Idream media
Idream media
చలమలశెట్టి సునీల్… తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో మూడు పర్యాయాలు గెలుపు గుర్రంగా ఎన్నికల బరిలో నిలిచి ..విజయం నల్లేరుపై నడక అన్నంతగా భారీ అంచనాలు ఉన్నప్పటికీ పరాజయం పాలైన నాయకుడు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ , 2019 లో తెలుగుదేశం … ఇలా మూడు సార్లు తాను పోటీ చేసిన పార్టీల తో పాటు తాను కూడా అధికారానికి ఆమడదూరం లో నిలిచిపోయిన దురదృష్టకరమైన చరిత్ర సునీల్ ది. ఇప్పుడు తూర్పు రాజకీయాల్లో చలమలశెట్టి సునీల్ పేరు మళ్ళి రాజకీయంగా హాట్ టాపిగ్గా మారుతోంది. దీనికి కారణం చలమలశెట్టి సునీల్ తిరిగి వైసీపీ లో పునరాగమనం చేస్తారన్న ప్రచారం.
చలమలశెట్టి సునీల్.. పారిశ్రామిక వేత్త, విద్యావంతుడు, యువకుడు. ప్రజల్లో మంచి చరిష్మా ఉన్న నాయకుడుగా రాజకీయంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సునీల్ .. కీలకమైన ఎన్నికల ఘట్టం వచ్చేసరికి విజయం సాధించలేకపోవడం గమనార్హం. కాపు సామాజికవర్గానికి చెందిన సునీల్ .. 2009లో ప్రముఖ హీరో ,సినీ నటుడు చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున రాజకీయ రంగప్రవేశం చేసారు. కానీ.. ఆ ఎన్నికల్లో సునీల్ ఓటమి పాలయ్యారు. రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టి ఆకర్షించారు. తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం .. చలమలశెట్టి సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిపోయాయి .కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చెయ్యడంలో కృషి చేసి, కీలకమైన నాయకుడుగా ఎదిగారు చలమలశెట్టి సునీల్.
వై ఎస్ జగన్ సైతం .. చలమలశెట్టి సునీల్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ తో నేరుగా మాట్లాడే చనువు ఉన్న నాయకుల్లో చలమలశెట్టి సునీల్ ఒకరుగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తాడని చలమలశెట్టి సునీల్ ని జగన్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. కానీ అప్పటి రాజకీయ సమీకరణాలు .. టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీల పొత్తు తో అంచనాలు తలకిందులయ్యాయి. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి వస్తుంది అనుకున్న వైసీపీ.. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖచ్చితంగా గెలుస్తాడనుకున్న సునీల్ .. విజయం సాధించలేకపోవడం కాకతాళీయం. ఈ ఎన్నికల్లో సునిల్ పై టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తోట నరసింహం 3,431 స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు.
Also Read : బొజ్జల కుటుంబానికి రాజకీయ పూర్వవైభవం సాధ్యమేనా..?
తర్వాత అయినా వైసీపీనే నమ్ముకుని .. 2019 ఎన్నికల వరకు సునీల్ సహనంతో ఉండి ఉంటే, పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి .. గెలిచేవారేమో. 2019 ఎన్నికలకు ముందు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి.. ఆ పార్టీ తరుపున పోటీ చేసారు. ముచ్చటగా మూడోసారి ఆయన వేసిన అడుగు తడబడింది.
2018 జులై లో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో సునీల్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ఆయన రీ ఎంట్రీకి వైస్ జగన్ కూడా పచ్చ జెండా ఊపారనే ప్రచారం సాగింది. పాదయాత్ర కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుందన్న రోజున పార్టీ ఫ్లెక్సీలలో సునిల్ ఫొటోలు వేసేందుకు నేతలు సిద్దమయ్యారు. కానీ ఏమైందో ఏమో.. సునిల్ రాకకు బ్రేకులు పడ్డాయి. ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థిత్వం రాజ్యసభ మాజీ సభ్యురాలు వంగా గీతకు లభించింది. సునిల్‌పై ఆమె 25,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు .. చలమలశెట్టి సునీల్ రాజకీయంగా విజయం సాధించలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయంగా సరైన సలహాలు తీసుకోకపోవడం, తప్పటడుగులు వేయడం, తొందరపాటు నిర్ణయాలు, కాపుసామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ..మిగిలిన సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేశారన్న అపవాదు, పార్టీలో వర్గ పోరాటాలు, అన్ని వర్గాలను సమన్వయము చేసుకోవడంలో వైఫల్యం .. ఇలా ఎన్నో అంశాలు సునీల్ అపజయాల్లో కనిపిస్తాయి.
ఆర్ధికంగా.. సామాజికంగా.. రాజకీయంగా… బలంగా ఉండికూడా విజయం సాధించలేకపోవడం చలమలశెట్టి సునీల్ దురదృష్టంగానే చెప్పాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే .. ఆ పార్టీకి చేరువవుతారన్న విమర్శలు ఉన్నాయి. సునీల్ .. వైసీపీలో తిరిగి చేరుతారన్న ప్రచారం ఏడాదిగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని యువతని ప్రోత్సహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో సీట్లు కేటాయింపు దీనికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో చలమలశెట్టి సునీల్.. వైసీపీలో చేరాలనే ప్రయత్నాలు ఫలిస్తే ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మూడు సార్లు.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సునిల్‌కు లోక్‌సభకు వెళ్లే యోగం ఉంటుంది.
Also Read : తోటకు కౌంటర్ ఇచ్చే కాపు నేతే లేరా..?