Idream media
Idream media
ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మనిషి అన్నం తినాలంటే అది ఈ భూమ్మీద ఏదో ఒక చోట రైతు పండిస్తేనే దొరుకుతుంది. ఫోన్‌లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు ఎన్ని ఉన్నా టైంకి ఏదో ఒకటి తినకపోతే ఆకలికి చచ్చిపోతాం. అన్నం పెట్టే రైతుపైన మనకి గౌరవం ఉందా?
మనం ఈ రోజు జర్నలిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లీడర్లు ఏమైనా కావచ్చు కానీ, మన తాతముత్తాతలు మాత్రం రైతులే. భూమిని నమ్ముకున్న వాళ్లే. భూమ్మీద నిలబడిన వాళ్లే. మనం ఆకాశంలో విహరిస్తూ భూమిని మరిచిపోతున్నాం.
రైతులు ఢిల్లీ ముట్టడి ప్రారంభమైనప్పటి నుంచి మన పత్రికల్ని గమనిస్తున్నాను. ఫస్ట్ పేజీలో వార్తలు వేస్తున్నారు తప్ప , అన్ని వేల మంది రైతులు చలిగాలిలో వణుకుతూ ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, వాళ్ల కష్టాలు, బాధలు వేసిన వాళ్లు లేరు. ఫొటో ఫీచర్ చేసిన వాళ్లు లేరు. ఇంగ్లీష్ పత్రికల్లో వేసే మూడు చిన్నచిన్న ఎడిటోరియల్స్‌లో కాసింత రైతుల కోసం కేటాయించారు. ఎడిట్ పేజీలో వ్యాసాలంటూ ఏవీ రాలేదు. తెలుగు పత్రికల్లో ఏదో ముక్తసరిగా రెండు వ్యాసాలు వచ్చాయి. హరగోపాల్ రాసిన వ్యాసం దాంట్లో విలువైంది.
నేను 25 ఏళ్లు జర్నలిస్ట్‌గా పనిచేసాను. జర్నలిజమంటే రాజకీయ నాయకుల కొట్లాటలు, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు , తిరుమల బ్రహ్మోత్సవాలే తప్ప రైతు సమస్యలు కాదు. నేను ఎక్కువ రోజులు తిరుపతిలో పని చేసాను. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం జీవనాధారం. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ దివాళా తీయడంతో చెరుకు రైతులు రోడ్డున పడ్డారు. వాళ్ల కష్టాలపై ఏనాడూ ఒక సప్లిమెంట్ వేయలేదు. ధర లేక మదనపల్లె టమోటా రైతులు రోడ్డు మీద పారేసి పోయేవాళ్లు. వార్తలు తప్ప వాళ్ల జీవితాల్లోకి దూరి పరిశోధనాత్మక కథణాలు రాసింది తక్కువ. ప్రభుత్వ డెయిరీని ముంచేసి చంద్రబాబు హెరిటేజ్‌ని బాగు చేసుకున్నారు. పాడి రైతుల కష్టాల గురించి రాసేవాళ్లు లేరు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగితే సప్లిమెంట్స్, సినిమా సభలు జరిగితే ప్రత్యేక ఇంటర్వ్యూలు. ఎందుకంటే వాళ్లు యాడ్స్ ఇస్తారు, డబ్బులొస్తాయి. రైతులు ఏమిస్తారు? వాళ్లే పేదవాళ్లు, ఇన్నేళ్ల తర్వాత కూడా ఏం మారలేదు.
ఆశ్చర్యంగా ఖలీజ్‌టైమ్స్ (అరబ్ పత్రిక)లో రైతులు చపాతి చేస్తున్న ఫొటోలు, వాళ్ల పరిస్థితి మీద వార్తలొచ్చాయి. రైతుల బాధ మీద అరబ్ పత్రికకు ఉన్న సానుభూతి కూడా మనకి లేదు.
రైతుల్ని దూరం చేసుకోవడం మొదలై మూడు దశాబ్దాలు దాటింది. పత్రికలకి కూడా సూటుబూటు వేసుకునే ఇంగ్లీష్ మాట్లాడే నాయకులంటేనే క్రేజ్. గతంలో చరణ్‌సింగ్ ,దేవిలాల్‌ని ఎద్దేవా చేసేవాళ్లు. పార్లమెంట్‌లో రైతుల పట్ల గౌరవంతో మాట్లాడే నాయకులు వాళ్లు. రైతు ఉద్యమాల నుంచి వచ్చినవాళ్లు. వాళ్లని మన జర్నలిజం జోకర్లగా మార్చింది. ఎందుకంటే వాళ్లకు ఇంగ్లీష్ రాదు.
