iDreamPost
iDreamPost
కాకినాడ టు చెన్నై… ఇప్పుడంటే ప్రయాణీకులను, సరుకులను తీసుకుని రైళ్లు.. బస్సులు.. లారీలు వెళతున్నాయి కాని ఒకప్పుడు స్టీమర్లు వెళ్లేవంటే అతిశయోక్తి కాదు. ప్రయాణీకులు స్టీమర్లు ఎక్కి నాటి కోకనాడ నుంచి చెన్నాపట్నాం ఛలోఛలో అంటూ ప్రయాణాలు సాగించేవారు. చెన్నాపట్నం (నేటి చెన్నై)కే కాదు.. పాండిచ్చేరీ వరకు రాకపోకలు సాగేవి. సాధారణ ప్రయాణీకులతోపాటు ఈ రెండు పట్టణాల మధ్య సరుకు రవాణా కూడా జోరుగా సాగేది. ఇది నాటి బ్రిటీష్ ప్రభుత్వ హాయాంలోనే కాదు.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా రవాణా వ్యవస్థ ఉండేది.
రహదారి వ్యవస్థ మెరుగుపడిన తరువాత జలరవాణా ప్రాధాన్యత కోల్పోయింది. రోడ్డు రవాణా కన్నా జల రవాణా తక్కువ వ్యయం అవుతుందని, కాలుష్యం తగ్గుతుందని నిపుణుల నివేదికలతో కేంద్రం జలరవాణా ప్రోత్సాహానికి నడుంబిగించింది. దీనిలో భాగంగా ఉత్తరాధిన గంగా నదితోపాటు, దక్షిణాన గోదావరి, కృష్ణా, పెన్నా నదులు మీదుగా సాగే బకింగ్ హాం కెనాల్‌ను పునరుద్ధరించి జల రవాణాను ప్రోత్సహించాలని నిర్ణయించింది. అయితే ఇది గత కొన్నేళ్లుగా ప్రతిపాధనలకే పరిమితమైంది. ఇది కనుక పట్టాలెక్కితే దక్షిణాధి రాష్ట్రాల జలరవాణా వ్యవస్థలో బ‘కింగ్’ హాం కెనాల్‌గా అభివృద్ధి చెందుతుందని నిపుణుల అంచనా.
జాతీయ జలరవాణ నెం.4గా గుర్తింపు..
దేశంలో జల రవాణా ప్రోత్సాహంలో భాగంగా బకింగ్ హాం కెనాల్‌ను కేంద్రం జాతీయ జలరవాణా నెం.4గా గుర్తించింది. ప్రతిపాధిత జలరవాణా వినియోగంలోకి వస్తే ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా సాగుతుంది. గోదావరి మీద భద్రాచలం (తెలంగాణా) నుంచి రాజమహేంద్రవరం వరకు, కాకినాడ నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)ను మీదుగా చెన్నై (తమిళనాడు) వరకు, అక్కడ నుంచి పాండిచ్చేరీ (పాండిచ్చేరీ) వరకు సాగనుంది. అలాగే కృష్ణా నది మీద వజీరాబాద్ (తెలంగాణా) నుంచి విజయవాడ (ఆంధ్రా) వరకు జలరవాణ జరగనుంది.
Also Read : P Gannavaram Aqueduct – రాజోలు దీవి చరిత్రను మార్చిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?
60 ఏళ్లు రవాణా..
ఈ కెనాల్ బ్రిటీష్ ప్రభుత్వ హాయాంలో నిర్మాణమైంది. కరువులో కొన్ని లక్షల మంది మరణాలు అరికట్టడానికి బకింగ్ హాం కెనాల్ కారణం. 1880 నుంచి 1940 వరకు మద్రాస్, కాకినాడ మధ్య రవాణా నిరంతరాయంగా సాగింది. పాత బకింగ్ హాం కెనాల్ పొడవు 796 కిలోమీటర్ల పొడవు. ప్రయాణీకుల రవాణాతోపాటు సిమెంట్, ఐరెన్, కలప, మసాలా దినుసులు, ఇతర నిత్యావసర వస్తువులు, వస్త్రాలు వంటి ఎగుమతులు, దిగుమతులు జోరుగా సాగేవి, ఈ కాలువతో లక్షల మంది ప్రజల జీవితాలు ముడిపడి ఉండేవి. అయితే రైల్వే వ్యవస్థ రావడం, చెన్నై కోల్‌కత్తా మధ్య గ్రాండ్ ట్రంక్ రోడ్డు 16 (ఎన్‌హెచ్ నెం.16 ) వేయడంతో రోడ్డు రవాణా పెరిగింది. రహదారులు విస్తరించినట్టుగా కాలువలను వెడల్పు చేసే అవకాశం లేకుండా పోయింది. దీనితో నాటి బ్రిటీష్ ప్రభుత్వానికి దీని అవసరం తగ్గుతూ వచ్చింది. వినియోగం లేకపోవడంతో బకింగ్ హాం నిరుపయోగంగా మారిపోయింది. గోదావరి, కృష్ణా కాలువల్లో 1980 వరకు రవాణా జరిగినా కేవలం ఇసుక, ఉప్పు రవాణాకు మాత్రమే పరిమితమైంది.
