iDreamPost
android-app
ios-app

స‌చివాల‌యం కూల్చివేత‌ల్లో ఎందుకంత ర‌హ‌స్యం.?

స‌చివాల‌యం కూల్చివేత‌ల్లో ఎందుకంత ర‌హ‌స్యం.?

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌, హైద‌రాబాద్ కు చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిటిష‌న్ ల విష‌యంలో స‌ర్కారుకు అనుగుణంగా కోర్టు తీర్పులు వెలువ‌డిన విష‌యం విదిత‌మే. తాజాగా.. సచివాలయంలోకి మీడియాకు అనుమతించాలని మ‌రో పిటిష‌న్ హైకోర్టులో దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది. దీనిపై కూల్చివేతల వద్దకు మీడియాకు అనుమతి ఇవ్వలేమని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది.

తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని పిటీషనర్ కోరారు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రకారం మీడియాకు పూర్తి స్వేచ్చ ఉందని తెలిపారు. అయితే పరిస్థితుల ప్రభావంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. అసలు ఈ కేసులో చట్టం ప్రకారం ఎలాంటి అర్హత లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎందుకు లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సచివాలయ పరిసర ప్రాంతాలలో వెళ్లి కూల్చివేతలను కవరేజ్ చేస్తున్న మీడియాను అడ్డుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో ప్రసారం అయిందని, అది నిజమే లేదో తెలియాల్సి అవసరం ఉందని పిటీషనర్ కోర్టును కోరారు. ప్రైవేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియా అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం కోట్ల రూపాయల సంపదను లైవ్‌లో చూపించిన మీడియాను ఇప్పుడు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం అనుమతి మీడియాకు అనుమతిస్తుందని అనుకున్నామని, అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. శనివారం పిటిషన్ అర్హతపై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను శనివారానికి హైకోర్టు వాయిదా వేసింది.

గ‌తంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స‌చివాల‌యం భూగ‌ర్భంలో నిజాం నిధులున్నాయంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఇప్పుడు కోర్టు కూడా కూల్చివేత‌ల్లో ఎందుకంత ర‌హ‌స్యం.? అని ప్ర‌శ్నించ‌డంతో తెలంగాణ‌లో దీనిపై విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.