iDreamPost
android-app
ios-app

ఈట‌ల బీజేపీ వైపు చూడటానికి కార‌ణాలు ఇవేనా..?

ఈట‌ల  బీజేపీ వైపు చూడటానికి కార‌ణాలు ఇవేనా..?

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డానికి చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్నారు. టీఆర్‌ఎస్‌ స్థాపించిన తరువాత తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కేసీఆర్‌ వెంట నడిచిన కొద్ది మందిలో ఈటల ఒకరు. ఇప్పుడాయ‌న ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త‌న రాజ‌కీయ జీవితాన్ని కొత్త మ‌లుపు తిప్ప‌బోతున్నారు. బీసీ నాయకుడిగా పార్టీలో అనతికాలంలోనే ఎదిగిన ఆయన కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా ప్రతి కీలక ఘట్టంలో కొనసాగారు.

2014లో తెలంగాణ సిద్ధించి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన తొలి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక మంత్రి పదవిని చేపట్టారు. 2018లో రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధినేతతో పెరుగుతూ వచ్చిన దూరం చివరకు మంత్రి పదవి నుంచి తొలగించేంత వరకూ వెళ్లింది. పార్టీతో ఆయనకున్న రెండు దశాబ్దాల అనుబంధం బీటలు వారింది.

ఆ భావ‌జాలానికి ఈట‌ల దూరం కానీ..

ఆరు సార్లు(రెండు ఉప ఎన్నికలు కలిపి )వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచిన ఈట‌ల ఆది నుంచీ కాషాయ‌భావ జాలానికి దూరంగానే ఉన్నారు. విప్ల‌వ‌, ఉద్య‌మ భావాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేవారు. అలాంటి వ్య‌క్తి బీజేపీని ఎంచుకోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, తరుణ్‌ తుగ్‌, మాజీ ఎంపీ వివేక్‌, ఏనుగు రవీందర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈటల బీజేపీలో చేరిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారు చర్చించే అవకాశాలు ఉన్నాయి. నేడో, రేపో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

నాడు స్వతంత్రంగానే అన్నారు…

ఇదిలా ఉండ‌గా ఈట‌ల బీజేపీ వైపు అడుగులు వేయ‌డానికి ఆస‌క్తిక‌ర కార‌ణాలు ఉన్నాయి. బీజేపీలో చేరడానికి ముందే ఈటల రాజేందర్ ప్రతి ఒక్కరినీ కలిశాడు. వామపక్ష పార్టీలు కాంగ్రెస్ మరియు తెలంగాణ జన సమితి నేతలను సహా కేసీఆర్ చేతుల్లో అణచివేతకు గురై ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మద్దతు కోరారు. కేసీఆర్ ను ఎదురించడమే ధ్యేయమని ఈటల నాడు ప్రకటించారు. కేసీఆర్ వ్యతిరేకులైన ప్రతి వ్యక్తి నుండి తాను మద్దతు కోరుతున్నానని స్వతంత్రంగా హుజురాబాద్కు ఉప ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా ఈటల మీడియాతో అన్నారు. తాను కలిసిన వివిధ పార్టీల నాయకులకు ఇదే విషయాన్ని ఈటల చెబుతున్నారు.

ప్రతీ రాజకీయ పార్టీ రాజేందర్ పట్ల సానుభూతి వ్యక్తం చేసింది స్వతంత్రంగా ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీని పెట్టాలని.. ఆయనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని ఈటలకు సూచించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఈటలను ఆహ్వానించినట్టు సమాచారం. పార్టీలో చేరితే తనకు కాంగ్రెస్ నుంచి పూర్తి హృదయపూర్వక మద్దతు లభిస్తుందని అయితే ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని నిలబెట్టవలసి వస్తుందని ప్రకటించారు.

బీజేపీ నుంచి అద‌న‌పు హామీ

రాజేంద‌ర్ బీజేపీ నాయకుల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల్లో అరెస్టు చేయకుండా కేంద్రం తనకు రక్షణ కల్పిస్తుందని బీజేపీ నాయకులు అదనపు హామీ ఇచ్చినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది. అవసరమైతే పార్టీ అధికారంలోకి వస్తే పెద్దపీట వేస్తామని ప్రతిపాదన చేసినట్లుగా తెలిసింది. కాబట్టి స్వతంత్రంగా పోరాడడంలో అర్థం లేదని ఈట రాజేందర్ భావించినట్టు సమాచారం. ఎందుకంటే ఒంటరిగా పోటీచేస్తే ఎవరూ ఈటలకు మద్దతు ఇవ్వరు. చివరికి అది టిఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరుస్తుంది. అన్ని సాధకబాధకాలను అంచనా వేసిన తరువాత బీజేపీ ఆఫర్ మంచిదని ఈటల గ్రహించి అటువైపు దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.