iDreamPost
android-app
ios-app

కేటీఆర్​ కు అంత కోపం ఎందుకు వచ్చింది ?

  • Published Apr 13, 2021 | 2:43 PM Updated Updated Apr 13, 2021 | 2:43 PM
కేటీఆర్​ కు అంత కోపం ఎందుకు వచ్చింది ?

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ఆచితూచి మాట్లాడుతుంటారు. మీటింగ్స్, సభలు, ఇంటర్వ్యూలు ఎక్కడైనా నోరుజారరు. కానీ వరంగల్ సభలో మాత్రం ప్రతిపక్ష బీజేపీపై ఫైర్ అయ్యారు. కేసులు పెడుతామని, ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. ఇదంతా తన తండ్రి, సీఎం కేసీఆర్​ను తిడుతున్నారనే కోపమా? లేక బీజేపీ పంటి కింది రాయిలా అడ్డొస్తున్నదనే ఫ్రస్ట్రేషనా? అని పొలిటికల్ లీడర్లు చర్చించుకుంటున్నారు.

వరంగల్ నుంచి హెచ్చరికలు

త్వరలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వారం, పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టారు. సోమవారం పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ లీడర్లు ఎవరైనా సీఎం కేసీఆర్‍ను ఇష్టమొచ్చినట్లు తిడితే లా అండ్​ ఆర్డర్‍ కేసులు పెడుతామని వార్నింగ్ ఇచ్చారు. లీడర్లు తమ భాష మార్చుకోకుంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‍షాను కూడా వదలబోమని, ఉతికి ఆరేస్తామని, ఇదే తన చివరి హెచ్చరిక అని స్పష్టం చేశారు. కొత్త బిచ్చగాళ్లు కొందరొచ్చారంటూ మండిపడ్డారు. కేసీఆర్‍ వయసును చూడకుండా, పెద్ద మనిషి అనే సంస్కారం లేకుండా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తాము మాట్లాడటం స్టార్ట్​ చేస్తే మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

Also Read : టీడీపీ, లోకేష్‌లపై అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డిపైనా నిప్పులు చెరిగారు. కేసీఆర్​, టీఆర్​ఎస్​ లేకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్​ ఎక్కడివని ప్రశ్నించారు. ‘‘ఎవడీ బండి సంజయ్, ఎవడా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి..? ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగినోళ్లు వీళ్లు” అని ఆరోపించారు.

బలపడుతున్న బీజేపీ

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. దీంతో తెలంగాణ​లో ఆ పార్టీ పని అయిపోయిందని అనుకున్నారందరూ. కానీ ఆరు నెలలు గడవక ముందే జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ బౌన్స్ బ్యాక్ అయింది. ‘సారు కారు పదహారు’ అన్న టీఆర్ఎస్ వ్యూహాన్ని దెబ్బతీసింది. నాలుగు సీట్లు సాధించింది. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది. ఇక ఆరేడు నెలల కిందట జరిగిన దుబ్బాక బై ఎలక్షన్​ లో గెలిచి గులాబీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సీట్లకు భారీగా గండికొట్టింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా గట్టిపోటీ ఇచ్చింది. తాజా నాగార్జున సాగర్ ఎన్నికల్లోనూ జోరుగా ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ లీడర్లందరూ మూకుమ్మడిగా కేసీఆర్​పై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇటువైపున టీఆర్ఎస్ వాయిస్ అంత బలంగా వినిపించడం లేదు. మరోవైపు అసమ్మతి గళాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కోపం, ఫ్రస్ట్రేషన్​ తోనే కేటీఆర్ ఫైర్ అయ్యారంటూ లీడర్లు చర్చించుకుంటున్నారు.

Also Read : కేసీఆర్‌ సభ.. మంత్రుల్లో టెన్షన్‌