iDreamPost
android-app
ios-app

షకీల్ అలక హైకమాండ్ కు చేరిందా..?

షకీల్ అలక హైకమాండ్ కు చేరిందా..?

టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మారుతోంది. బయటకు నేతలెవరూ తమ అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉంటూ నియోజక వర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ కోవలోకి వస్తున్నాడు బోధన్ ఎమ్మెల్యే షకీల్. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా అటెండ్ కాకుండా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే షకీల్ ను పార్టీ పట్టించుకోకవడంపై అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇటు టిఆర్ఎస్ పార్టీ చిన్న బాస్ కేటీఆర్ తో అటు కవితతో మంచి సంబంధాలు కొనసాగిస్తు జిల్లాలో మంచి నేతగా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పై రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్ మైనారిటీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశతో ఇన్ని రోజులు వేచి చూశారు. కానీ టిఆర్ఎస్ నాయకత్వం నుండి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో పార్టీ పై అలక చెందినట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఒకసారి నిజాంబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ ను కలవడం జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సీన్లోకి ఎంటర్ అయినా కేటీఆర్ షకీల్ తో మాట్లాడి విషయాన్ని సెట్ చేశారు.అయినా అప్పటి నుంచి షకీల్ కు టిఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. 

అయితే ఇటీవల షకీల్ తండ్రి మరణం తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు పరామర్శించకపోవడం తీవ్రంగా కృంగదీసిందని చెబుతున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకొని ఉన్న తనకు పార్టీ నుంచి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో అసంతృప్తి, నైరాశ్యంలో ఉన్న షకీల్ కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవల అజ్ఞాతంలో నుండి బయటకు వచ్చిన షకీల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారంపై దృష్టిపెట్టారు. రాజకీయ పార్టీ నేతలను కూడా కొంతమందిని మాత్రమే కలుస్తూ ఉన్నారు.

ఇంతకాలం పార్టీ కోసం అన్నీ వదులుకొని పనిచేసిన తనలాంటి మైనార్టీ ఎమ్మెల్యేలను పార్టీ గుర్తించకపోవడం తీవ్రంగా కలచి వేసిందని ఇక పార్టీ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదని … పార్టీ పనులు పక్కన పెట్టి తన సొంత పనులు చూసుకోవడం బెటర్ అని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. షకీల్ అసంతృప్తి వ్యవహారం జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి చేరవేశారు . మంత్రి పదవి ఆశిస్తున్న షకీల్ కు టిఆర్ఎస్ నాయకత్వం ఏదైనా పదవి కట్టబెట్టి బుజ్జగిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీలో పదవి అసంతృప్తితో ఒక్కొక్కరు గా బయట పడుతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు గులాబీ దళపతి ఏం చేస్తారో చూడాలి.

Also Read : మొన్న మైనంపల్లి, నిన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు మల్లారెడ్డి వెనుక కారణాలేంటి..?