1993లో సర్వే..
రోడ్డు, రైలు రవాణా వ్యవస్థకన్నా జల రవాణా ఖర్చు తక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరంగా సరఫరా చేసే వస్తువులు మినహా ఎక్కువ రోజులు రవాణా చేసినా ఇబ్బంది లేని వస్తువులను జలరవాణా ద్వారా పంపితే మంచిదంటున్నారు. దీని వల్ల విద్యుత్, డీజిల్, పెట్రోల్ పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. ఇది పర్యాటకానికి కూడా ఊతమిస్తుంది. దీనిని ధృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా మూడు అంతర్గత జలరవాణాను ప్రోత్సహించాని కేంద్రం భావించింది. దీనిలో భాగంగా బకింగ్ హాం కెనాల్ పునరుద్దరణపై 1993లో ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అధారటీ ఆఫ్ ఇండియా సర్వే చేశారు. ప్రతిపాధిత బకింగ్ హాం రవాణా వ్యవస్థలో కొత్తగా భద్రచలం, వజీరాబాద్‌ను చేర్చారు. దీనితో ఇది 1,028 కిమీల మార్గం అవుతుందని గుర్తించారు. 2007లో బకింగ్ హాం పునరుద్దరణకు రూ.1515 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు అంచనా రూ.2 వేల కోట్లకు పైమాటే.
Also Read : నది మన జీవనం
మూడు దశల్లో ఆధునీకరణ..
బకింగ్ హాం కాలువను మూడు దశల్లో ఆధునీకరించాలని నిర్ణయించారు. మొదటి దశలో భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం నుంచి ఏలూరు మధ్య మొత్తం 295 కిమీలు, రెండవ దశలో పెదగజాం నుంచి ఎన్నూర్ సౌత్, ఎన్నూరు సౌత్ నుంచి పాండిచ్చేరి వరకు మొత్తం 398 కిమీలు ఆధునీకరించాల్సి ఉంది. మూడవ దశలో వజీరాబాద్ నుంచి విజయవాడ, ఏలూరు నుంచి విజయవాడ, పెదగజాం నుంచి విజయవాడ 335 కిమీలుగా గుర్తించారు.
అవాంతరాలు ఎక్కువే..
బకింగ్ హాం కెనాల్ ఆధునీకరణకు అవాంతరాలు చాలానే ఉన్నాయి. గోదావరి, కృష్ణా డెల్టా కాలువల వ్యవస్థ ఉన్నందున ఇక్కడ నిర్మాణం వేగంగా జరిగే అవకాశముంది. కాని దివిసీమ తుపానుతో ఈ కాలువ భాగా దెబ్బతింది. నాటి నుంచి పట్టించుకునేవారు లేకుండా పోయారు. వీటి మీద వంతెనలు, చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఆక్వా చెరువుల పేరుతో కొంత కబ్జా చేశారు. చెన్నైతోపాటు పలు నగరాల్లో కాలువల మీద ఇస్టానుసారం వంతెన్ల నిర్మాణాలు జరిగాయి. వీటిని తొలగిస్తే ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఒకానొక సమయంలో కేంద్రం దీనిని పీపీపీ పద్ధతిలో ఆధునీకరించాలని అనుకున్నా ప్రతిపాధనలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. దీని నిర్మాణం పూర్తయితే మాత్రం కాకినాడ నుంచి చెన్నై వరకు ఉన్న బకింగ్ హాం కాలువలో స్టీమర్లు, పడవలు లాహిరి.. లాహిరి అంటూ సాగిపోతాయి.
Also Read : Antarvedi – సముద్రపు అలజడి… దేనికి సంకేతం?