అంజయ్య మాజీ ముఖ్యమంత్రి. అచ్చ తెలంగాణా యాసలో జనం పట్ల ప్రేమతో మాట్లాడేవాడు. రైతుల్ని ప్రేమించిన మనిషి. ఆయన్ని మోటు మనిషిగా కార్టూన్లు వేసారు. ఇదంతా కంటికి కనపడని కార్పోరేట్ కుట్ర.
పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి కోళ్ల రైతుల్ని ఏ రకంగా కూలీవాళ్లగా మార్చాయో చూస్తూనే వున్నాం. అదే విధంగా వందల వేల ఎకరాల అగ్రిఫామ్స్ వచ్చి చిన్న రైతులు లేకుండా చేయాలనే కుట్రకి పునాది ఎప్పుడో పడింది. వాల్‌మార్ట్‌లు , డీమార్ట్‌లు కిరాణా కొట్ల వాళ్లని దివాళా తీయించినట్టు, రైతుల మెడపై కత్తి పెట్టారు.
రైతు ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చు అంటున్నారు, ఎక్కడ అమ్ముకుంటాడు? అన్ని మార్కెట్లను దళారీల గుప్పిట్లో పెట్టి , రైతులకి రహదారి ఏర్పాటు చేసినట్టు మాట్లాడుతున్నారు. కిసాన్ రైళ్లు ఏ మాత్రం సక్సెస్ అయ్యాయో రైల్వే వాళ్లని అడిగితే చెబుతారు.
కల్తీ మందులు కొంటే రైతుకే నష్టం. వాన రాకపోయినా, ఎక్కువ వచ్చినా రైతుకే నష్టం. అన్నీ ఓర్చుకుని మార్కెట్‌కు వెళితే ధర వుండదు. ఈ బాధలన్నీ వద్దు. పిల్లల్ని చదివించుకుందామంటే ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ, అనారోగ్యం వస్తే ఆస్పత్రుల దోపిడీ.
ఇది పంజాబ్ రైతుల సమస్య కాదు. అన్నం తినాలనుకునే ప్రతి ఒక్కరిదీ. అక్కడ మేల్కొన్నారు. ఇంకా చాలా రాష్ట్రాలు నిద్రపోతున్నాయి. వ్యవసాయం అంశంగా సాహిత్యంలో తగ్గిపోయింది. సినిమాల్లో రైతు ఎప్పుడో తప్పుకున్నాడు. పత్రికలు రైతు వార్తలు వేస్తాయి, బాధలు కాదు. ప్రభుత్వాలు మెడపైన కొత్త చట్టాలు వేలాడదీస్తాయి.
మరి రైతు ఎక్కడికి పోయి బతకాలి
మట్టిని నమ్ముకున్న వాడి నోట్లో మట్టి కొడితే అన్నం పుట్టదు
అన్నం మానేసి నువ్వు పిజ్జాలు, బర్గర్లు తినాలన్నా
ఆ గోధుమలు కూడా రైతు చెమటలోంచి పుట్టాల్సిందే…
ఓలా, ఊబర్లు వచ్చి నగరాల్లో డ్రైవర్ల పొట్ట కొట్టాయి. మొదట అద్భుతమైన ఇన్‌సెంటివ్‌లు ఇచ్చి అందర్నీ వలలోకి లాగాయి. తక్కువ ధరలకి జనాలని అలవాటు చేశాయి. తర్వాత పంజా విసిరాయి. డ్రైవర్లు చక్ర వ్యూహంలో ఇరుక్కుని కంతులు కట్టలేక దివాళా తీశారు. క్యాబ్‌ల ప్రభంజనంలో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. అలవాటు పడిన జనం ఎక్కువ ధర ఇస్తున్నారు. డ్రైవర్లు కూలీలుగా మారిపోయారు.
జియో కంపెనీ ఫ్రీ అని ఇతర కంపెనీలని దివాళా తీసింది. ఇప్పుడు రేట్లు పెంచితే ఇంటర్‌నెట్ అలవాటు పడిన మనం , జియోని పెంచి పోషిస్తున్నాం.
రేపు రిలయన్స్ ఆగ్రో అని వస్తారు. చిన్న రైతుల నుంచి భూములని లీజుకు తీసుకుంటారు. వాళ్లు చెప్పిన పంటలే వేసి రైతు తన భూమిలో తానే కూలీగా మారతాడు. లాభాల కోసం వ్యాపార పంటలే పండిస్తారు కాబట్టి తిండి గింజలకి భద్రత ఉండదు. ధరలు పెరిగితే మధ్య తరగతి , పేదవాళ్లు మాడిపోతారు. కరోనాకి వ్యాక్సిన్ వస్తోంది. ప్రపంచీకరణకి కార్పోరేట్ దాహానికి వ్యాక్సిన్ లేదు, రాదు కూడా.
రైతుల ఇంటి తలుపును దొంగలు కొడుతున్నప్పుడు, మనం లేవకపోతే అదే దొంగ మన ఇంటికి కూడా వస్తాడు.