iDreamPost
iDreamPost
నాకు తెలిసిన ఒక ఇల్లాలుండేది. ఇంట్లోంచి గొతెప్పుడూ ఆమెదే విన్పించేది. ప్రతి పనికీ మైకు మింగేసినట్టు పెద్దపెద్ద కేకలు వేస్తూ వీధి గుమ్మంలోకొచ్చేసి పదిమందికీ కన్పించేటట్టు చీరకొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదేస్తూ ‘చూసే వాళ్ళకు అయ్యోపాపం ఎంత బాదపడుతుందో..’ అన్నట్లుగా వ్యవహరించేది. వీధమ్మట పోయేవాళ్ళు చూస్తే అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో ఈ అమ్మడికి వీధిలోకొచ్చి మరీ కన్నీరు పెట్టుకుంటుందే అని చూస్తూ వెళ్ళిపోయేవారు. సదరు మా తల్లి ఇంటికీ ఇరువైపులా ఉన్నవాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. వీధమ్మటపోయే వాళ్ళు ఒకరిద్దరు వీళ్ళింటి వద్ద ఆగి ఇంట్లో ఉన్న ఆమె మొగుడ్ని పిలిచి అదేంటబ్బాయ్ అమ్మాయిని అలా కళ్ళనీళ్ళు పెట్టిస్తున్నావ్ అంటూ మందలించిన సందర్భాలు కూడా అప్పుడప్పుడు చోటు చేసుకునేవి. ఉత్సుకత ఆగని ఇంకొందరు ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఆరా తీసే ప్రయత్నం కూడా చేసేవారు. తీరా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే వివరణ చూసాక ముక్కున వేలేసుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు.
ఇల్లాలి ఇంటికి అటూ, ఇటూ ఉన్న వాళ్ళు చెప్పేదేంటంటే .. ‘‘పాపం ఆ మొగుడికి నోట్లో నాలుక లేదాయె.. అమ్మడ్ని ఏమైనా అందాము అనుకునే లోపే మొగుడ్ని నాలుగు అనేసి, అవసరమైతే రెండు మొట్టికాయలు, నాలుగు లెంపకాయలు కూడా కొట్టేసి రోడ్డు మీదకొచ్చి ఏడ్పులు, పెడబొబ్బలో పెట్టడం ఈమెకు పెళ్ళాం పదవి వచ్చిన నాటి నుంచే అలవాటు’’ అనే వివరించడం ఆ వీధిలో వాళ్ళకు నిత్యకృత్యంగా ఉండేది. ఎప్పటికైనా రెండు దెబ్బలేసి పెళ్ళాం నోరు అదుపులో పెట్టకపోతాడా ఆ మొగుడు అని చూస్తున్నాం అంటూ కాస్తంత వెటకారంగానే వివరిస్తుండేవారు కూడాను..
ఇంత భారీ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సదరు ఇల్లాలికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఫార్టీటు ఇయర్స్ పెద్దమనిషొకరు రాష్ట్రంలో (సారీ పక్కరాష్ట్రంలో) కొలువుదీరారు. సీయం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం, యంత్రాంగం ఒక పక్క కోవిడ్ 19ను ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గా ఎదుర్కొంటూనే రాష్ట్రంలోని ఏ వర్గానికి ఇబ్బందులులేకుండా సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఘనత వహించిన పెదబాబు పార్టీ నాయకులు అధికారం వెలగబెట్టినప్పుడు చేసిన ఘనకార్యాలకు చట్టం ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. ఇప్పుడిప్పుడే తాజాగా చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కటకటాల వెనకక్కు వెళుతున్నారు. అయితే పక్క రాష్ట్రం నుంచి ఏపీలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న పెదబాబు మాత్రం ‘వీధి గుమ్మంలోకొచ్చి ఏడ్పులు, పెడబొబ్బలు’ ఏకధాటికి పెడుతూ ప్రజలకు మొహం మొత్తించేస్తున్నారు.
ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెంనాయుడుని అక్రమంగా అరెస్టు చేసారు, హత్య కేసులో కొల్లు రవీంద్రను కావాలనే పెట్టారు, జేసీ బ్రదర్స్‌ను వేధిస్తున్నారు, డాక్టర్ సుధార్‌ను అవమానించారు.. దేవాలయాల్లో ఏదో జరిగిపోతోంది, ఎస్సీలను అవమానిస్తున్నారు, బీసీలను తక్కువ చేసేస్తున్నారు, ఇంకోటేదో చేసేయబోతున్నారు.. అయ్యబాబోయ్ దీని ఇలా చేసేసారు.. రాష్ట్రం ఇంకేదో అయిపోతోంది.. అంటూ రోడ్డెక్కి చీరకొంగుతో కళ్ళనీళ్ళు తుడిచేసుకుంటున్నారు. నిజానికి వీటికి సంబంధించిన నిజానిజాలు విచారణలో తేలుతున్నాయి. ప్రభుత్వానిదే తప్పుంటే న్యాయస్థానాలు కూడా ఒప్పుకోవు. ఇదిలా ఉంచితే అసలు ఈ నిట్టూర్పులన్నీ వాళ్లను చట్ట పరిధిలో నుంచోబెడుతున్నందుకా? లేక పెదబాబు అండ్ కంపెనీ కూడా చట్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందేమోనన్న అనుమానంతోనా? అన్నదే ప్రజల మెదళ్ళను తొలుస్తున్న మిలియన్‌డాలర్ల ప్రశ్న. ముందుగానే చెప్పుకున్నట్లు మొగుడు కొట్టకుండా ముందే ఏడ్చేసి, వీధికెక్కేస్తే గండం గడిచిపోతుంది.. అన్న టెక్నిక్కే ఇక్కడ కన్పిస్తుందన్నది కొందరి విశ్లేషకుల భావన. జరగబోయే పరిణామాలను కాలమే తేల్చాలి మరి.