Idream media
Idream media
ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ప్రజల కష్టాలు, వారి అవసరాలు తీర్చాలి. సమస్యలు పరిష్కరించాలి. వారు దోపిడీకి గురికాకుండా కాపాడాలి. అలా చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారు. ప్రజలు దోపిడికి గురవుతుంటే.. అధికారంలో ఉన్నప్పుడు మాట మాత్రమైనా మాట్లాకుండా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది గుర్తుకురావడం రాజకీయ నేతల నైజం కావొచ్చు. అందుకే టీడీపీ సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చిరు వ్యాపారుల సమస్యలపై అధికారంలో ఉన్నప్పుడు మౌనం వహించి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గళం విప్పుతున్నారు. నాడు చేయగలిగే స్థానంలో ఉండి.. చేయని బుచ్చయ్య ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనేది తెలిసిన విషయమే.
నాడు దోపిడీ తెలియదా..?
రాజమహేంద్రవరం నగరం ఉభయ గోదావరి జిల్లాకు వాణిజ్య రాజధాని. నగరం చుట్టపక్కల ఉన్న రాజానగరం, రంపచోడవరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, మండపేట, కొత్తపేట, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల నుంచి రోజు వారీ వ్యాపార నిమిత్తం ఎంతో మంది నగరానికి వస్తుంటారు. వీరికి నగరంలో ఉండే చిరు వ్యాపారులు అదనం. వీరంతా నగరంలో ఉన్న ఏడు నగరపాలక సంస్థ మార్కెట్ల పరిధిలో, రోడ్ల పక్కన తోపుడు బండ్లు, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించుకుని రాత్రికి తమ నివాసాలకు చేరుకుంటారు.
మార్కెట్ల సరిహద్దుల లోపల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారుల నుంచి నగరపాలక సంస్థ నిర్ణయించిన రోజు వారీ రుసుమును.. సదరు కాంట్రాక్టర్ వసూలు చేస్తారు. అయితే 2017లో రోజు వారీ రుసుము 2 రూపాయలుగా నగరపాలక సంస్థ నిర్ణయిస్తే.. కాంట్రాక్టర్లు చిరు వ్యాపారుల నుంచి పదిరెట్లు అధికంగా వసూలు చేశారు. 20 రూపాయలు వసూలు చేస్తూ వారిని నిలువుదోపిడీ చేశారు.
2018లో రోజువారీ మొత్తాన్ని 2 రూపాయల నుంచి 8 రూపాయలకు నగరపాలక సంస్థ పెంచగా.. ఆశీలు(రుసుము) కాంట్రాక్టర్లు చిరు వ్యాపారుల నుంచి 40 రూపాయల చొప్పన వసూలు చేశారు. మార్కెట్ సరిహద్దుల్లోనే గాక.. రాజమహేంద్రవరం నగరం అంతా వసూళ్లు చేశారు.
ఈ విషయం నాడు పత్రికల్లో వచ్చినా.. అప్పటి ప్రతిపక్ష వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించినా.. నాటి టీడీపీ పాలక మండలి గానీ, ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిగానీ ఆ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇది చిన్న విషయమంటూ నాటి కమిషనర్ విజయరామరాజు మాట్లాడడం ఆశీలు కాంట్రాక్టర్లకు టీడీపీ పాలక మండలి నుంచి ఉన్న మద్ధతుకు నిదర్శనంగా నిలిచింది.
దోపిడీ నుంచి విముక్తి..
బతుకుదెరువు కోసం ఉదయాన్నే నగరానికి వచ్చే బుడుగుజీవులను బెదిరించి రోజూ దోపిడీ చేసే కాంట్రాక్టర్లపై చర్యలు గానీ, ఆ దోపిడీని అరికట్టని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ రోజు ప్రతిపక్షంలోకి రాగానే వారు గుర్తుకురావడం విశేషం. పైగా టీడీపీ హాయంలో జరిగిన రోజువారీ దోపిడికి చెక్ పెట్టేలా.. నెలకు ఒకసారి రుసుము వసూలు చేసే విధానం రావడంపై ఆయన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఈ విధానం వల్ల చిరు వ్యాపారులు ఆశీలు కాంట్రాక్టర్ల దొపిడీ నుంచి విముక్తి పొందుతారు.
ఆకుల ఆ పని చేయగలరా..?
మార్కెట్ల వద్ద ఆశీలు రూపంలో వసూళ్ల ద్వారా నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు కోటి రూపాయలు మాత్రమే. ఇది నగరపాలక సంస్థలకు ఉన్న ఆదాయ మార్గాలతో పొల్చుకుంటే బహు స్వల్పం. అసలు మార్కెట్ల వద్ద రుసుము వసూలు చేసే విధానాన్నే ఎత్తివేస్తే.. చిరు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. నాడు నగర ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత వైసీపీ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఆశీలు రద్దును ప్రతిపాదించారు. నాడు బీజేపీ ఎమ్మెల్యేగా చేయలేని పనిని.. ప్రస్తుతం అధికార పార్టీ నేతగా ఆకులకు చేసే అవకాశం లభించింది. నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి, వైసీపీ పాలక మండలి ఏర్పాటైతే.. ఆకుల సత్యనారాయణ ఈ అంశంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
Also Read : నాణ్యమైన విద్య అంటే స్కూళ్లు మూసేయడమేనా అచ్చెన్నా..?