప్రముఖ స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడం ఈ రాజకీయ వ్యూహకర్తకు ఆశాభంగం కలిగించినట్టుగా అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా మోదీ పట్ల వ్యతిరేకత, రాహుల్ అసమర్థత అనే అంశాల ప్రాతిపదికన ప్రత్యామ్నాయ నేతను ముందుకు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది కొందరి వాదన. కాలం కలిసి వస్తే తానే ఆ ప్రత్యామ్నాయం కాగలననే విశ్వాసం కూడా ఆయనలో కనిపిస్తూ ఉంటుందని కొందరి అభిప్రాయం. దాంతో మోదీ, రాహుల్ కాకుండా తనకు అవకాశం దక్కేలా కొన్ని రాజకీయ ఎత్తులు వేస్తున్నారనే టాక్ ఢిల్లీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కూడా హస్తిన ఆలోచనలో ఉన్నారు. కేజ్రీవాల్ వంటి వారు కాచుకుని ఉన్నారు. మధ్యలో నేరుగా ప్రశాంత్ కిషోర్ కి అవకాశం దక్కడం కష్టం. కాబట్టి ఇలాంటి సందిగ్ధత ఏర్పడితే అప్పుడు గతంలో దేవగౌడ, ఐకే గుజ్రాల్ వంటి వారు అనూహ్యంగా ముందుకొచ్చిన చరిత్ర ఉన్న నేపథ్యంలో తనకు కూడా ఛాన్స్ ఉండకపోదన్నది పీకే లెక్క. దానికి తగ్గట్టుగానే పొలిటికల్ వ్యవహారం చక్కదిద్దుతున్నట్టు చెబుతున్నారు
ఇప్పటికే మోదీ వ్యతిరేక శిబిరంలో ప్రశాంత్ కిషోర్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ జరిగి పీకే అంచనాలకు తగ్గట్టుగా ఓ కూటమిగా బరిలోకి వెళితే కాంగ్రెస్ ని ఎలా కలుపుకుపోతారన్నదే ప్రశ్న. రాహుల్ నాయకత్వం మీద ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా ఆయన్ని తక్కువ చేస్తూ రాజకీయంగా ఎదగడానికి అడ్డంకులు పెడుతుండడం వెనుక ప్రణాళిక ఉందనే వారు పెరుగుతున్నారు. ప్రశాంత్ కిషోర్ పెద్ద వ్యూహంతోనే బరిలో దిగి, చక్రం తిప్పే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో త్వరలో ఆయన మరింత క్రియాశీలకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గూటిలో ఆయన డిమాండ్లకు తలొగ్గే అవకాశం లేకపోవడంతో ఖంగుతిన్నందున ఇక ఏం చేస్తారు, ఎలా చేస్తారన్నది చూడాలి.
Also Read : Prashant Kishor – BJP : 40 ఏళ్లు బీజేపీనే.. పీకే వ్యూహాలే కాదు మనిషి కూడా అర్థం కాడు