iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మళ్లీ తెరమీదకు వస్తోంది. త్వరలోనే జిల్లాల విభజన అంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు. వచ్చే సాధారణ బడ్జెట్ నాటికే జిల్లాల విభజన జరుగుతుందని ఆయన ప్రస్తావించారు. దాంతో రాబోయే ఆర్థిక సంవత్సరం కొత్త జిల్లాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఏపీ రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సి ఉంది. పాలనా సౌకర్యం పేరుతో తెలంగాణాలో అది జరిగినా ఏపీలో మాత్రం చంద్రబాబు సర్కారు దాని జోలికి పోలేదు. చివరకు 13 సంఖ్య శ్రేయస్కరం కాదంటూ మరో కొత్త జిల్లా ఏర్పాటు కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చి వెనక్కి తగ్గారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు, రంపచోడవరం, జంగారెడ్డి రెవెన్యూ డివిజన్లు కలిపి 14వ జిల్లా ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ కూడా చేశారు. కానీ అది కూడా అమలుకి నోచుకోలేదు.
Also Read:చేతులు కలిపిన నాని- రాధా , టీడీపీ గుండె జారి గల్లంతయ్యిందే
జగన్ మాత్రం తాము అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. దానిని ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. దాంతో జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తులు కూడా చేసింది. ఎన్నికల హామీ అమలుచేసేందుకు పూనుకుంది. అయితే అనూహ్యంగా జనగణన ముందుకు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈపాటికే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ జనాభా లెక్కలు పూర్తయ్యేవరకూ రెవెన్యూ సరిహద్దులు మార్చవద్దంటూ కేంద్రం చేసిన సూచనలతో అది నిలిచిపోయింది.
కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణ కూడా సాగలేదు. దాంతో ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల ద్వారా పాలనా వికేంద్రీకరణ ప్రయత్నాలు రాష్ట్రస్థాయిలో చేపట్టగా, జిల్లాల పునర్విభజన ద్వారా జిల్లా స్థాయిలోనూ మార్పులకు జగన్ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అయితే రాబోయే ఆరు నెలల్లోనే కొత్త జిల్లాలు అంటూ కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు ఏమేరకు వాస్తవ రూపం దాలుస్తాయో చూడాల్సి ఉంది.
Also Read:నాడు చంద్రబాబు, నేడు మాయావతి.. ఒకే డైలాగ్
ఇప్పటికే కొత్త జిల్లాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలకు అనుమతినివ్వడం సహా వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న మౌలిక సదుపాయాల వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. కొత్తగా జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే దానికి అనుగుణంగా ఉండాల్సిన సదుపాయాల గురించి చర్చించింది. ఈ తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటుకి కేంద్రం నుంచి అడ్డంకులు తొలిగితే తక్షణమే ఏపీ ప్రభుత్వం రంగంలో దిగే అవకాశం ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం ఉండగానే జిల్లాల విభజన జరిగితే అప్పటికి పాలన గాడిలో పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందే జరగాల్సి ఉండగా కేంద్రం నిబంధనలతో అది నిలిచిపోయినందున ఇక ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read:కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?