Idream media
Idream media
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు గుర్తున్నారు కదా? ఆయన ఇప్పుడేం చేస్తున్నారు, ఉద్యమంలో ఎక్కడా కనబడరే, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇంకా ప్రణాళికల రచనలోనే ఉన్నారా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. మొదట్లో ఆవేశంగా రాజీనామా చేసిన గంటా, ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు స్టేట్ మెంట్ లు ఇవ్వడం, విశాఖకు రావాల్సిందిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించడం మినహా ప్రత్యక్షంగా ఉద్యమం చేసినట్లు ఎక్కడా కనిపించ లేదు. ఇప్పుడైతే ప్లాంట్ పరిరక్షణ కోసం కనీసం ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు.
కేంద్రం ప్లాంట్ అమ్మకానికి టెండర్లు పిలిచే వరకు వచ్చినా ఆయన మాట వినిపించడం లేదు. కార్మికులకు మద్దతుగా అధికార పార్టీ రంగంలోకి దిగడంతో, రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా ఉద్యమాన్ని లీడ్ చేసుకుందామనుకున్న గంటా ఆశలు అడియాశలు అయ్యారా, ఊహించని దానికి విరుద్ధంగా జరగడంతో ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కు రాజకీయంగా మంచి అనుభవమే ఉంది. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా అరంగేట్రం చేసిన గంటా 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలించేంతవరకూ ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. ఏకంగా ఏడేళ్ల పాటు కాంగ్రెస్ టీడీపీలలో మంత్రిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం టీడీపీ ఓడిపోవడంతో గంటా కూడా సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు పోరాటం కోసం రాజీనామా చేసిన గంటా ఇపుడు సైలెంట్ గా ఉన్నారు. అలాగే, కొన్ని అంశాల్లో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా, గంటా మాత్రం మోగడం లేదు. అధికార పక్షాన్ని నిందించడం కానీ, వత్తాసు పలకడం కానీ చేయడం లేదు. కనీసం విశాఖ ఉక్కు ఉద్యమం కోసం కూడా మాట్లాడడం లేదు.
ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. రెండేళ్ల క్రితం విశాఖ జిల్లా రాజకీయం అంతా తానే అంటూ చక్రం తిప్పిన గంటా ఇలా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశారు. కానీ అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. స్పీకర్ తమ్మినేని గంటా రాజీనామాపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్మిక సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. కానీ గంటా ఏదీ పట్టించుకోవడం లేదు. దీంతో ఆ మాజీ మంత్రి నిజంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగానే రాజీనామా చేశారా? టీడీపీలో భవిష్యత్ లేదని భావిస్తున్న ఆయన ఇదే అదునుగా రాజకీయ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశారా? అనే సందేహాలు వెంటాడుతున్నాయి. మరి ఇప్పుడైన ఆయన లైన్ లోకి వచ్చి ఈ సందేహాలను నివృత్తి చేస్తారా చూడాలి.