iDreamPost
android-app
ios-app

బీసీల జనగణనపై బీజేపీ ఎందుకు మాట మార్చింది?

  • Published Sep 24, 2021 | 3:17 AM Updated Updated Sep 24, 2021 | 3:17 AM
బీసీల జనగణనపై బీజేపీ ఎందుకు మాట మార్చింది?

దేశంలో కులాల వారీగా జనాభా వివరాలు సేకరించాలనే ప్రతిపాదన ఈనాటిది కాదు. సుదీర్ఘకాలంగా ఈ డిమాండ్ ఉంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత నేటికీ ఒక్కసారి కూడా కులాల వారీగా జనాభా వివరాలు సేకరించలేదు. ప్రతీ పదేళ్లకు ఓసారి జరిగే జనాభా లెక్కల్లో కేవలం మత సంబంధిత అంశాలే తప్ప కులాల లెక్కలు కనిపించవు. ఫలితంగా ఏ కులాలకు చెందిన సంఘాల నాయకులు ఆయా కులాల లెక్కలు చెబుతున్నారు. కొన్ని రాష్ట్ర జనాభా కన్నా తామే ఎక్కువగా ఉన్నామనే రీతిలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. కానీ అసలైన లెక్కలు, అధికారిక డేటా మాత్రం అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి వాటికి ఆస్కారం కలుగుతోంది.

1931లో బ్రిటీష్ ప్రభుత్వం ఉండగా దేశంలో కులాల వారీగా వివరాలు సేకరించారు. ఆ తర్వాత స్వతంత్ర్యానంతరం తొలి జనగణనలోనే వాటిని సేకరించాల్సి ఉండగా అది వాయిదా పడుతూ వస్తోంది. చివరకు 2010లో జనగణన సందర్భంగా కులాల లెక్కలు తేల్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. నాటి యూపీఏ ప్రభుత్వం దానికి సిద్ధం కాలేదు. దాంతో నేటికీ ఎస్సీ, బీసీ, ఎస్టీ రిజర్వేషన్లకు పూర్వకాలం నాటి లెక్కలే కొలబద్ధలుగా ఉంటున్నాయి. మండల్ కమిషన్ సిఫార్సులకు కూడా పాత లెక్కలే ఆధారమయ్యాయి.

గత ఏడాది నిర్వహించాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వాటిని సేకరించే ప్రయత్నాలు జరుగుతుండగా వివిధ పార్టీలు కులాల వారీ లెక్కలు కూడా సేకరించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ కి చెందిన రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రధానిని కలిశారు. వినతిపత్రం ఇచ్చారు. బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి 2016లోనే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. త్వరలో జరిగే జనగణనలో కులాల లెక్కలు తేలుస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దానికి ససేమీరా అంటోంది. తామే డిమాండ్ చేసి, తామే పార్లమెంట్ లో ప్రకటన చేసిన దానికి భిన్నంగా కోర్టులో అఫిడివిట్ దాఖలు చేసింది. కులాల లెక్కలు ఇప్పుడు కాదంటూ తేల్చేసింది.

Also Read : కోవిడ్ మృతులకు పరిహారం.. రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్రం

కేంద్రం చెబుతున్న కారణాల్లో కులాల లెక్కలు తేలిస్తే కులవిభజన పెరుగుతుందన్నది ప్రధానమైనది. కానీ కులగణన కోరుతున్న వారంతా ఇప్పటికే కులాల వారీగా ప్రజలు విడదీసి ఉన్న వాస్తవాన్ని విస్మరించవద్దని చెబుతున్నారు. ఇక వివిధ కులాల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు పగడ్బందీగా అమలుకావాలంటే ఏ కులం ఎంతమంది ఉన్నారనే డేటా తేలాలని కోరుతున్నారు. అప్పుడు మాత్రమే డేటా ఆధారంగా తగిన పథకాలు అమలు చేయడం వీలవుతుందని చెబుతున్నారు.

ఇప్పుడు అటువంటి వివరాలు లేకపోవడంతో పథకాలన్నీ ఫలితాన్నివ్వడం లేదని వాదిస్తున్నారు. బీజేపీ ఇలాంటి వైఖరి తీసుకోవడానికి రెండు ప్రధాన కారణాలుగా విశ్లేషకుల అంచనా. ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నప్పటికీ ఓబీసీలకు న్యాయం చేయడానికి సిద్ధం కాకపోవడం వెనుక ఉన్న కారణాల్లో ఒకటి రిజర్వేషన్ల అంశం మరోసారి తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ఈకాలంలో పెరిగిన జనాభా ఆధారంగా తమకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ ఆయా తరగతుల నుంచి వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుంది.

ఇక మరో ముఖ్యమైన కారణం ఏమంటే ఉత్తరాదిన ప్రధాన బీసీ కులాలకు వ్యతిరేకంగా ఎంబీసీలను ఆర్ఎస్ఎస్, బీజేపీ దగ్గరకు చేర్చుకున్నాయి. యూపీ , బీహార్ లో యాదవ యేతర ఓబీసీలు బీజేపీకి అండగా నిలుస్తుండడం దానికో ఉదాహరణ. ఇప్పుడు ఓబీసీ వివరాలు బయటకు వస్తే ఈ కూర్పులో తమ అంచనాలు తప్పుతాయనే ఆందోళన బీజేపీలో ఉంది. దాంతో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని కలవరపడుతోంది. అసలే బీజేపీకి యూపీ పెద్ద పరీక్షగా మారిన తరుణంలో ఇలాంటి తేనెతుట్టని కదిలించే సాహసం చేయడానికి సిద్ధంగా లేదని తాజా అఫిడవిట్ తేలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా బీజేపీ అప్పట్లో డిమాండ్ చేసినా ఇప్పుడు కుదరదని చెప్పినా తన ప్రయోజనాలు ఆశించి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది.

Also Read : దేవాదాయశాఖను రద్దు చేస్తామంటున్న సోము వీర్రాజు